లోక్ సత్తా శ్రీనివాస్ ఇక లేరు..

by Sridhar Babu |   ( Updated:2021-02-15 08:25:06.0  )
Lok Satta Party leader Naredla Srinivas
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుక మూగవోయింది. అవినీతి వ్యతిరేక ఉద్యమ నేత, లోక్ సత్తా జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్(68) సోమవారం తెల్లవారుజామున కన్ను మూశారు. కొంతకాలంగా కొవిడ్ తో కరీంనగర్ లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న శ్రీనివాస్ సోమవారం ఉదయం 6 గంటలకు తుది శ్వాస విడిచారు. లోక్ సత్తా శ్రీనివాస్ సర్ గా పిలుచుకునే ఆయన మరణ వార్త తెలిసి అభిమానులు, జిల్లా వాసులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. శ్రీనివాస్ కు ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు.

అన్యాయాన్ని ఎదిరించడంలో ఆయనకు ఆయనే సాటి..

అన్యాయాన్ని నిర్భయంగా ప్రశ్నించేతత్వం కలిగిన ఆయన వద్దకు బాధితులు ఎంత నమ్మకంతో వెళ్లేవారో అంతే నమ్మకంతో వారికి బాసటగా నిలిచేవారు. లోక్ సత్తా శ్రీనివాస్ అంటే తెలియని జిల్లా వాసులుండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి వ్యక్తి చనిపోయాడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఏఎస్ఐ మోహన్ రెడ్డి బాధితుల పక్షాన చివరి వరకు పోరాటం సాగించారు. బొమ్మకల్ భూ అక్రమణల వ్యవహారాన్ని బయటకు తీసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా చేశారు. ఫేక్ డాక్టరేట్ పట్టాల బాగోతాన్ని బట్టబయలు చేశారు. వినియోగదారుల మండలి తరపున వందలాది కేసులు వేసి హక్కులను పరిరక్షించేందుకు కృషి చేశారు. అవినీతి అధికారులను ఏసీబీకి పట్టించడంలో కృషి చేసినవారిని పిలిపించి సన్మానించి ప్రోత్సహించేవారు. పాలకుల తప్పులను, ప్రభుత్వ పాలసీల్లోని లోపాలను ఎత్తి చూపడంలో అయినా ప్రజలకు మంచి జరిగేందుకు తీసుకునే నిర్ణయాల విషయంలో ఆయన గొంతుకను వినిపించే వారు. ప్రజా సమస్యలతో పాటు, సామాన్య బాధితులను అక్కున చేర్చుకోవడంలో ఆయనకు ఆయనే సాటి.

పలువురి నివాళి..

లోక్ సత్తా ఉద్యమ సంస్థ అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ మృతదహానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ నివాళి అర్పించారు. కలెక్టర్ శశాంక ఆసుపత్రికి వెల్లి సంతాపం ప్రకటించారు. మంత్రి ఈటల రాజేందర్, టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆయన మృతి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు.

Advertisement

Next Story