జీమెయిల్ లోగో మార్పు!

by Harish |
జీమెయిల్ లోగో మార్పు!
X

దిశ, వెబ్‌డెస్క్: జీమెయిల్ అనగానే ‘ఎం’ ఆకారపు పోస్ట్ కార్డ్‌తో ఉన్న లోగో గుర్తొస్తుంది. కొన్నేళ్లుగా జీమెయిల్‌ ఇదే లోగోను ఉపయోగిస్తున్నా.. ఫీచర్‌లు మాత్రం ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాయి. ఒక్క జీమెయిల్ మాత్రమే కాదు, జీ సూట్‌లోని వర్క్‌స్పేస్‌లో ఉపయోగపడే అన్ని ఉత్పత్తుల లోగోలను గూగుల్ రీబ్రాండ్ చేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అమల్లోకి వచ్చాక, గూగుల్ ఉత్పత్తుల వాడకం పెరిగిపోయింది. అందుకు తగ్గట్టుగా ఫీచర్‌లను కూడా గూగుల్ అప్‌డేట్ చేసింది. ఇప్పుడు కొత్తగా ఆయా ఉత్పత్తుల లోగోలను కూడా గూగుల్ రీబ్రాండ్ చేసింది. ఇప్పటివరకు దేనికదే ప్రత్యేకమైన రంగుల్లో ఉన్న జీమెయిల్, డాక్స్, మీట్, షీట్స్, క్యాలెండర్ ఉత్పత్తుల లోగోలు అన్నింటికీ గూగుల్ స్వల్ప మార్పులు చేసింది.

లోగోల మార్పులో గూగుల్ తన రంగులు కనిపించేలా జాగ్రత్త పడింది. నీలం, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉన్న కొత్త లోగోలను చూస్తే దాదాపుగా గూగుల్ స్పెల్లింగ్‌ను చూస్తున్న భావన కలుగుతోంది. అయినప్పటికీ మునపటి లోగోల కంటే ఇప్పుడు కాస్త విభిన్నంగా కనిపిస్తున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మిగతా ఉత్పత్తుల కొత్త లోగోల గురించి పక్కన పెడితే, జీమెయిల్ లోగో రీబ్రాండ్ డిజైన్‌ను మాత్రం కొందరు ఇష్టపడటం లేదు. పాత లోగో మనసులో పాతుకుపోయిందని ఈ కొత్త లోగో పెద్దగా ఆసక్తికరంగా లేదని అంటున్నారు. అయితే ఎందరో ఫీడ్‌బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకుని తాము ఈ లోగోలను రీబ్రాండ్ చేసినట్లు గూగుల్ యూఎక్స్ క్రియేటివ్ డైరెక్టర్ మార్గరెట్ సైఫర్స్ తెలిపారు. రానున్న రెండు వారాల్లో ఈ లోగో మార్పులు ఒక్కొక్కటిగా అమల్లోకి వస్తాయని ఆమె తెలిపారు.

Advertisement

Next Story