ఎక్కడ నేసిన వస్త్రం అక్కడే!

by Sridhar Babu |
ఎక్కడ నేసిన వస్త్రం అక్కడే!
X

దిశ, కరీంనగర్: కుటీర పరిశ్రమలో ప్రసిద్ధి చేనేత. కానీ, ఆ పనిని ఎంచుకున్న నేతన్నకు అన్ని ఒడిదొడుకులే. మగ్గంపై ఓ వస్త్రాన్ని తయారు చేసే క్రమంలో నేతన్న చేసే కృషి వెలకట్టలేనిది. అయినా, ఆ కృషికి తగ్గ ఫలితం వస్తుందని ఖచ్చితంగా చెప్పలేం. వృత్తి పరంగా వారమంతా కష్ట పడి.. వారానికోసారి అమ్ముకుని వారు జీవనం సాగిస్తారు. నమ్ముకున్న వృత్తిని వదులుకోలేక వచ్చిన కొద్ది ఆదాయంతోనే సరిపెట్టుకుంటారు. ఇలాగే దశాబ్దాల కాలంగా సాగుతున్న వారి జీవన విధానానికి బ్రేకులు వేసింది కరోనా వైరస్, లాక్‎డౌన్. దీంతో నేసిన బట్ట అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయింది. దాదాపు 50 రోజులు దాటినా లాక్‌డౌన్ కొనసాగుతుండడంతో.. తమ జీవనం మరింత దయనీయంగా మారిందని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కరీంనగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని సుమారు 20 గ్రామాలకు చెందిన నేత కార్మికులు టవల్స్, లుంగీలు నేస్తారు. ఇక్కడ సుమారు 200 నేత కుటుంబాలు వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయి. నేసిన బట్టలను నేత బజార్‌లో విక్రయిస్తుంటారు. ప్రతి వారం రూ. 20 వేల వరకు అమ్మకాలు జరిపి వచ్చిన లాభంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అంతేకాకుండా, సూరత్ నుంచి తెచ్చిన గార్మెంట్స్, చీరలు విక్రయించే మరో 100 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు వీరికి కూడా అమ్ముకునే పరిస్థితి లేకపోవడంతో పూట ఎలా గడుస్తుందని ఆందోళన చెందుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా మొత్తంగా 300 కుటుంబాలపై పిడుగుపడ్డట్లు అయిందని వారు తలలు పట్టుకుంటున్నారు.

నేతన్నలపై నిల్వల భారం

ఓ వైపు తాము నేసిన వస్త్రాలు అమ్ముకునే పరిస్థితి లేక సతమతమవుతున్న నేతన్నలు మరో భారాన్ని కూడా మోయాల్సి వస్తోంది. లాక్‎డౌన్‎కు ముందే వీరు వస్త్రాలు తయారు చేసేందుకు అవసరమైన ముడి సరుకు కొనుగోలు చేశారు. వీటితో వస్త్రాలను కూడా రెఢీ చేశారు. వీరి వద్ద దాదాపు రూ.3 కోట్లు విలువ చేసే వస్త్రాలు నిలువ ఉండిపోవడం గమనార్హం. అమ్మకాలు లేక నేత కార్మికులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి పూటగడవని పరిస్థితికి చేరుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వం అనుమతి ఇస్తే భౌతిక దూరం పాటిస్తూనే అమ్మకాలు జరుపుతామని నేత బజార్ అధ్యక్షులు మంచికట్ల కోటేశ్వర్ కోరుతున్నారు. వీరి విజ్ఞప్తిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story