వామ్మో.. అంతగనమా..?

by Shyam |
వామ్మో.. అంతగనమా..?
X

దిశ, రంగారెడ్డి: పేదోడి ఇంటి కలను కొవిడ్-19 నిరాశకు గురిచేస్తోన్నది. ఇంటి నిర్మాణానికి అవసరమైన ముడి సరుకు ధరలను వ్యాపారులు భారీగా పెంచారు. ఇసుక, ఇటుక, సిమెంట్, స్టీల్ అందుబాటులో లేదంటూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో నిర్మాణాలు మధ్యలోనే నిలిపివేయాల్సి వస్తోన్నది.

మంటగా మరినా సిమెంట్..

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నాయి. ఈ సమయంలో డీలర్లు, వ్యాపారులు రోజురోజుకూ సిమెంట్‌ ధరలను భారీగా పెంచుతున్నారు. సిమెంట్‌ ధర కంపెనీని బట్టి లాక్‌డౌన్‌కు ముందు రూ.280 నుంచి 350 వరకు ఉండగా లాక్‌డౌన్‌ తర్వాత బస్తా రూ.380 నుంచి రూ.450 వరకు పెంచి విక్రయిస్తున్నారు. సిమెంట్‌ ధరలు అధిక ధరకు అమ్ముతుండగా జిల్లా విజిలెన్స్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

ఇటుక బరువెక్కింది…

ఇల్లు నిర్మాణానికి ప్రధాన ముడి సరుకు ఇటుక. ఆ ఇటుక ధర ఇప్పుడు బరువైంది. మారుతున్న కాలానికి అనుగుణంగా రెండు, మూడు అంతస్థులు నిర్మిస్తుండటంతో లైట్‌వెయిట్‌ ఇటుకను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. లైట్‌ వెయిట్‌ ఇటుక ఒకటి లాక్‌డౌన్‌కు ముందు రూ.5.40 ఉంటే ప్రస్తుతం రూ.8 లకు విక్రయిస్తున్నారు. కొన్నిచోట్ల రూ. 10 కూడా అమ్ముతున్నారు. సాధారణ ఇటుక ఒకటి లాక్‌డౌన్‌కు ముందు రూ. 4 ఉండగా ఇప్పుడు రూ. 7 లకు విక్రయిస్తున్నారు.

షాక్ కొడుతున్న స్టీల్‌…

డాబా నిర్మాణంలో స్టీల్ ఒక ముడి సరుకు. ఈ స్టీల్‌ ధరను కూడా వ్యాపారులు భారీగానే పెంచారు. మొన్నటి వరకు క్వింటాల్‌ స్టీల్‌ ధర రూ. 4500 ఉండగా, ప్రస్తుతం రూ.5000 నుంచి 6000 వేల వరకు విక్రయిస్తున్నారు. దీంతో అప్పు చేసి ఇల్లు కట్టుకునే చిరుద్యోగులకు స్టీల్‌ ధర భారంగా మారింది.

బంగారం కంటే ఎక్కువ…

ఇసుక ధర రోజురోజుకూ బంగారం కంటే ఎక్కువగా పెరుగుతోన్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నిర్మాణాలకు సరిపడా ఇసుక దొరకడం లేదు. లాక్‌డౌన్‌ కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించడంతో ఇసుక సరఫరా నిలిచిపోయింది. లాక్‌డౌన్‌కు ముందు క్వాలిటీని బట్టి ఇసుక టన్ను ధర రూ. 2,200 నుంచి రూ.2,500 విక్రయించగా.. ప్రస్తుతం రూ.3,000 నుంచి రూ.3,500 వరకు అమ్ముతున్నారు. దీంతో సామాన్యులు ఇసుక అంటేనే వామ్మో అంటున్నారు.

ధరలు నియంత్రించాలి: బత్తుల శేఖర్, ఇబ్రహీంపట్నం

వ్యాపారులు సిమెంట్, స్టీల్, ఇసుక, ఇటుక ధరలు పెంచుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధరలను నియంత్రించాలి. లాక్‌డౌన్‌కు ముందు ఉన్న ధరలు ప్రస్తుతం లేవు. ఇదేంటని అడిగితే అందుబాటులో సరుకు లేదని, ఫ్యాక్టరీల వద్దే ధరలు పెంచారని వ్యాపారులు సమాధానం చెబుతున్నారు. ఇప్పటికే అప్పులు చేసి ఇల్లు కట్టుకుంటున్నాం. పెరిగిన ధరలతో ఇకపై నిర్మాణం కొనసాగించడం కష్టంగా ఉంది.

భారమైంది: జంగయ్య, తలకొండపల్లి

కుంటి సాకులతో ధరలు పెంచుతున్నారు. దీంతో నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. సిమెంట్‌ బస్తా ధర వందకు పైగా పెంచారు. ధరలు పెంచకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకుంటే పేదలు ఇల్లు కట్టుకోవడం కష్టంగా మారుతది.

Tags: homes, raw materials, merchants, high prices, cement, sand, brick, lockdown effect

Advertisement

Next Story