- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కంటైన్‌మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ 5.0
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఈసారి లాక్‌డౌన్‌ను కేవలం కంటైన్‌మెంట్ జోన్లకే పరిమితం చేసింది. జూన్ 30 వరకు ఆ జోన్లలో లాక్‌డౌన్ కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. మిగతా చోట్ల దశలవారీగా అన్ని సేవలకు అనుమతిచ్చే నిర్ణయాన్ని తీసుకుంది. ఈ సడలింపులు వచ్చే నెల 8 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. కాగా, దేశవ్యాప్తంగా కర్ఫ్యూ సమయాన్ని కుదించింది. రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. రాష్ట్రం లోపల, ఇతర రాష్ట్రాలకు ప్రయాణాలపైనా ఆంక్షలను ఎత్తేసింది. కరోనా సోకకుండా మాస్కులు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం వంటి ముందు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం, లిక్కర్, పాన్, గుట్కాలు తీసుకోవడం, ప్రజలు గుమిగూడటంపై నిషేధాన్ని కొనసాగించింది. కంటైన్‌మెంట్ జోన్ వెలుపల ఆంక్షలపై నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. ఈ మేరకు లాక్‌డౌన్ మార్గదర్శకాలను అమలు చేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు, కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇవీ సడలింపులు
లాక్‌డౌన్ 5.0లో కేంద్ర ప్రభుత్వం భారీ సడలింపులు ఇచ్చింది. జూన్ 8 నుంచి ఆధ్యాత్మిక కేంద్రాలు, ప్రాంతాల్లో ప్రజలకు అనుమతినిచ్చింది. షాపింగ్ మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర హాస్పిటాలిటీ సేవలకు అవకాశమిచ్చింది. అయితే, ఈ ప్రాంతాల్లో సామాజిక దూరం, ఇతర కరోనా జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ సంబంధిత శాఖలు, అధికారులతో చర్చించి రూపొందించనుంది. కాగా, రెండో దశ సడలింపుల్లో భాగంగా పాఠశాలలు, కాలేజీలు, విద్యా సంస్థలు, శిక్షణా కేంద్రాలను పున:ప్రారంభించే నిర్ణయాన్ని రాష్ట్రాలతో సంప్రదించిన తర్వాతే తీసుకోనుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సంబంధిత శాఖలు, విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చలు జరిపిన తర్వాత వచ్చిన సూచనల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకోనుంది. జూలైలోనే ఈ నిర్ణయం వెలువడే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది. మూడో దశ సడలింపుల కింద పరిస్థితులను బట్టి అంతర్జాతీయ విమాన సేవలు, మెట్రో రైలు, సినిమా హాళ్లు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియాలను రీ ఓపెన్ చేసే తేదీలను ఖరారు చేయనుంది. సామాజిక, రాజకీయ, క్రీడ, మతపరమైన వేడుకలపైనా ఇదే తీరును అనుసరించనుంది. అలాగే, వ్యక్తుల ప్రయాణాలు, సరుకుల రవాణాపై ఆంక్షలను ఎత్తేసింది. రాష్ట్రం లోపల, ఇతర రాష్ట్రాలకూ ప్రయాణాల కోసం ఎలాంటి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి మినహా కంటైన్‌మెంట్ జోన్ వెలుపల అన్ని సేవలకు అనుమతి ఉన్నట్టు కేంద్రం స్పష్టం చేసింది.
మార్గదర్శకాల్లో అదనంగా పని ప్రాంతాల్లో పాటించాల్సిన సూచనలను పొందుపరిచింది. సిబ్బంది పని ప్రాంతాలకు రాకుండా ఇంటి వద్ద నుంచే పని చేసుకునే వెసులుబాటు ఉంటే విధానాన్నే అనుసరించాలని సూచించింది. అలాగే, సామాజిక దూరాన్ని దృష్టిలో పెట్టుకుని షిఫ్టుల వారీగా పని చేసుకోవాలని తెలిపింది. అన్ని ఎగ్జిట్, ఎంట్రీల వద్ద శానిటైజర్లను, థర్మల్ స్క్రీనింగ్ సదుపాయాన్ని అందుబాటులో ఉంచాలని పేర్కొంది. సామాజిక దూరాన్ని తప్పకుండా పాటించాలని తెలిపింది. ఆరోగ్య సేతు యాప్‌ను వినియోగించాలని సూచించింది. కార్యాలయ సిబ్బంది ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకునేలా యాజమాన్యం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.