గ్రామాల్లో నిఘా.. కారణం..?

by  |
గ్రామాల్లో నిఘా.. కారణం..?
X

దిశ ప్రతినిధి, నల్లగొండ : కరోనా కట్టడికి ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. అనంతరం అందులో కొన్ని సడలింపులు ఇచ్చాయి. పట్టణాల్లో సడలింపులు అమలవుతుండగా గ్రామాల్లోని ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సడలింపులు తీసుకోకుండా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. పట్టణాలతో పాటు గ్రామాల్లో సైతం పాజిటివ్ కేసులు నమోదవుతుండటమే ఇందుకు కారణం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తుల పైనా నిఘా ఉంచుతున్నారు. కొన్ని గ్రామాల్లోనైతే ఇతర ప్రాంతాల వారిని ఊర్లోకి రానివొద్దని గ్రామస్తులు నిబంధనలు విధించుకున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజూకూ పెరిగిపోతున్నాయి. మార్చి 23 నుంచి లాక్‌డౌన్‌ను ప్రభుత్వం కఠినంగా అమలు చేసింది. ఇటీవలే కొన్ని సడలింపులు ఇవ్వడంతో జనం రోడ్లపైకి వచ్చారు. సాధారణ వాతావరణం నెలకొనడంతో కేసులు సంఖ్య పెరిగింది. అందులోనూ హైదరాబాద్ నగరంలో రెండు, మూడు రోజులుగా విపరీతంగా పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధించారన్న వార్తలు వినిపిస్తుండటంతో అక్కడికి వలస వెళ్లిన వారంతా తిరిగి గ్రామాలకు చేరుకుంటున్నారు. అలా గ్రామాలకు వచ్చిన వారిలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. దీంతో కొన్ని గ్రామాల ప్రజలు అప్రమత్తమయ్యారు. స్వచ్ఛందంగా వారే గ్రామాల్లో లాక్‌డౌన్ విధించుకున్నారు. లాక్‌డౌన్ నిబంధనలను పాటిస్తూ కరోనా వైరస్‌ను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

నిఘా ఇలా..

యాదాద్రి-భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో పుట్టపాక గ్రామ సర్పంచ్ సామల భాస్కర్.. గ్రామంలో 15 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్ నిబంధనల్లో భాగంగా ప్రజలందరూ ఇంటి నుంచి బయటకు రావొద్దని, నిత్యావసర సరుకుల కొనుగోలు కోసం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు మాత్రమే అనుమతినిచ్చారు. వీటి కోసం ఇంటి నుంచి ఒక్కరే వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామంలోకి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. విదేశాలు, ఇతర ప్రాంతాల నుంచి గ్రామంలోకి ఎవరూ వచ్చినా వెంటనే ఏఎన్ఎం, ఆశావర్కర్లకు సమాచారం అందిస్తున్నారు.

సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని మునగాలలోనూ పంచాయతీ పాలకవర్గం గ్రామంలో స్వచ్ఛందంగా లాక్‌డౌన్ విధించింది. దీంతో పాటు గ్రామంలో లాక్‌డౌన్ నిబంధనల్లో భాగంగా ఎక్కడికక్కడ జాగ్రత్తలు చేపట్టేలా ప్రజలకు అవగాహన కల్పించారు. మాస్కు లేకుండా ఇంటి నుంచి బయటకు వస్తే జరిమానాలు విధించేందుకు సైతం సిద్దమవుతున్నారు. ఇప్పటికే మునగాల గ్రామంలో మూడు నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో గ్రామంలో జూలై ఒకటో తేదీ నుంచి 11వ తేదీ వరకు లాక్‌డౌన్ విధిస్తూ సర్పంచ్ ఉపేందర్ ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే అన్ని దుకాణాలను తెరుస్తున్నారు.

అధికారుల అలసత్వం..

పట్టణాలకు వలస వెళ్లిన వారు అక్కడ ఉపాధి కరువవ్వడంతో తిరిగి సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు. వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం లేదు. క్వారంటైన్‌లో ఉండాలని చెప్పి అధికారులు, వైద్య సిబ్బంది చేతులు దులుపుకుంటున్నారు. అనంతరం వారిపై నిఘా లేకపోవడంతో వారు గ్రామంలో ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామాలపై దృష్టి సారించాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు.

గ్రామస్తులు సహకరించాలి: సామల భాస్కర్, పుట్టపాక సర్పంచ్

పుట్టపాక గ్రామంలో ఒక వృద్ధురాలికి కరోనా పాజిటివ్ వచ్చింది. గ్రామంలో ఇది మొదటి కేసు కావడంతో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశాం. అందులో భాగంగానే లాక్‌డౌన్ విధించాలని ఏకగ్రీవంగా తీర్మాణించి ఆమోదించాం. ఇందుకు గ్రామ ప్రజలందరూ సహకరించాలి. స్వీయ జాగ్రత్తలతోనే కరోనాను కట్టడి చేయవచ్చు.



Next Story