- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దేశవ్యాప్తంగా మళ్ళీ లాక్‌డౌన్.. ఆరోజే ప్రకటన
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు మళ్లీ లాక్ డౌన్ తప్పేలా లేదు. రోజురోజుకూ పెరుగుతున్న కొత్త కేసులు, పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత, అమెరికా, ఆస్ర్టేలియా, సౌదీ అరేబియా తదితర దేశాలు విమాన సర్వీసులను రద్దు చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. పరిస్థితి చేయిదాటితే లాక్ డౌన్ లాస్ట్ ఆప్షన్ అంటూ ఇటీవల ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు ఇందుకు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. మే, జూన్ నెలలకు తలా ఐదు కిలోల చొప్పున సుమారు 80 కోట్ల మందికి బియ్యం, గోధుమలను ప్రజా పంపిణీ ద్వారా సమకూర్చనున్నట్టు కేంద్రం ప్రకటించడం విశేషం. పలు హైకోర్టులు, సుప్రీంకోర్టు ఇటీవల చేసిన వ్యాఖ్యలు సైతం దానినే సూచిస్తున్నాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో మళ్లీ లాక్‌డౌన్ దిశగా చర్యలు మొదలయ్యాయి. వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు వికటిస్తున్నందునే అనివార్యంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని, ‘చివరి అస్త్రం’గా మాత్రమే లాక్‌డౌన్ ఉండాలని మూడు రోజుల క్రితం ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. చివరి అస్త్రాన్ని ప్రయోగించే చాన్సే ఎక్కువగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న ముందస్తు ఏర్పాట్లు, రాష్ట్రాలతో జరుపుతున్న సంప్రదింపులు.. ఇందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి.
ఆక్సిజన్ సరఫరా కోసం ఆర్మీ
ఆక్సిజన్ సరఫరా కోసం ఆర్మీని రంగంలోకి దించిన విషయం తెలిసిందే. కంటోన్మెంట్ ఆసుపత్రులను సాధారణ ప్రజల చికిత్స కోసం అనుమతించారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి, ఆక్సిజన్, వెంటిలేటర్లు సహా అనేక అంశాలపై వైద్యారోగ్యశాఖను అప్రమత్తం చేశారు. దేశంలో ‘ఎమర్జెనీ తరహా’ పరిస్థితులు నెలకొన్నాయని సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించింది. మే, జూన్ నెలలకు తలా ఐదు కిలోల చొప్పున సుమారు 80 కోట్ల మందికి బియ్యం, గోధులను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సమకూర్చనున్నట్టు కేంద్రం ప్రకటించింది. వీటన్నింటినీ పరిశీలిస్తే.. మే 2వ తేదీ తర్వాత ఎప్పుడైనా లాక్‌డౌన్ అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ పరిస్థితులు విషమిస్తే ఈ లోపే అలాంటి నిర్ణయాన్ని ఎంపిక చేసిన రాష్ట్రాలు, నగరాల్లో తీసుకునే అవకాశం ఉంది.
ఓట్ల లెక్కింపు తర్వాత?
ఈ నెల 29న చివరి దశ పోలింగ్ ఉన్నందున మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తికాగానే దేశంలోని పరిస్థితులపై కేంద్ర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటుచేసి లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని, పరిశ్రమలు నష్టాల్లో కూరుకుపోతాయని, దినకూలీపై ఆధారపడి బతికేవారి జీవనోపాధి దెబ్బతింటుంటుందని, ఆకలి చావులు పెరుగుతాయనే సందేహాలున్నప్పటికీ వైరస్ వ్యాప్తి నివారణకు మరో మార్గం లేదని కేంద్రం భావిస్తున్నట్టు తెలిసింది. పరిశ్రమాధిపతులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల కొన్ని జాగ్రత్తలు చెప్పారు.‘‘రానున్న కొన్ని వారాలు మరింత అప్రమత్తంగా గమనిస్తూ ఉండాలి. దానికి అనుగుణంగా తొలి క్వార్టర్‌కు ఏం చేయాలో నిర్ధిష్ట యాక్షన్ ప్లాన్, సన్నాహక చర్యలను రూపొందించుకోండి’’ అని ట్విట్టర్ ద్వారా సంకేతాలిచ్చారు.
గత పరిస్థితులు పునరావృతం కావొద్దనే..
గతేడాది లాక్‌డౌన్ నిర్ణయాన్ని అకస్మాత్తుగా తీసుకున్నందున పేదలు, సామాన్యులు పడిన ఇబ్బందులు ఈసారి పురావృతం కాకూడదన్న ఉద్దేశంతో ఇప్పటి నుంచే ఒక్కొక్కటిగా ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఐదు కిలోల బియ్యం, గోధుమల పంపిణీ అందులో భాగమని కేంద్ర ప్రభుత్వ వర్గాల అభిప్రాయం. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే నైట్ కర్ఫ్యూ, లాక్‌డౌన్ లాంటి నిర్ణయాలు తీసుకున్నాయి. అయినా కేసులు తగ్గుముఖం పట్టలేదు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులు నెలకొన్నాయని పలు హైకోర్టులు వ్యాఖ్యానించాయి. అటు సుప్రీంకోర్టు ద్వారా, ఇటు కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా ఇలాంటి ప్రకటనల రావడం వెనక కేంద్ర ప్రభుత్వ ప్రమేయం ఉందనే అనుమానాలూ లేకపోలేదు.
అన్ని దారులూ అటువైపే
కొవిడ్ నిబంధనలు ఎన్ని ఉన్నా ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారసభలు యథావిధిగా జరుగుతుండటంపై ప్రజల నుంచి రాజకీయ పార్టీలపై విమర్శలు వచ్చాయి. ప్రధాని సైతం వాటిని ఎదుర్కొన్నారు. చివరకు కేంద్ర ఎన్నికల సంఘం ర్యాలీలు, బహిరంగసభలు, భారీ మీటింగులకు ‘నో ’ చెప్పింది. వర్చువల్ మీటింగులే శరణ్యమయ్యాయి. ప్రధాని సైతం పశ్చిమబెంగాల్‌లో ప్రచారాన్ని రద్దు చేసుకొని, ఢిల్లీలోనే మకాం వేసి అధికారులతో సమీక్షలు చేస్తున్నారు. దేశంలో ఆక్సిజన్ కు భారీగా డిమాండ్ ఏర్పడటంతో ప్రధాని మోడీ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. వ్యాక్సిన్ తయారీ, ఉత్పత్తి పెంపు, రాష్ట్రాలకు సరఫరా, ప్రజలకు అందుబాటులో ఉంచడం లాంటి నిర్ణయాలన్నీ అందులో భాగమే అనే అనుమానాలున్నాయి.
అద్దం పడుతున్న ప్రస్తుత పరిస్థితి
రాష్ట్రపతి మొదలు మాజీ ప్రధానులు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులు, మంత్రిత్వశాఖల ఉన్నత కార్యదర్శులు కరోనా బారిన పడడం, కొద్దిమంది మృతిచెందడం, దేశవ్యాప్తంగా తీవ్రంగా ఆక్సిజన్ కొరత ఏర్పడడం, అనేక వందల శ్మశానాల్లో 24 గంటలూ శవాలు కాలుతూనే ఉండడం, ఆస్పత్రుల్లో బెడ్‌ల కొరత, రెమిడెసివిర్ ఇంజక్షన్లకు షార్టేజీ, ఐసీయూ బెడ్లన్నీ ఫుల్ కావడం, కరోనా టెస్టింగ్ మొదలు ఆస్పత్రిలో అడ్మిషన్, శ్మశానంలో అంత్యక్రియల వరకు ప్రతిదానికీ వెయిటింగ్.. ఇలాంటి అనేక అంశాలు భారత్‌లో వైరస్ తీవ్రతకు అద్దం పడుతున్నాయి.
నెలాఖరుకు రోజూ 5 లక్షల కేసులు
అనేక దేశాలు భారత్‌లోని పరిస్థితిని విశ్లేషిస్తున్నాయి. మిచిగాన్ విశ్వవిద్యాలయం ఎపిడమాలజీ ప్రొఫెసర్ భ్రమర్ ముఖర్జీ ఈ నెల చివరికల్లా రోజూ ఐదు లక్షల కొత్త కేసులు, మూడు వేల కరోనా మృతుల సంఖ్య నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇలాంటివే ఇప్పుడు లాక్‌డౌన్ నిర్ణయానికి కారణమవుతున్నాయి. సెకండ్ వేవ్ కట్టడిలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, తగినంతగా సమాయత్తం కాలేదన్న విమర్శలు అదనంగా తోడయ్యాయి.
అంతర్జాతీయ ఒత్తిడి
భారత్‌లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా అమెరికా, ఆస్ర్టేలియా, సౌదీ అరేబియా తదితర దేశాలు విమాన సర్వీసులను రద్దు చేశాయి. భారత్‌లో పర్యటించవద్దంటూ ఆ దేశ పౌరులను హెచ్చరించింది. భారత్‌లో పరిస్థితి చేయిదాటిపోతుందనే అభిప్రాయం అంతర్జాతీయ సమాజంలో నెలకొనడం ద్వారా దేశ ప్రతిష్ఠకు, ప్రధాని పదవికి కళంకంగా ఉంటుందనే అభిప్రాయాలు బీజేపీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు ఫ్రాన్స్, చైనా లాంటి దేశాలు ఆపన్నహస్తం అందిస్తామంటూ సంఘీభావాన్ని ప్రకటించాయి. అందువల్ల వైరస్ వ్యాప్తి నియంత్రణ చేయి దాటిపోయే పరిస్థితి రాకుండా, ఇతర దేశాలు భారత్ వైపు వేలెత్తి చూపకుండా, ఐక్యరాజ్య సమితి లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థల నుంచి ‘అంతర్జాతీయ సాయం’ అనే తీరులో ఆఫర్లు రాకుండా ఉండేందుకు లాక్‌డౌన్ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు కేంద్ర వర్గాల సమాచారం.