ఎంగేజ్

by Ravi |   ( Updated:2024-07-14 18:30:54.0  )
ఎంగేజ్
X

యంగ్ ఏజ్

ఇట్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టూ ఎంగేజ్

వెళ్లి క్లాస్ ఎంగేజ్ చేయండి చాలు

ప్రిన్సిపాల్ గొంతులో

అభ్యర్థన లాంటి కాదనలేని ఆజ్ఞ

ఎవరు సెలవు పెట్టినా

ఉన్న వారికి తప్పని స్థితి!

అంతవరకూ గొంతెండి పోయేలా అరిచి

పాఠం మధ్య తిట్లా, తిట్ల మధ్య

పాఠమూ ఏం చెప్పిందో తెలియని స్థితిలో

తొంభయి మంది వింత మనస్తత్వాలతో

మానసిక పోరాటం చేసి వచ్చిన

లెక్చరరమ్మకు ఎంగేజ్ అనే పదం

అంటే గుండె దడ దడ!

మాట్లాడకుండా చదువుకోండి

లెక్చరరమ్మ స్టాక్ డైలాగ్!

బెంచీల్లో ఒకళ్ళ నొకళ్లు తోసుకునే వాళ్ళు

కొట్టుకునే వాళ్ళు ఊరికూరికే నవ్వేవాళ్ళు

ఫోన్లలో సీరియస్‌గా సినిమాల్లో లీనమైపోయేవాళ్లు!

ఫోన్లు తీయకండి... లెక్చరరమ్మ అరణ్యరోదన!

వాళ్లెక్కడున్నారో వాళ్ళకే తెలియని స్థితి!

తానెక్కడున్నదో తనకే అర్థం కాని

లెక్చరరమ్మ అయోమయ స్థితి!

అదో వింతలోకం.. సిసి కెమెరాలు

బంధిస్తున్న ఈ భయానక దృశ్యాలు

ఏ విపత్కర పరిస్థితులకు దారి తీస్తాయో

తెలిసిన లెక్చరరమ్మ మనసు అలజడి!

క్షణమొక యుగంగా నడుస్తోందని

ఎప్పుడో చదివిన ప్రేమ కవిత్వాన్ని తలపిస్తూ

కదలని శిలలా కాలం,

ఏభై నిముషాలు ఏభై యుగాల

అనుభూతి నిచ్చిన ఎంగేజ్ క్లాసు!

డా. చెంగల్వ రామలక్ష్మి

63027 38678

Advertisement

Next Story