- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
- Union Budget 2025-2026
నా తరువాత నా అక్షరాలు ఉండాలి!
జనవరి 15న అనూహ్యంగా, అర్థాంతరంగా, అకాలంగా విశాఖపట్నంలో కన్నుమూసిన చందమామ రచయిత, బాల సాహిత్య కథకులు, అనువాదకులు, వివిధ పత్రికల సంపాదకులు, మంచి మిత్రులు ఎంవీవీ సత్యనారాయణ తన గురించి తాను రాసుకున్న శిలాక్షరాలివి. 'నా తరువాత నా అక్షరాలు మిగిలి ఉండాలి' అన్నది ఆయనకు ప్రియమైన మాట. సంక్రాంతి రోజు ఉదయం పూట కూడా తెలిసిన మిత్రుడి కథలు చదివి ఆత్మీయంగా ప్రశంసా వ్యాఖ్యలు చేసిన ఎంవీవీ గారు ఆ సాయంత్రం 4 గంటల వేళ ఇక సెలవు అంటూ వెళ్లిపోయారు.
ఈ సంక్రాంతి పండుగకు మూడురోజుల ముందే ఆయనతో ఫోన్‌లో మాట్లాడాను. అయాన్ రాండ్, అగాధా క్రీస్టీ, మరియో పుజో రచనలపై ఆయన గత రెండేళ్లుగా చేసి ప్రచురించిన బృహత్ నవలానువాదాల గురించి మాట్లాడుకున్నాం. నా తర్వాత నా అక్షరాలు అందరికీ గుర్తుండి పోవాలని ఆయన ఈ పుస్తకాల ముందుమాటలో చెప్పుకున్నారు. వాటిలో కొన్ని అక్షర జ్ఞాపకాలు ఇవి.
చివరిక్షణం వరకూ రాస్తూ..
ఏ రకంగా చూసినా ప్రపంచ స్థాయి పుస్తకాలివి. చందమామ పత్రిక సరళ శైలిని చూడగానే పట్టించేటటువంటి తేలిక భాషలో సాగిన ఆకర్షణీయమైన అనువాదాలవి. వృద్ధాప్యంలోనూ కలానికి పదును పెట్టకపోతే ఇలాంటి బృహత్ రచనలు ఇంత వేగంగా అనువాద రూపం దాల్చలేవు. సంవత్సరం క్రితం ఆయన ఆ పుస్తకాలు నాకు పంపారు. అయాన్ రాండ్ పుస్తకం 'ఫౌంటెయిన్ హెడ్' పై ఇతరులు చేసిన అనువాదం విషయం చెప్పి తప్పకుండా తీసుకోమని వారి నెంబర్ కూడా ఇచ్చారు. చివరి క్షణం వరకు ఏదో ఒకటి రాస్తూ, చదువుతూ పోకుంటే పొద్దు పోదు అని హాస్యం కూడా చిలికించారు. ఆయన మా వద్ద ఇలా మిగిలి ఉన్నారు ఇప్పుడు... మరి కొంత కాలం ఆరోగ్యం కాపాడుకుంటూ మంచి అనువాదాలు చేయాలని, మీ తర్వాత కూడా మీ రచనల ద్వారా మీరు గుర్తుండాలనే మీ ఆకాంక్ష అప్పుడే నెరవేరుతుందని చెబితే చాలా సంతోషపడ్డారు. ఇంతలో ఇలా జరిగిందేమిటి..? ఆయన చేసిన అనువాదాలు మాత్రమే పుస్తకాల రూపంలో నా వద్ద ఉన్నాయి. ఇలాగేనా మాస్టారూ.. ఇంత తొందరగా, ఇలా మిగిలి ఉంటారని ఊహించలేదు. 75 ఏళ్లు పైబడ్డాయి. మరి కొన్నేళ్లకు సహస్ర చంద్ర దర్శనం (వేయి పున్నమిలు, 80 సంవత్సరాలు) చూస్తారు మరి అంటే సంతోషంగా నవ్వారు. కానీ ఇదేంటి..
చందమామతోటే తన పరిచయం
ఆయనతో నా పరిచయం చందమామ పత్రికలో నేను పనిచేసినప్పుడే జరిగింది. 1970ల నాటి బాల్యంలో మా జీవితాలను వెలిగించిన చందమామ పత్రిక నుంచి జాబ్ ఆఫర్ వస్తే ఎగిరి గంతేసి 2009 మొదట్లో చెన్నయ్‌లోని చందమామ ఆఫీసులో చేరాను. మొదట్లో ఆ పత్రిక వెబ్ సైట్‌లో అసోసియేట్ ఎడిటర్‌గా చేరి ఆ తర్వాత కొన్ని నెలలకే చందమామ పత్రిక బాధ్యతల్లో చేరవలసి వచ్చింది. 2009 చివర్లో అనుకుంటాను. చందమామ సీనియర్ రచయితలు కొందరి కథలు చందమామ ఆఫీసులో పేరుకుపోయి ఉండటం గమనించి వాకబు చేశాను. బయటకు చెప్పలేని కారణం వల్ల చందమామ సీనియర్ రచయితలు, యువ రచయితలు రాసి పంపే కథల్లో ఒకటి రెండు తప్ప తాజా కథలు తీసుకోవడం ఉండేది కాదు. అయితే ఏ కారణం వల్ల అయినా సరే చందమామ సీనియర్ రచయితలను పక్కన బెట్టడం మంచిది కాదనుకుని మా యాజమాన్యంతో మాట్లాడి 40 పేజీలు కథలకు కేటాయించగా వాటిలో కనీసం 20 పేజీలుకు పైగా తాజా కథలనే ప్రచురించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పుడే ఎంవీవీ గారితో తొలి పరిచయం ఫోన్ ద్వారా అయింది.
‘చందమామ’ కాల్ చేసింది
చందమామలో సీనియర్ రచయితల పెండింగు కథలను బాక్సులోంచి తీసి చూస్తుండగా ఎంవీవీ సత్యనారాయణ గారి కథలే ముందుగా కనబడ్డాయి. తన మొబైల్ నంబర్ నోట్ చేసుకుని కాల్ చేశాను. చెన్నయ్ నుంచి విశాఖపట్నంకు సాధారణ ప్రయోజనంతో చేసిన కాల్ అది. చందమామ నుంచి మాట్లాడుతున్నాము. నా పేరు ఫలానా అని చెబుతుండగా ఒక్కసారిగా అనుకున్నారాయన. 'ఏమిటీ చందమామ నుంచా.. ఫోన్ కాలా.. నా 35 ఏళ్లకు పైగా అనుభవంలో చందమామ నుంచి నాకు కాల్ రావడం ఇదే మొదటిసారి' అంటూ పరమానందం పొందారాయన. కథల విషయంలో మారిన నిర్ణయం గురించి చెప్పి అందరూ కొత్తగా రాసి పంపాలని కోరాను. ఆయన ద్వారానే వసుంధర దంపతులు, ఆయన సోదరులు, దాసరి వెంకటరమణ గారు, కోలార్ కృష్ణయ్య, కోనె వెంకట నాగ ఆంజనేయులు, శివనాగేశ్వరరావు, గుండ్రాతి సుబ్రహ్మణ్య గౌడ్ గార్లు వంటి ప్రముఖ కథా రచయితల వివరాలు ఒక్కటొక్కటిగా తెలుస్తూ వచ్చాయి. 2010 నుంచి 2012 చివరి వరకు ఆ మూడేళ్ల కాలం చందమామలో కొత్త కథలు మారాకు తొడిగాయి. ఇదంతా ఒక చరిత్ర అయితే చందమామ కాల్ చేసింది అనే వాక్యం మాత్రం రొంబ ఫేమస్ అయిపోయింది. సజీవులై ఉన్న చందమామ సీనియర్ రచయితలందరినీ మొదటి సారిగా హైదరాబాద్ లోని తన స్వగృహానికి ఆహ్వానించి అందరినీ కూడేసిన మిత్రులు దాసరి వెంకటరమణ గారు 2023లో జరిపిన విశిష్ట కార్యక్రమాన్ని దిశ పత్రికలోనే స్పెషల్ పేజీగా వారి ఫొటోలతో సహా క్లుప్త వివరాలతో ప్రచురించడం ఒక సంచలనమైంది. అప్పుడు కూడా ఎంవీవీగారు తన ఫేమస్ డైలాగ్‌ను పంచుకున్నారు. చందమామలో పనిచేసే వారి నుంచి మొదటి ఫోన్ కాల్ నా ద్వారా ఆయనకే వచ్చిందని మొన్న కూడా గుర్తు చేసుకున్నారు. రచయితలతో పోస్ట్ కార్డు ప్రత్యుత్తరాలే తప్ప నేరుగా మాట్లాడటం అంతవరకు చందమామ చరిత్రలో లేదనుకుంటాను. దీంట్లో నా గొప్పతనం ఏమీ లేదు. చందమామ సీనియర్ రచయితలకు, చందమామకు మధ్య బంధాన్ని కాస్త పునరుద్దరించే పనిలో ఒక చెయ్యి వేశానంతే..
ఆత్మీయ స్పర్శానుబంధం
ఎప్పుడు కాల్ చేసినా, ఎన్ని బాధల్లో ఉన్నా సరే.. మనిషిని సహజ ప్రేమానుబంధంతో పలకరించడం, గుర్తు తెచ్చుకోవడం ఆయన తర్వాతే ఎవరైనా.. ఎక్కడ పిఠాపురం, ఎక్కడ కడప, చిత్తూరు, ఎక్కడ చందమామ... ఎక్కడి విదేశీ అనువాదాలు.. ఇన్నేళ్ల పాటు మీ పరిచయం ఎంతో తీపి స్మృతులనే పంచి పెట్టింది మాస్టారూ. ఇకనుంచి మీ పుస్తకాలే, మీ అక్షరాలే మా జ్ఞాపకాలు. మీ చందమామ జ్ఞాపకాలను కాస్త సమయం కేటాయించుకుని తప్పకుండా రాయండి అని అడిగితే సంతోషంగా ఒప్పుకున్నారు. దిశలో మీ సాహిత్య సంబంధ రచనలు రాస్తే తప్పక ప్రచురిస్తామని చెబితే మహదానందపడ్డారు. ఇంతలోనే ఇలా.. జరిగిందేమిటి... ఆస్తిక, నాస్తిక విచికిత్సలను పక్కన బెట్టి చూద్దాం. ఆయనతో మా 'రుణానుబంధం' ఇంతేనేమో మరి.
(ఎంవీవీ సత్యనారాయణ నివాళి సందర్భంగా)
కె. రాజశేఖరరాజు
73964 94557