ఫస్ట్ పైసలియ్యమన్నందుకు ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తలేరు!

by Shyam |
ఫస్ట్ పైసలియ్యమన్నందుకు ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తలేరు!
X

టీఆర్ఎస్ ప్రభుత్వం జనగామ జిల్లాలో నిర్మించ తలపెట్టిన లింగంపల్లి–మల్కాపూర్ రిజర్వాయర్ ప్రతిపాదనలకే పరిమితమైంది. సుమారు లక్ష ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో ఈ రిజర్వాయర్​ను ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిర్మించి తీరుతామని సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రిజర్వాయర్​ను ప్రచార అస్త్రంగా వాడుకున్న ప్రజాప్రతినిధులు ఆ తర్వాత పట్టించుకున్న పాపాన పోలేదనే విమర్శలున్నాయి. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గానీ, స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు గానీ ఈ ప్రాజెక్ట్ ఊసెత్తకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే టెండర్లు పిలిచామని నేతలు చెబుతున్నా నిర్మాణ పనులు ఎప్పుడు చేపడతారనే విషయంలో నేటికీ స్పష్టత లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

దిశ, వరంగల్ : జనగామ జిల్లాలో వర్షపాతం తక్కువ. ఇక్కడ ఏడాదిలో రెండు పంటలు పండించటమంటే గొప్ప విషయమే. బావుల్లో సమృద్ధిగా నీరు ఉంటే తప్ప పంటలు పండని పరిస్థితి. జిల్లాలో రిజర్వాయర్లు ఉన్నప్పటికీ సరిపడా నీళ్లు లేని దుస్థితి. దేవాదుల ద్వారా నీళ్లు తరలించే ప్రయత్నం చేస్తున్నా రైతాంగానికి పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ సాగునీటికి శాశ్వత పరిష్కారం చూపే క్రమంలో జిల్లాలో అతిపెద్ద రిజర్వాయర్​ను నిర్మించాలని తలచింది. స్టేషన్ ఘన్​పూర్ నియోజకవర్గం చిల్పూర్ మండలం మల్కాపూర్–లింగంపల్లి గ్రామాల మధ్య 10.78 టీఎంసీల సామర్థ్యంతో రూ.3230 కోట్ల వ్యయంతో అతిపెద్ద రిజర్వాయర్ నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆ గ్రామాల్లో సర్వే చేసిన రెవెన్యూ అధికారులు భూ సేకరణ చేశారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల ఆ రెండు గ్రామాలు కనుమరుగుకానున్నాయి. దీంతో కొంతమంది గ్రామస్తులు భూములు వదులుకోవడానికి వెనకడుగు వేశారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, కలెక్టర్, నీటిపారుదలశాఖ అధికారులు గ్రామస్తులతో మాట్లాడి ఒప్పించారు. నష్టపరిహారం చెల్లిస్తే భూములు ఇవ్వడానికి ప్రజలు అంగీకరించారు. ప్రాజెక్ట్ వల్ల ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందనే సదుద్ధేశంతో ముందుకొచ్చారు. కానీ, ముందుగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఎలాంటి పురోగతి లేని కారణంగా రిజర్వాయర్ ప్రారంభానికి నోచుకోవడం లేదనే ప్రచారం జరుగుతోంది.

ప్రారంభమెప్పుడో..?

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించింది. జనగామ లాంటి కరువు ప్రాంతంలో సాగునీటి వనరుల ఆవశ్యకతను గుర్తించిన ప్రభుత్వం ఇక్కడ అతిపెద్ద రిజర్వాయర్ నిర్మించాలని నిశ్చయించింది. స్టేషన్ ఘన్​పూర్ నియోజకవర్గంలోని లింగంపల్లి, మల్కాపూర్ గ్రామాల మధ్య రిజర్వాయర్ నిర్మించేందుకు పరిపాలన పరమైన అనుమతులు కూడా ఇచ్చింది. నిధులు కూడా మంజూరు చేసింది. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రాజెక్ట్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. చిన్న,చిన్న అడ్డంకులు ఉంటే పరిష్కరించారు. గతేడాది సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ అధికారంలోకి రాగానే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. స్టేషన్ ఘన్​పూర్ నియోజకవర్గాన్ని మరో కోనసీమగా మారుస్తామన్నారు. రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన సీఎం కేసీఆర్ రిజర్వాయర్ పనులు ప్రారంభించేందుకు టెండర్లు కూడా పిలిచినట్లు చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తవగానే పనులు ప్రారంభిస్తామన్నారు. ఏడాదిన్నర పూర్తి కావస్తున్నా రిజర్వాయర్ పనులు ప్రారంభించకపోవడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Next Story