Shocking study : షాకింగ్ స్టడీ.. స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా చూసే వారిలో బయటపడ్డ ఆ లక్షణాలు!

by Javid Pasha |   ( Updated:2025-03-01 06:53:16.0  )
Shocking study : షాకింగ్ స్టడీ.. స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా చూసే వారిలో బయటపడ్డ ఆ లక్షణాలు!
X

దిశ, ఫీచర్స్: ప్రస్తుతం అత్యధికమంది జీవితంలో స్మార్ట్‌ఫోన్ ఒక భాగమైపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అదిలేకపోతే రోజు గడవదు. వ్యక్తుల మధ్య, వ్యవస్థల మధ్య ముఖ్యమైన కమ్యూనికేషన్‌ అంతా దీనిపైనే ఆధారపడి నడుస్తుందంటే అతిశయోక్తి కాదు. ఇక ఇదంతా పక్కన పెడితే స్మార్ట్‌ఫోన్ అతిగా వాడటం (Smartphone overuse) కొందరిలో వ్యసనాలకు (Addictions), అనర్థాలకు దారితీస్తుందన్న విషయం తెలిసిందే. కాగా రీసెంట్ స్టడీ మరో కొత్త విషయాన్ని వెల్లడించింది. పిల్లలు, టీనేజర్లు (Children and teenagers) దీనిని ఎక్కువగా వాడటం వల్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నట్లు అమెరికా, ఇండియా దేశాల్లో ‘గ్లోబల్ మైండ్ ప్రాజెక్ట్’ జరిపిన ఓ అధ్యయనం(study)లో తేలింది.

అధ్యయనం జరిగిందిలా..

అధ్యయనంలో భాగంగా నిపుణులు 13 నుంచి 17 ఏండ్ల మధ్య వయసున్న 10,475 మందిని స్మార్ట్ ఫోన్ యూజర్లను పరిశీలించారు. వీరిలో అతిగా వాడే వారిని, తక్కువగా వాడేవారిని కేటగిరీలుగా విభజించి అబ్జర్వ్ చేశారు. ఒత్తిడి, ఆందోళనలు, మానసిక పరిస్థితిలో మార్పులు ఎవరిలో ఏ విధంగా ఉంటున్నాయో కూడా విశ్లేషించారు.ఈ సందర్భంగా నిపుణులు స్మార్ట్‌ఫోన్ అతి వినియోగం అబ్బాయిలకంటే అమ్మాయిల్లోనే ఎక్కువగా ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలకు దారితీస్తున్నట్లు గుర్తించారు. ఓవరాల్‌గా చూస్తే 65 శాతం మంది ఆడపిల్లల్లో స్మార్ట్‌ఫోన్ అతి వినియోగం ఆందోళనకు కారణం అవుతోంది.

ఏజ్‌ను బట్టి ప్రభావం?

ఇక వయసుల వారీగా స్మార్ట్‌ఫోన్ అతివినియోగం (Smartphone overuse) వల్ల కలిగే ప్రభావాన్ని పరిశీలించినప్పుడు పదమూడేండ్ల వయసులో ఉన్నవారికన్నా 14 ఏండ్ల వయసులో ఉన్నవారు మానసిక పరమైన ఇబ్బందులను కాస్త ఎక్కువగా ఎదుర్కొన్నారని, అట్లనే వీరికంటే కూడా 15 ఏండ్ల వయసులో ఉన్నవారు మరింత ఎక్కువగా ఇబ్బంది పడ్డారని నిపుణులు కనుగొన్నారు. ఇక 18 నుంచి 24 ఏండ్ల మధ్య వయసు గలవారిలో 50 శాతం మంది స్మార్ట్‌ఫోన్ అతి వినియోగంవల్ల వ్యసనానికి గురైనట్లు గుర్తించారు. స్మార్ట్‌ఫోన్‌ అతి వినియోగం, వ్యసనం పిల్లలు, టీనేజర్ల మెదడు అభివృద్ధి, రోజువారి యాక్టివిటీస్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. 2020 నుంచి 2023 మధ్య కోవిడ్ మహమ్మారి సమయంలోనూ ఈ పరిస్థితి పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.

ఎలాంటి సమస్యలు తలెత్తాయి?

స్మార్ట్‌ఫోన్ అతి వినియోగం వ్యసనంగా లేదా రుగ్మత మారినప్పుడు పిల్లల్లో కొన్ని ప్రత్యేక లక్షణాలు డెవలప్ అవుతాయని పరిశోధకులు పేర్కొన్నారు. ముఖ్యంగా చికాకు, కోపం, దూషణాత్మక బిహేవియర్ డెవలప్ అవుతాయి. ఫోన్ ఇవ్వకపోతేనో అందుబాటులో లేకపోతేనో అలగడం, ఏదైనా హాని చేసుకుంటామని పేరెంట్స్‌ను హెచ్చరించడం వంటి ప్రవర్తన కూడా కనిపించవచ్చు. అట్లనే వాస్తవానికి దూరంగా భ్రమల్లో మునిగితేలుతుంటారు. రీల్స్, సోషల్ మీడియాలోని పలు రకాల కంటెంట్ ఇందుకు కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు హల్యూసినేషన్స్‌(Hallucination)కు దారితీస్తుంది. సోషల్ నెట్వర్క్ తగ్గడం, ఒంటరి తనం పెరగడం వంటివి జరగవచ్చు.

ఎలా బయటపడాలి?

టెక్నాలజీని వ్యతిరేకించడం వల్లో, స్మార్ట్‌ఫోన్ (Smart phone) వినియోగాన్ని వ్యతిరేకించడంవల్లో సమస్యకు పరిష్కారం దొరకదు. ఎందుకంటే ప్రతీ ఆవిష్కరణ వెనుక ఒక ప్రయోజనం ఉంటుంది. స్మార్ట్ ఫోన్ కూడా అంతే. దానివల్ల చాలా ఉపయోగాలున్నాయి. దుర్వినియోగం చేయడంవల్లే సమస్యలకు దారితీస్తుంది. అందుకే పిల్లలు, టీనేజర్లు దానిని ఎలా యూజ్ చేయాలనే విషయంలో పెద్దలు కేర్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. స్ర్కీన్ టైమ్ (Screen time) తగ్గించం ద్వారా, టెన్నాలజీపట్ల అవగాహన పెంపొందించడం ద్వారా కూడా పిల్లల్లో స్మార్ట్‌ఫోన్ అతి వినియోగాన్ని అరికట్టవచ్చు. స్మార్ట్ ఫోన్ వినియోగం కంటే బయట గ్రౌండ్‌లో ఆడుకోవడం, సామాజిక పరిస్పర చర్యల్లో (In social interactions) పాల్గొనడం వంటి విషయాల్లో పిల్లల్ని ప్రోత్సహించాలి. తప్పనిసరి స్మార్ట్ ఫోన్ వాడాల్సి ఉన్నప్పుడు టైమ్ లిమిట్ పెట్టాలి. సెక్యూరిటీ సెట్టింగ్స్‌ను ఎనేబుల్ చేయాలి. దీంతోపాటు నిపుణుల సలహాలు పాటించాలి.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.



Next Story