Stress management: ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు..! ఆ సమస్యలు పెరుగుతాయంటున్న నిపుణులు

by Javid Pasha |
Stress management: ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు..! ఆ సమస్యలు పెరుగుతాయంటున్న నిపుణులు
X

దిశ, ఫీచర్స్: కండరాల నొప్పి, తలనొప్పి తరచుగా వేధిస్తున్నాయా? అతి నిద్ర లేదా నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? ఆకలి మందగించడం లేదా అసలుకే లేకపోవడం, ఎప్పుడూ అనారోగ్యంగా ఉన్నట్లు అనిపించడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారా? అయితే మీరు తీవ్రమైన ఒత్తిడి లేదా డిప్రెషన్‌లో ఉండవచ్చు అంటున్నారు మానసిక నిపుణులు. ఎందుకంటే ఈ తరహా లక్షణాలు వీరిలోనే ఎక్కువగా కనిపిస్తాయని చెప్తున్నారు. దీర్ఘకాలం కొనసాగితే మధుమేహం, హార్మోన్ల అసమతుల్యత సహా పలు ఇతర అనారోగ్యాలకు దారితీయవచ్చు.

ఒత్తిడి మధుమేహానికి దారితీస్తుందా ?

సాధారణంగా అనేక వ్యాధులకు ఒత్తిడి కూడా కారణం అవుతున్నట్లు నిపుణులు చెప్తున్నారు. ఏ అనారోగ్య సమస్య అయినా ముందుగా స్ట్రెస్‌తోనే ప్రారంభం అవుతుంది. అలాంటి వాటిలో డయాబెటిస్ కూడా ఒకటి. అందుకే ఒత్తిడికి, మధుమేహానికి మధ్య సంబంధం ఉందని వైద్య నిపుణులు చెప్తుంటారు. ఎలాగంటే.. స్ట్రెస్‌కు గరైనప్పుడు శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీని కారణంగా బాడీలో గ్లూకోజ్ లెవల్స్ పెరుగుతాయని, మధుమేహానికి కారణం అవుతాయని చెప్తారు. కార్టిసాల్‌తోపాటు కాటెకోలమైన్స్, థైరాయిడ్ సహా శరీరంలోని వివిధ హార్మోన్లలో మార్పులు, హెచ్చు తగ్గులు సంభవిస్తాయని, ఈ పరిస్థితి హార్మోన్ల అసమతుల్యతకు, ఇతర వ్యాధులకు దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఒత్తిడి తక్కువగా ఉండే జీవనశైలిని కలిగి ఉండాలని నిపుణులు చెప్తున్నారు.

ఒత్తిడి లక్షణాలు

ఒత్తిడి అనేది సహజమే అనుకుంటాం. అది సాధారణంగా ఉన్నంత వరకు పర్లేదు కానీ.. అధిక ఒత్తిడి అనారోగ్యాలకు దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి లక్షణాలను గుర్తించి జాగ్రత్తపడితే స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, మధుమేహం సహా పలు ఇతర వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చని అంటున్నారు. ఇక లక్షణాల విషయానికి వస్తే కండరాల నొప్పి, తలనొప్పి, నిద్రలేమి, తరచుగా అనారోగ్యానికి గురవుతుండటం, అలసట, ఆకలి మందగించం లేదా అధిక ఆకలి వంటివి ఒత్తిడిలో ఉన్న వ్యక్తుల్లో కనిపించే లక్షణాలు. ఇవేకాకుండా చిరాకు, కోపం, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ డిప్రెషన్‌లో కూరుకుపోవడం, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కు దూరంగా ఉండాలనుకోవడం, ఆలోచనలను షేర్ చేసుకోకపోవడం, ఒంటరితనాన్ని కోరుకోవడం, అధిక మద్యపానం వంటివి ఒత్తిడి లేదా డిప్రెషన్‌లో బాధితుల్లో కనిపించే లక్షణాలు.

పరిష్కారం ఏమిటి?

ఒక సమస్య పరిష్కరించాలంటే ముందు దానికి గల మూలకారణాలను తెలుసుకోవాలి. ఒత్తిడి కూడా అంతే. మీరు ఎందుకు దానిబారిన పడుతున్నారో ఒకసారి పరిశీలించుకోవాలి. ఆ పరిస్థితులను నివారించాలి. అలాగే ప్రతిరోజూ వ్యాయామాలు, యోగా లేదా ధ్యానం వంటివి చేయడం, ప్రకృతిలో నడవడం, ఇష్టమైన సంగీతం వినడం, ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడటం, కెఫిన్ రిలేటెడ్ పానీయాలకు దూరంగా ఉండటం, ఇష్టమైన పుస్తకాలు చదవడం వంటి అలవాట్లు ఒత్తిడిని దూరం దూరం చేస్తాయని మానసిక నిపుణులు చెప్తున్నారు. అప్పటికీ ఫలితం లేకపోతే సైకాలజిస్టులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed