Phubbing : పక్కనున్నా పట్టించుకోరు..! సంబంధాల్లో విచ్ఛిన్నానికి ఇదీ ఓ కారణమే..

by Javid Pasha |   ( Updated:2024-12-13 15:28:27.0  )
Phubbing : పక్కనున్నా పట్టించుకోరు..! సంబంధాల్లో విచ్ఛిన్నానికి ఇదీ ఓ కారణమే..
X

దిశ, ఫీచర్స్ : ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలోనే ఏదో గుర్తుకొచ్చినట్లు వెంటనే ఒకరు ఫోన్‌ చేతిలోకి తీసుకుంటారు. ఏదో స్క్రోల్ చేస్తూ అందులో లీనమై పోతారు. ఈ సందర్భంలో పక్కనున్న వ్యక్తిని పెద్దగా పట్టించుకోరు. మరికొన్నిసార్లు వేరేవాళ్లతో మాట్లాడుతూ భాగస్వామిని విస్మరిస్తుంటారు. ఇలా పక్కనున్న వారిని పట్టించుకోకుండా, అనవసర విషయాలపై ఫోకస్ చేసే ట్రెండ్ ఇటీవల బాగా పెరిగిపోతోంది. దీనినే ‘ఫబ్బింగ్’ అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం రిలేషన్‌షిప్‌లో గొడవలకు, ప్రేమికుల మధ్య బ్రేకప్‌లకు ఇది కూడా కారణం అవుతోంది.

‘ఫబ్బింగ్’లో ఏం చేస్తారు?

రిలేషన్‌షిప్‌లో ఒకరిపై ఒకరు ప్రేమ, శ్రద్ధ, గౌరవ భావాలను కలిగి ఉండటం చాలా ముఖ్యం. అప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. అలా కాకుండా ఎవరో ఒకరు భాగస్వామిని నిర్లక్ష్యం చేసినట్లు, అవమానించినట్లు, పట్టించుకోకుండా ఉంటే అది అవమానంగానో, బాధగానే అనిపించవచ్చు. ప్రస్తుతం ‘ఫబ్బింగ్’లో అదే జరుగుతోంది. ఈ పరిస్థతిలో ఉన్న వ్యక్తి స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ అవ్వడంవల్ల భాగస్వామిని లేదా పక్కనున్న ముఖ్యమైన వ్యక్తిని కూడా పట్టించుకోరు. కొన్నిసార్లు పరధ్యానంలో ఉండిపోతారు. ఫోన్‌‌లో వీడియోలు స్ర్కోల్ చేస్తూ ఇవతలి వ్యక్తితో మాట్లాడకపోవడం, వేరే వాళ్లలతో ఎక్కువసేపు మాట్లాడటం చేస్తూ పక్కనున్న వ్యక్తిని విస్మరిస్తారు. ఫలితంగా తమను పట్టించుకోవడం లేదనే ఫీలింగ్ భాగస్వామిలో కలుగుతుంది. ఆ సమయంలో బాధపడటం లేదా గొడవకు దిగడం వంటివి జరగవచ్చు.

పర్యవసనాలు

భాగస్వామిని పట్టించుకోని ‘ఫబ్బింగ్’ పోకడల వల్ల సమస్యలు తలెత్తుతాయి. తమను నిర్లక్ష్యం చేస్తున్నారని అవతలి వ్యక్తి నొచ్చుకుంటారు. పక్కనున్న వారిని పట్టించుకోకుండా వేరేవాళ్లతో ఫోన్‌లో ఎక్కువసేపు మాట్లాడటం చేస్తుంటే ఈ వ్యక్తి దృష్టిలో తాము అంత ముఖ్యం కాదన్న అభిప్రాయం కలుగుతుంది. దీంతో తాము కూడా దూరం కావాలని అవతలి వ్యక్తి లేదా భాగస్వామి అనుకోవచ్చు. ఇది ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్‌కు దారితీయవచ్చు. ముఖ్యంగా రిలేషన్ షిప్‌లో డిస్ కనెక్ట్ అయినట్లు ఫీల్ అవుతారు.

గొడవలు, విడాకులు

బంధాన్ని నిర్లక్ష్యం చేశారన్న భావాలకు ‘ఫబ్బింగ్’ ప్రేరణగా నిలుస్తుంది. జంటల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. తమను ఎందుకు పట్టించుకోవడం లేదని భాగస్వామిని నిలదీయడం, వాదనకు దిగడం వంటివి చోటు చేసుకోవచ్చు. నిజానికి ఫబ్బింగ్ చేసేవారికి తాము పెద్ద పొరపాటు చేయలేదు అనిపించవచ్చు. కానీ అవతలి వ్యక్తి మనసును అది తీవ్రంగానే గాయపరుస్తుంది. బాధకు కారణం అవుతుంది. తర్వాత గొడవలకు, విడాకులకు కూడా కారణంగా మారవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలా చాలానే జరుగుతున్నాయని చెబుతున్నారు.

పరిష్కార మార్గమేది?

ఫబ్బింగ్.. అంటే ఎదుటి వ్యక్తిని విస్మరించడం అనేది రకరకాల ప్రభావాలవల్ల ఏర్పడవచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియాలో లీనమైపోవడం ఇందుకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. చాలామంది ఇన్‌స్టా, ఫేస్ బుక్ వంటి వేదికల్లో స్క్రోల్ చేస్తూ భాగస్వామిని పట్టించుకోరు. మరికొందరు టీవీలు లేదా ఇతర డివైజ్‌లలో మునిగిపోయి ఇలా చేయవచ్చు. ఇద్దరు కలిసి ఉన్నప్పుడు వాటికి దూరంగా ఉండటం. పరిమితంగా వాడటం వంటివి చేయడాన్ని ఒక పరిష్కార మార్గంగా నిపుణులు సూచిస్తున్నారు. దీంతోపాటు ఫోన్‌, సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌ల నోటిఫికేషన్లు ఆఫ్ చేయడంవల్ల మాట్లాడుతున్నంతసేపు దృష్టి అటువైపు వెళ్లకుండా ఉంటుంది. దీంతో పక్కనున్న వ్యక్తికి క్వాలిటీ సమయాన్ని కేటాయిస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కువసేపు ఫోన్ మాట్లాడాల్సి వచ్చినా, బయటకు వెళ్లాల్సి వచ్చినా భాగస్వామికి ముందే క్లారిటీ ఇస్తే ఇబ్బందిగా ఫీల్ అయ్యే చాన్స్ ఉండదు.

Read More..

Healthy foods : వింటర్‌లో పోషకాహార లోపం.. గర్భిణులకు మేలు చేసే ఫుడ్స్ ఇవే..

Advertisement

Next Story

Most Viewed