ఎంతకీ నిద్ర మేల్కోవడం లేదా.. అది ‘డైసానియా’ కావచ్చు!

by Hamsa |
ఎంతకీ నిద్ర మేల్కోవడం లేదా.. అది ‘డైసానియా’ కావచ్చు!
X

దిశ, ఫీచర్స్: రాత్రిపూట త్వరగా పడుకొని ఉదయం ఆరుగంటలలోపే నిద్రలేవడం మంచిది అంటుంటారు పెద్దలు. కానీ లేవాలని అనుకున్నా కొందరు లేవలేకపోతారు. ఒళ్లంతా మబ్బుగాను, బద్దకంగాను అనిపిస్తూ అస్సలు లేవబుద్ది కాదు. ఒకవేళ నిద్రలేచినా మళ్లీ పడుకోవాలని పిస్తుంది. ఈ పరిస్థితి సాధారణంగా ఏర్పడిన అలవాటు కావచ్చు. లేదా డైసానియా అనే మానసిక సమస్య కూడా కావచ్చు. దీనికంటూ ప్రత్యేకంగా వైద్యపరమైన నిర్ధారణలంటూ ఉండవు కానీ, సమస్య పరిష్కారానికి మానసిక వైద్యం మాత్రం అందుబాటులో ఉందంటున్నారు నిపుణులు.

డైసానియా అంటే..

నిద్ర మేల్కోవడానికి ఆటంకంగా మారుతున్న నిద్ర లేదా నిద్ర మత్తు ఆవహించే స్థితినే డైసానియా అంటారు. ఏవో కొన్ని సందర్భాల్లోనో, కొన్ని రోజులో కాకుండా దీర్ఘకాలికంగా మీరు నిద్ర త్వరగా లేవలేకపోతుంటే డైసానియాగా అనుమానించవచ్చు. ఈ సమస్య ఉన్నవారిలో ఉదయం వేళ తీవ్ర అలసటగా కూడా అనిపిస్తుంది.

గుండె జబ్బులూ కారణం కావచ్చు

ప్రముఖ హెల్త్ మాగజైన్, జామా ఇంటర్నల్ మెడిసిన్‌లో పబ్లిషైన ఒక అధ్యయనం ప్రకారం గుండె జబ్బులు ఉన్నవారిలో కూడా డైసానియా సమస్య ఉండవచ్చు. ఈ జబ్బులు అలసటను, బద్దకాన్ని కలిగిస్తాయి. నిద్రలేవడం కష్టతరం చేస్తాయి. అధిక బరువు, డయాబెటిస్, హైబీపీ, హై కొలెస్ట్రాల్, శ్వాస సంబంధిత సమస్యలు కూడా బద్దకానికి, నిద్ర లేవలేక పోవడానికి దారి తీస్తాయి.

క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్

నాలుగు నుంచి ఆరు నెలలపాటు తరచూ నిద్రలేవలేక ఇబ్బంది పడటం, అలసటగా అనిపించడం వంటి లక్షణాలుంటే.. అది క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ (CFS) అయి ఉండవచ్చు. సాధారణంగా అలసట అనేది కొంచెం రెస్టు తీసుకున్నాక తగ్గతూ ఉంటుంది. కానీ క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ ఉన్నవారిలో రెస్టు తీసుకుంటే అలసట, బద్దకం మరింత ఎక్కువవుతాయి. శారీరక, మానసిక బలహీనతలు కనిపిస్తాయి.

డిప్రెషన్

డైసానియా(త్వరగా నిద్రలేవలేని బద్దకం) దీర్ఘకాలంపాటు కొనసాగితే క్రమంగా డిప్రెషన్‌కు దారితీయవచ్చని నిపుణులు అంటున్నారు. డిప్రెషన్, డైసానియా రెండూ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. అదెలాగంటే.. డిప్రెషన్ సమస్య ఎదుర్కొంటున్న వారికి సరిగ్గా నిద్ర పట్టదు. ఇలా విధంగా నిద్రలేని కారణంగా డిప్రెషన్ సమస్య మరింత తీవ్రమవుతుంది. దీర్ఘకాలిక డైసానియా అనేది హపో థైరాయిడిజం సమస్య ఉన్నవారిలో తీవ్రమైన అలసటకు, ఆ తర్వాత అనారోగ్యానికి దారి తీయవచ్చు. వాతావరణ పరిస్థితులు, సాధారణ అలసటవల్ల కాకుండా, తరచూ ఒక అలవాటుగా నిద్రలేవలేకపోవడం, బద్దకం ఆవహించడం అనే సమస్య కనిపిస్తే మానసిక నిపుణులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం బెటర్.

Advertisement

Next Story