మెదడులోని ఆ భాగమే జ్ఞాపకశక్తి కోల్పోవడానికి కారణం.. తాజా అధ్యయనం

by Hamsa |
మెదడులోని ఆ భాగమే జ్ఞాపకశక్తి కోల్పోవడానికి కారణం.. తాజా అధ్యయనం
X

దిశ, ఫీచర్స్: జ్ఞాపక శక్తి కోల్పోవడానికి, అల్జీమర్స్ వ్యాధికి సంబంధించిన ఇంకా అనేక పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. నాడీ సంబంధిత రుగ్మతలతో ఈ సమస్య ఏర్పడుతుందనే అవగాహన వైద్య పరంగా ఉన్నప్పటికీ మెదడులో అందుకు గల కీలక ప్రాంతం ఏది ? అనే విషయంలో అనేక సందేహాలు ఉన్నాయి. అందుకే సైంటిస్టులు మెదడులో జ్ఞాపశక్తి తాలూకు అధ్యయనాలు కంటిన్యూ చేస్తున్నారు. తాజా అధ్యయనం ప్రకారం.. మెదడులోని హిప్పోకాంపస్, ప్రిఫ్రంటల్ కార్టెక్స్ లోపల, వాటి మధ్య ఏర్పడిన బహుళ నాడీ మెకానిజం(multiple separate groups of neurons) మధ్య సమన్వయం లేకపోవడం జ్ఞాపకశక్తి కోల్పోవటానికి దారితీస్తుందని ఎలుకలపై చేసిన తాజా అధ్యయనంలో వెల్లడైంది.

న్యూరల్ అసెంబ్లీస్(neural assemblies)సమాచారాన్ని క్రోడీకరించి ‘ప్రాసెస్’ చేయడానికి దోహదపడేవి మెదడులోని కీలక ప్రాంతాలైన న్యూరాన్‌ల బహుళ సమూహాలు. ఇవి మెదడులోపలి భాగంలో అంతటా అనుసంధానించబడి ఉంటాయి. నేర్చుకోవడం, గుర్తుంచుకోవడం, జ్ఞాపకాలను పదిల పరుచుకోవడం వంటి మెమొరీకి దోహదపడతాయని నిపుణులు తెలుసుకున్నారు. ఇక్కడ ప్రధానంగా అనుసంధానించబడి ఉండే నాడీ మెకానిజం సందర్భోచితంగా పనిచేయకుండా వైఫల్యం చెందినప్పుడు జ్ఞాపకాలను కోల్పోయేలా చేస్తుందని అధ్యయనం తెలిపింది.

యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్, జర్మనీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ హైడెల్‌బర్గ్ పరిశోధకుల నేతృత్వంలో జరిగిన ఈ తాజా అధ్యయనం ప్రస్తుతం బయాలజీ జర్నల్‌లో పబ్లిషైంది. స్వల్పకాలిక జ్ఞాపకశక్తి రెండు కీలక మెదడు ప్రాంతాలపై ఆధారపడి ఉంటుందని, వాటిని మెదడులోని హిప్పోకాంపస్, ప్రిఫ్రంటల్ కార్టెక్స్ అంటారని నిపుణులు పేర్కొన్నారు. మనం ఆలోచించడం, ప్రస్తుతం, తర్వాత ఏం చేయాలి? వంటి అంశాలు మెదడులోని హిప్పోకాంపస్, ప్రిఫ్రంటల్ కార్టెక్స్ న్యూరాన్ల సంఘర్షణ ద్వారా మనిషిని నడిపిస్తాయి. అయితే దీనివల్ల జ్ఞాపకాలు ఎలా ఏర్పడతాయి? ఎలా ప్రోగ్రామింగ్ చేయబడతాయి? నాడీ మెకానిజం పనితీరు వంటి అంశాలపై ఇంకా లోతైన అధ్యయనం కొనసాగిస్తామని నిపుణులు చెప్తున్నారు.

ఎలుకలపై పరిశోధనలో తేలిందేమిటి?

కొన్నిసార్లు జ్ఞాపకశక్తి ఎందుకు కోల్పోతుంటారనే విషయాన్ని తెలుసుకునే దిశగా అధ్యయనం కొనసాగింది. ‘‘న్యూరల్ అసెంబ్లీలు’’ మొట్టమొదట 70 సంవత్సరాల క్రితం ప్రతిపాదించబడ్డాయి. కానీ వాటిని గుర్తించడం కష్టమని నిపుణులు చెబుతూ వస్తున్నారు. తాజాగా ఎలుకలలో మెదడు రికార్డింగ్‌లను ఉపయోగించి, హిప్పోకాంపస్, ప్రిఫ్రంటల్ కార్టెక్స్ లోపల, మధ్య భాగాన ఏర్పడిన బహుళ నాడీ మెకానిజాన్ని కలుపుకొని డైనమిక్ ఇంటరాక్షన్‌ల ద్వారా మెమరీ ఎన్‌కోడింగ్, స్టోరేజ్ అండ్ రీకాల్‌కు తోడ్పడుతుందని పరిశోధనా బృందం పేర్కొన్నది. ఎలుకల్లో న్యూరాన్స్ మెకానిజం సక్రమంగా పనిచేయనప్పుడు అవి మతి తప్పి వ్యహరించాయని అధ్యయనంలో తేలింది.

మెమొరీ పునరుద్ధరణ

‘‘మెమొరీ పునరుద్ధరణ కోసం సమర్థవంతమైన ట్రీట్మెంట్‌ను కనుగొనేందుకు ఈ అధ్యయనం తోడ్పడాలనే దిశగా నిపుణులు ముందుకు సాగుతున్నారు. మరోవైపు సక్సెస్, ఫెయిల్యూర్‌లను గుర్తుంచుకోవడంలో మెదడులో జరిగే క్లిష్టమైన ప్రక్రియలను మా పరిశోధనలు గుర్తించాయని తెలిపారు. ఇవి నాడీ సమూహాల పరస్పర చర్యల స్థాయిలో ట్రీట్మెంట్ అవసరాన్ని, ఆచరణీయమైన లక్ష్యాలను కలిగి ఉన్నాయి’’ అని అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకుడు మిచెల్ కుసెవిచ్ చెప్పాడు. మెదడు రుగ్మతలో బలహీనమైన జ్ఞాపకశక్తిని పునరుద్ధరించడానికి మనుషుల్లోని నాడీ మెకానిజం పనిచేస్తుందని అతను వెల్లడించాడు.

Advertisement

Next Story

Most Viewed