Microplastics In Antarctic Snow: కురిసిన మంచులో 'మైక్రో ప్లాస్టిక్స్'.. ఆందోళనలో పరిశోధకులు!

by Manoj |   ( Updated:2022-06-10 09:54:36.0  )
Microplastics found in antarctic snow for first time
X

దిశ, ఫీచర్స్: Microplastics found in antarctic snow for first time| ఆశ్రయం కల్పిస్తున్న భూమికి, అవసరాలు తీరుస్తున్న ప్రకృతికి వందల ఏళ్లుగా నష్టం కలిగిస్తున్నాం. అయినా ఏమవుతుందన్న ధీమాతో చేసిన తప్పులే నేడు 'పర్యావరణ మార్పు'నకు దారితీశాయి. పర్యవసానంగా ఊహించని ఉష్ణోగ్రతలను చవిచూస్తున్నాం. ఊళ్లకు ఊళ్లనే ముంచేస్తున్న కుంభవృష్టికి ఎదుర్కొంటున్నాం. ఇలాంటి మరెన్నో ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నా.. మార్పు దిశగా అడుగులు పడటం లేదు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం లేదు. మొన్నటికిమొన్న గర్భస్థ పిండంలో ప్లాస్టిక్ అవశేషాలు కనిపించగా.. ఇప్పుడు అంటార్కాటికాలో కురిసే మంచులో మైక్రోప్లాస్టిక్స్ గుర్తించినట్లు న్యూజిలాండ్ పరిశోధకులు పేర్కొన్నారు. కాగా ప్లాస్టిక్ వినియోగం భూమిపైనున్న పర్యావరణ వ్యవస్థలన్నింటికీ విస్తరించిందని ఈ సంఘటన రుజువు చేసింది.

అంటార్కిటికా మంచులో కనిపించే మైక్రోప్లాస్టిక్స్ బియ్యపు గింజ కంటే తక్కువ పరిమాణంలో ఉన్నాయి. గతంలో అంటార్కిటికా సముద్రపు మంచు, ఉపరితల నీటిలో మైక్రోప్లాస్టిక్స్ గుర్తించగా.. కురుస్తున్న మంచులో చిన్నపాటి ప్లాస్టిక్స్ కణాలు కనుగొనడం మాత్రం ఇదే మొదటిసారని పరిశోధకులు పేర్కొన్నారు. ఇవి మంచును వేగంగా కరిగిస్తాయని, తద్వారా అంటార్కిటికాలోని పర్యావరణ వ్యవస్థల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. న్యూజిలాండ్ డాక్టర్ లారా రెవెల్ పర్యవేక్షణలో క్యాంటర్‌బరీ యూనివర్సిటీ పీహెచ్‌డీ విద్యార్థి అలెక్స్ ఏవ్స్ ఈ అధ్యయనాన్ని నిర్వహించగా సంబంధిత వివరాలు సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

2019లో రాస్ ఐస్ షెల్ఫ్ నుంచి మంచు నమూనాలను సేకరించిన ఏవ్స్, వాతావరణంలోని మైక్రోప్లాస్టిక్స్ ఇప్పుడు మంచులోకి చొరబడ్డాయని గుర్తించాడు. ఈ మంచు షెల్ఫ్‌లోని మొత్తం 19 నమూనాల్లో ప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు లీటర్ పరిమాణపు కరిగిన మంచులో 29 మైక్రోప్లాస్టిక్ కణాలను కనుగొంది.

ఎవరెస్ట్ శిఖరం నుంచి మన ఊపిరితిత్తుల వరకు దాదాపు ప్రతిచోటా మైక్రోప్లాస్టిక్స్ కనిపిస్తాయి. అంటే పర్యావరణంలోకి వెళ్లేంత ప్లాస్టిక్‌ను మనం వినియోగిస్తున్నామని అర్థం. కాబట్టి ఇకనైనా మేల్కొకపోతే .. ప్లాస్టిక్‌తో మానవులకు ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed