Scammers : మిస్డ్ కాల్ వచ్చిందని తిరిగి ఫోన్ చేశారో.. ఇక అంతే!!

by Javid Pasha |   ( Updated:2025-01-08 09:36:40.0  )
Scammers : మిస్డ్ కాల్ వచ్చిందని తిరిగి ఫోన్ చేశారో.. ఇక అంతే!!
X

దిశ, ఫీచర్స్ : మనమేదో వర్క్‌లో ఫుల్ బిజీగా ఉంటాం. ఒక్కసారిగా ఫోన్ మోగుతుంది. రిసీవ్ చేసుకుందామనే సరికి కట్..! అలా కట్టైతే ఊరుకుంటామా.. ఏంది? ఎవరై ఉంటారా? అని ట్రూ కాలర్‌లో చెక్ చేస్తాం.. ఇంకేముంది అందమైన డీపీతో కూడిన అమ్మాయో, అబ్బాయో కనిపిస్తారు. ఇక ఇవతలి వ్యక్తి మహిళ అయితే తనకు కాల్ చేసిన ఆ మహానుభావుడెవరో తెలుసుకుందామనే ఆత్రుతో, పురుషుడైతే గనుక తనకు కాల్ చేసిన ఆ అమ్మాయెవరో కనుగొందామనే ఉత్సాహంతో కాల్ బ్యాక్ చేస్తుంటారు. ఇదే మనం చేస్తున్న అసలు పొరపాటు అంటున్నారు నిపుణులు. ఏం జరుగుతుందో చూద్దాం.

వచ్చిన మిస్డ్ కాల్‌ లోకలా, ఎస్టీడీనా, ఐఎస్‌డీనా, అసలు మన దేశానికి సంబంధించినదేనా? ఇంటర్నేషనల్ కాలింగా? అనేది ఏమాత్రం చెక్ చేసుకోకుండా డయల్ చేస్తుంటారు చాలా మంది.. ఇంకేముంది ఇలా చేసినవారు ప్రీపెయిడ్ కస్టమర్లయితే మాట్లాడుతున్నంత సేపూ నిమిషానికి 200 నుంచి 300 కట్ అవుతాయి. అలాగే కొందరు హ్యాకర్లు కాల్ రిసీవర్లను మాటల్లో పెట్టి సీక్రెట్‌గా వీరి ఫోన్‌లోని సమాచారాన్ని, బ్యాంక్ అకౌంట్లను దొంగిలిస్తుంటారు. ఈ తరహా మోసాలు ఇటీవల పెరుగుతున్నాయనే వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం. సైబర్ నిపుణులు కూడా చెబుతున్నారు. తాజాగా ‘ప్రీమియం రేట్ సర్వీస్ స్కామ్’పై రిలయన్స్ జియో కూడా తన యూజర్లకు ఇలాంటి హెచ్చరికే జారీ చేసింది. +91 మినహాయించి, అదర్ ప్రిఫిక్స్‌తో వచ్చే ఇంటర్నేషనల్ కాల్స్‌ను, ముఖ్యంగా మిస్డ్ కాల్స్‌ను ఈజీగా నమ్మవద్దని సూచించింది. కాల్ బ్యాక్ చేయకూడదని హెచ్చరించింది.

ఇటీవల కాలంలో జియో సహా పలు నెట్వర్కుల కస్టమర్లకు ఐఎస్‌డీ నెంబర్లతో కాల్స్ రావడం రిసీవ్ చేసుకోగానే లేదా కాల్ బ్యాక్ చేయగానే బాధితుల అకౌంట్లో డబ్బులు కట్ కావడం వంటి మోసాలు జరుగుతున్నాయని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కాల్ బ్యాక్ చేసిన ప్రతీసారి రూ. 200 నుంచి రూ. 300 వరకు చార్జ్ అవుతున్న సందర్భాలు అధికంగా ఉంటున్నాయట. కాబట్టి మీ మొబైల్‌లో ఇంటర్నేషనల్ కాల్ బ్లాకింగ్ సెట్ చేసుకోవాలని జియో తన కస్టమర్లకు సూచించింది. ఇతర నెట్వర్క్ యూజ్ చేసేవారు కూడా అలర్ట్ అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

స్కామర్లతో జాగ్రత్త

ఒక్క మిస్డ్ కాల్ ఎంత పనిచేస్తుందో.. దానివల్ల మోసపోయిన వారికి, అవగాహన ఉన్నవారికి ఆల్రెడీ తెలుస్తుంది. అయితే ఈ విషయాల గురించి తెలియనప్పుడు మాత్రం చిక్కుల్లో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిస్డ్ కాల్ వచ్చింది కదా అని ఉత్సాహం కొద్దీ కాల్ బ్యాక్ చేస్తే నష్టోయినట్లే. అలాంటి స్కాములు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. అలాంటి వాటిలో ఫిషింగ్, టెక్ సపోర్ట్, లాటరీ, రొమాన్స్ వంటి స్కామర్లు ప్రధానంగా ఉంటున్నాయి.

*ఫిషింగ్ స్కామర్లు : ఈ తరహా స్కామర్లు తరచుగా మిస్డ్ కాల్ ఇస్తుంటారు. రిసీవ్ చేసినా లేదా మిస్డ్ కాల్ చూసుకొని కాల్ బ్యాక్ చేసినా నష్టపోయే అవకాశం ఉంటుంది. అవతలి వారు తరచుగా బ్యాంక్ లేదా ఏదైనా ఫేమస్ కంపెనీకి చెందినవారుగా క్లెయిమ్ చేస్తుంటారు. మన బ్యాంక్ వివరాలు, ఏటీఎం, క్రెడిట్ కార్డుల నంబర్లు, సీవీవీ నంబర్లు వంటివి అడుగుతుంటారు. వాటిని అప్డేట్ చేయకపోతే డబ్బులు కట్ అవుతాయని లేదా అకౌంట్ నెంబర్ బ్లాక్ అవుతుందని చెప్తారు. ఓటీపీ చెబితే అప్డేట్ చేస్తామంటూ నమ్మించే ప్రయత్నం చేస్తారు. నమ్మి వివరాలను షేర్ చేశామో.. ఇక అంతే.. ఖాతా ఖాళీ అయినట్టే!

* టెక్ సపోర్ట్ స్కామర్లు : కొన్నిసార్లు మీకు వచ్చిన మిస్డ్ కాల్‌కి తిరిగి కాల్ చేస్తే అవతలి వ్యక్తి మీ ఫోన్ లేదా మీరు వాడుతున్న డివైస్ ఏదైనా కావచ్చు, దానికి మాల్వేర్ సోకినట్లు చెబుతారు. దానిని సెట్ చేస్తామని, ఓటీపీ లేదా మీ ఈ మెయిల్, పాస్ వర్డ్‌లు తదితర వివరాలు చెప్పాలని అడుగుతారు. నమ్మేశారో.. మీ పర్సనల్ వివరాలు మొత్తం హ్యాక్ అయినట్లే!

*లాటరీ స్కామర్‌లు (Lottery scammers): కొన్నిసార్లు మిస్డ్ కాల్ చూసుకొని మీరు అవతలి వ్యక్తికి కాల్ చేస్తారు. ఇంకేముంది అటువైపు నుంచి మిమ్మల్ని మాటల్లో దించుతారు. మీకు లాటరీ తగిలిందని లేదా మీ నంబర్ గిఫ్ట్ కోసం సెలెక్ట్ అయిందని చెప్తారు. బహుమతులను మీ అడ్రస్‌కు పంపాలంటే ముందుగా కొంత పేమెంట్ చేయాలని అడుగుతారు. ఇది నమ్మి నిజంగానే వారికి డబ్బులు చెల్లిస్తే మోసపోయినట్లే.

* రొమాన్స్ స్కామర్లు : మీరు పొగడ్తలకు, వెరైటీలకు పడిపోయే వ్యక్తులైతే రొమాన్స్ స్కామర్లు పొంచి ఉన్నారు జాగ్రత్త అంటున్నారు నిపుణులు. ఏదో మిస్డ్ కాల్ వచ్చిందని తిరిగి కాల్ చేస్తే తియ్య తియ్యని మాటలతో మిమ్మల్ని ఆకట్టుకుంటారు. మీ డీపీ చూశామని, మీ ఇన్‌స్టా లేదా ఇతర ప్రొఫైల్స్ చూశామని, మీరు అందంగా ఉంటారని పొగిడేస్తుంటారు. అంతేకాకుండా అవతలి వ్యక్తి పెద్ద బిజినెస్‌మెన్ అని లేదా పెద్ద కంపెనీలో సీఈఓలమని కూడా చెప్పవచ్చు. మెల్లిగా మాటల్లో దించి ఇవతలి వ్యక్తి వీక్‌నెస్‌ను బట్టి లవ్, ఫ్రెండ్‌షిప్, డేటింగ్, రిలేషన్‌షిప్ వంటి సంబంధాలు కలుపుకునే ప్రపోజల్స్ తెస్తారు. ఆ తర్వాత ఏదో ఒక సీన్ క్రియేట్ చేసి మీ ద్వారా డబ్బులు లాగేస్తారు. కాబట్టి కాల్ బ్యాక్ చేసిన తర్వాత అవతలి వ్యక్తి మీకు సంబంధం లేనివారైతే.. మీ వివరాలు అడుగుతుంటే, మిమ్మల్ని ఎక్కువగా పొగుడుతుంటే.. కట్ చేయడం మంచిదంటున్నారు నిపుణులు.

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

* ఏదైనా తెలియని నంబర్ల నుంచి కాల్స్ వస్తే అవి స్పామ్ కాల్స్ అయితే తిరిగి కాల్ చేయవద్దు. ముఖ్యంగా +91 కాకుండా అదర్ ఐఎస్‌డీ కోడ్స్ ఉంటే బీ కేర్ ఫుల్ అంటున్నారు నిపుణులు. కాలర్ ఐడీని ధృవీకరించుకోవాలి. స్ఫూఫింగ్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే స్కామర్లు లీగల్‌గా కనిపించడానికి నకిలీ కంపెనీలు, వ్యక్తులు, ప్రముఖులు, సెలబ్రిటీల లోగోలు, వారి ఫొటోలను డీపీలుగా కూడా పెట్టుకోవచ్చు.

* తెలియని వ్యక్తితో కాల్ మాట్లాడుతున్నప్పుడు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ను అస్సలు షేర్ చేయవద్దు. అట్లనే పాస్ వర్డ్‌లు, ఏటీఎం లేదా క్రెడిట్ కార్డ్ నంబర్లు, ఇతర గుర్తింపు కార్డుల గురించిన వివరాలు ఇవ్వకూడదు. ఏదో అర్జంట్ అని, ఎమర్జెన్సీ అని స్కామర్లు మిమ్మల్ని ఆందోళనకు గురిచేసేలా, మీ ఎమోషన్స్‌తో ఆడుకునేలా బిహేవ్ చేస్తారు. కొన్నిసార్లు ఇలాంటి ఒత్తిళ్లకు తలొగ్గి వివరాలు పంచుకుంటే, మీ ఖాతా ఖాళీ కావచ్చు లేదా మీ వ్యక్తిగత సమాచారం దొంగిలించబడవచ్చు. అలాగే మీకు కాల్ లేదా మిస్డ్ కాల్ వచ్చిన నంబర్ స్పామ్‌గా నివేదించబడిందో లేదో ఆన్‌లైన్‌లో చెక్ చేయండి. అలాగే చట్టబద్ధమైన స్పామ్ కాల్ బ్లాకింగ్ సెట్టింగ్‌లు, యాప్‌లు వంటివి కూడా మీ ఫోన్‌లో యూజ్ చేయడం ద్వారా స్పామ్ కాల్స్‌ను నివారించడంలో సహాయపడతాయి. ఏదైనా అనుమానం వస్తే పోలీసులను, సైబర్ నిపుణులను సంప్రదించవచ్చు.

Advertisement

Next Story

Most Viewed