అభద్రతా భావం వెంటాడుతుందా.. ? అయితే ఇలా చేసి చూడండి..

by Prasanna |   ( Updated:2023-01-20 12:25:21.0  )
అభద్రతా భావం వెంటాడుతుందా.. ? అయితే ఇలా చేసి చూడండి..
X

దిశ, ఫీచర్స్ : అభద్రతా భావం మనలో ఆందోళనకు కారణం అవుతుంది. అనారోగ్యాన్ని కలిగిస్తుంది. అనేక అవకాశాలను దూరం చేస్తుంది. అందుకే వాటిని దరిచేరనీయవద్దు అంటారు నిపుణులు. నిత్యజీవితంలో ఎదురయ్యే అనేక సంఘటనలు, సందర్భాలు.. బాధను, భావోద్వేగాలను, తీవ్రమైన ఒత్తిడిని కలిగించేవిగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే నిబ్బరంగా ఉండాలి. లేకపోతే వాటి తాలూకు ప్రభావాలు ప్రతికూల ఆలోచనలకు దారితీస్తాయి. ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. అందుకే ఏ విషయంలోనూ 'అతి' పనికి రాదంటున్నారు సైకాలజిస్టులు.

సంతోషకరమైన జీవితానికి ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం ఎంతో ముఖ్యం. అయితే కొన్నిసార్లు ఎంత ఆత్మ విశ్వాసం కలిగిన వ్యక్తులైనా ఆయా పరిస్థితుల ప్రభావంవల్ల అభద్రతా భావానికి లోనవుతూ ఉంటారు. కానీ ప్రతికూల ఆలోచనలు చుట్టుముట్టే అవకాశమిస్తే జీవితంలోని ప్రతీ అంశం ప్రభావితం అవుతుంది. మానసిక, శారీరక అనారోగ్యానికి కారణమవుతుంది. కాబట్టి అలాంటి ఆలోచనలు లేకుండా చూసుకోవాలంటున్నారు నిపుణులు.

పరిస్థితుల ప్రభావం

పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కొన్ని రోజులు మనకు వ్యతిరేకంగా నడుస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మరి కొన్ని రోజులు మనకు అనుకూలంగా ఉన్నట్టు తోస్తుంది. పలు సందర్భాల్లో మనం అనుకున్న విధంగా పనులు జరగకపోవచ్చు. లేదా ఎదురు చూస్తున్న అవకాశాలు రాకపోవచ్చు. అంతమాత్రాన ఎప్పటికీ అదే పరిస్థితి శాశ్వతంగా కొనసాగదు. కానీ అనుకున్నది జరగకపోయే సరికి కొందరు బాధపడుతుంటారు. కృంగిపోతుంటారు. ఇక తమ పరిస్థితి అంతే అనే ఫీలింగ్‌తో నిరాశకు గురవుతుంటారు. ఇటువంటి భావన కొంతసేపు ఉండి పోతే పర్లేదు. కానీ ప్రతీ క్షణం వెంటాడితేనే ప్రమాదం. కాబట్టి ఆ చాయిస్ ఇవ్వొద్దు అంటున్నారు నిపుణులు. ''మీకు ఎటువంటి పరిస్థితిలు ఎదురైనా సరే. ఏది కోల్పోయినా సరే ఆత్మ విశ్వాసాన్ని మాత్రం కోల్పోవద్దు. ఎందుకంటే.. ఏం కోల్పోయినా తిరిగి సంపాదించుకునే బలమైన శక్తి, ఆయుధం.. 'ఆత్మ విశ్వాసం' మాత్రమే. మరి దానినే కోల్పోతే..ఏమున్నా నిలబడలేదు. గొప్ప గొప్ప నిర్ణయాల వెనుక, గొప్ప గొప్ప విజయాల వెనుక అసలైన సూత్రధారి. పాత్రధారి మనలో ఉండే ఆత్మ విశ్వాసమే అని గుర్తుంచుకోవాలి.

అభద్రతను ఎలా ఎదుర్కోవాలి?

మనం సినిమా చూసినప్పుడో, కథలు విన్నప్పుడో అందులో ఒక విలన్ పాత్ర తప్పక ఉండి ఉంటుంది. అలాగే మనిషిలో కూడా అలాంటి విలనిజం ప్రదర్శించే ఆలోచనలు, సందర్భాలు వస్తుంటాయి. వచ్చినప్పుడు ఎదుర్కొని నిలబడితే విజయం వరిస్తుంది. ఆత్మ న్యూనతకో, అభద్రతా భావానికో గురైతే మాత్రం ఓటమి వెంటాడి వేధిస్తుంది. అందుకే మీరు సంతోషంగా, ఆరోగ్యంగా జీవించడానికి అభద్రతను దూరం చేసుకోవాలి. మీరనుకున్నట్టు మీ జీవితాన్ని క్రియేట్ చేసుకోవాలంటే ముందు మీ మనస్సుల్లోంచి అభద్రతా భావాన్ని, నెగెటివ్ ఆలోచనలను తుడిపేయాలి అంటున్నారు నిపుణులు.

అవగాహన కీలకం..

అవగాహన రాహిత్యంవల్ల కూడా మనిషి అభద్రతా భావానికి గురవుతుంటాడు. ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతుంటాడు. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి అవగాహన, విషయ పరిజ్ఞానం చాలా అవసరం. సమాజంపట్ల, జీవితంపట్ల ఎంత ఎక్కువ అవగాహన ఉంటే.. అంత ఆత్మస్థయిర్యం కలుగుతుంది. హేతుబద్ధంగా ఆలోచించగలుగుతారు. ఆపద సమయాల్లో కూడా మీరు ధైర్యంగా ఉండేలా చేయగల సత్తా స్పష్టమైన 'అవగాహన'కు ఉంటుంది. అందుకే మీలో అభద్రతా భావాలు ఎలా ఉత్పన్నమవుతున్నాయో తెలుసుకొని, వాటిని తరిమికొట్టే సబ్జెక్టుపట్ల అవగాహన పెంచుకుంటే చాలు... ఆనందం మీ సొంతమవుతుంది. ఇందుకోసం ముందు మీలోని బలాలు, బలహీనతలను గుర్తించండి. మీ బలహీనతలకు కారణమైన ప్రతికూల ఆలోచనలకు, ప్రతికూల నమ్మకాలకు స్వస్తి పలకాలని సూచిస్తున్నారు మానసిక నిపుణులు. మీ జీవితంలో సాధించిన విజయాలను, సంతోషంగా ఉన్న క్షణాలను గుర్తుచేసుకోండి. అలాగే మిమ్మల్ని నిరాశకు, బాధకు, అభద్రతా భావానికి గురిచేసిన సందర్భాలను పరిశీలించుకోండి. అభద్రతా భావానికి గురిచేసే ఆలోచనలు తలెత్తే పరిస్థితులను నివారించండి. అప్పుడు మీలోని అభద్రతా భావం తొలగిపోతుంది. ఆత్మ విశ్వాసం ఏర్పడుతుంది అనేది నిపుణులు సూచన.

ఇవి కూడా చదవండి : అందమైన అనుభూతికి చిరునామా.. ది గ్రేట్ 'Thanks' !

Advertisement

Next Story

Most Viewed