కిడ్నీలకు ప్రాణాంతకంగా 'హై బ్లడ్ షుగర్' ..Diabetes:

by Hamsa |   ( Updated:2022-11-26 09:42:01.0  )
కిడ్నీలకు ప్రాణాంతకంగా హై బ్లడ్ షుగర్ ..Diabetes:
X

దిశ, ఫీచర్స్: రోజువారి జీవనశైలి, ఆహారపు అలవాట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఊహించని అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్స్ తమ డైట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, లేదంటే హై బ్లడ్ షుగర్ వివిధ అవయవాలను ప్రభావితం చేసి, శారీరక క్రియలు సరిగ్గా నిర్వహించే సామర్థ్యాన్ని కోల్పేయేలా చేస్తుందని హెచ్చరిస్తున్నారు. క్రమంగా మూత్రపిండాల పనితీరుపై ఎఫెక్ట్ చూపడం వల్ల డయాబెటిక్ నెఫ్రోపతి(శరీరం నుంచి వ్యర్థ పదార్థాలు, అదనపు ద్రవాన్ని తొలగించే మూత్రపిండాల సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది)కి దారితీస్తుంది. సంవత్సరాలు గడిచేకొద్దీ ఈ పరిస్థితి మూత్రపిండాల సున్నితమైన వడపోత వ్యవస్థను నెమ్మదిగా దెబ్బతీయడంతో పాటు కిడ్నీ వైఫల్యానికి దారితీస్తుంది. చికిత్స అందించకపోతే చివరకు ప్రాణాంతకంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి.

డయాబెటిక్ నెఫ్రోపతి సంకేతాలు, లక్షణాలు:

* రక్తపోటు నియంత్రణలో హెచ్చుతగ్గులు కాలక్రమేణా తీవ్రతరం

* యూరిన్‌లో ప్రొటీన్ అధిక స్థాయిలు ఏర్పడతాయి

* పాదాలు, చేతులు, కళ్లలో దీర్ఘకాలిక వాపు

* ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయడం

* ఇన్సులిన్, డయాబెటిస్ మెడిసిన్స్ అవసరం తగ్గడం

* గందరగోళం, ఏకాగ్రత కోల్పోవడం

* మైకం కమ్మడం, వికారంగా అనిపించడం

* ఊపిరి ఆడకపోవడం

* ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం

* శరీరమంతా దురదగా ఉండటం

డయాబెటిక్ నెఫ్రోపతి ఎలా సంక్రమిస్తుంది?

జాన్ హాప్కిన్స్ మెడిసిన్ ప్రకారం.. అధిక రక్తపోటు డయాబెటిక్ నెఫ్రోపతికి నేరుగా దోహదపడుతుంది. ఈ వ్యాధి ముదిరే కొద్దీ మూత్రపిండాల్లో శారీరక మార్పులు సంభవించి తరచూ రక్తపోటును పెంచుతాయి. నియంత్రించలేని హైపర్‌టెన్షన్.. డయాబెటిక్ నెఫ్రోపతిలో ఐదో దశ మరింత వేగంగా అభివృద్ధి చెందేలా చేస్తుంది. కాగా డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తుల్లో అనారోగ్యానికి కారణమయ్యే అనేక అంశాలను వైద్యులు సూచిస్తున్నారు.

* అన్ కంట్రోల్డ్ హై బ్లడ్ షుగర్

* అన్ కంట్రోల్డ్ హై బ్లడ్ ప్రెజర్(రక్తపోటు)

* ధూమపానం

* హై కొలెస్ట్రాల్

* ఊబకాయం, అధిక బరువు

నివారించే మార్గాలు?

* బ్లడ్ షుగర్‌ను క్రమం తప్పకుండా చెక్ చేయాలి. రక్తంలో చక్కెర స్థాయిలతో పాటు రక్తపోటు స్థాయిలను కచ్చితంగా తనిఖీ చేయడం ముఖ్యం. వీటిలో దేన్నయినా నియంత్రించలేకపోతే వైద్యుడిని సంప్రదించాలి.

* ఎప్పుడూ సొంత వైద్యం చేసుకోవద్దు. మధుమేహం వంటి తీవ్రమైన పరిస్థితుల్లో ఆస్పిరిన్, నాన్‌స్టెరాయిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ వంటి నాన్‌ప్రిస్క్రిప్షన్ పెయిన్ రిలీవర్స్ ప్యాకేజీలపై సూచనలను ఖచ్చితంగా పాటించాలి.

* ఊబకాయస్తులు బరువు తగ్గడానికి వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అలవాటుగా చేసుకొని శారీరకంగా మరింత చురుగ్గా ఉండేందుకు ప్రయత్నించాలి.

* స్మోకింగ్ సాధారణ ఆరోగ్యంతో పాటు కిడ్నీలు, ఊపిరితిత్తులను కూడా దెబ్బతీస్తుంది. అందువల్ల ధూమపానానికి ఎంత తొందరగా దూరమైతే అంత మంచిది.

Advertisement

Next Story