Health: ఈ తప్పులు చేయడంవల్లే ఆ సమస్యలు..! ఏం జరుగుతుందో మీరే చూడండి!!

by Javid Pasha |
Health: ఈ తప్పులు చేయడంవల్లే ఆ సమస్యలు..! ఏం జరుగుతుందో మీరే చూడండి!!
X

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు ప్రజల్లో ఫిజికల్ యాక్టివిటీస్ అధికంగా ఉండేవి, స్ట్రెస్ యాంగ్జైటీస్‌ వంటివి తక్కువగా కనిపించేవి. కానీ నేటి డిజిటల్ యుగంలో అందుకు భిన్నంగా జరుగుతోంది. చాలా మందిలో శారీరక శ్రమ తగ్గుతోంది. దీంతో ఒత్తిడి, ఆందోళనలు పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా గంటల తరబడి ఒకేచోట కూర్చొని పనిచేసే జీవనశైలితో ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందనే విషయం తెలిసిందే. అయితే తాజా అధ్యయనంలో మరో కొత్త విషయం కూడా వెల్లడైంది. ఏంటంటే.. నిశ్చల జీవనశైలి ముందస్తు వృద్ధాప్యానికి కూడా దారితీస్తుందని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (University of California) రివర్స్‌సైడ్‌కు చెందిన సైంటిస్టులు కనుగొన్నారు.

అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు 28 నుంచి 50 ఏండ్లలోపు వయస్సుగల వారి జీవనశైలిని పరిశీలించారు. వారు డైలీ ఎక్సర్‌సైజ్ చేస్తున్నారా? ఏయే ఫిజికల్ యాక్టివిటీస్‌లో పాల్గొంటున్నారు? ఎంత సేపు కూర్చుంటున్నారు? తదితర వివరాలను సేకరించి ఎనలైజ్ చేశారు. కాగా వీరిలో ఎక్కువమంది 9 నుంచి 16 గంటల పాటు కదలకుండా ఒకేదగ్గర కూర్చొని ఉంటున్నారని, మరికొందరు వారానికి దాదాపు 60 గంటలపాటు నిశ్చల జీవన శైలిని కలిగి ఉంటున్నారని కనుగొన్నారు. అయితే వీరిలో 9 గంటలకు మించి ఒకే దగ్గర కూర్చునే వారిలో నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోవడం, గుండె జబ్బులు వంటి రిస్క్ పెరిగినట్లు పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు.

ఇక 7 నుంచి 8 గంటల వరకు ఒకే దగ్గర కూర్చొని పనిచేస్తున్నవారిని కూడా పరిశోధకులు రెండు గ్రూపులుగా విభజించారు. వీరిలో ఉదయం లేదా సాయంత్రం వ్యాయామాలు చేస్తున్నవారు ఒక గ్రూపు కాగా, ఎలాంటి శారీరక శ్రమలేకుండా నిశ్చల జీవనశైలిని కలిగి ఉంటున్నవారు మరో గ్రూపుగా ఉన్నారు. కాగా ఉదయం లేదా సాయంత్రం వ్యాయామాలు చేస్తున్నవారు గంటల తరబడి ఒకేదగ్గర కూర్చొని పనిచేస్తున్నప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఉండట్లేదని గుర్తించారు. కానీ ఎలాంటి వ్యాయామాలు లేకుండా నిశ్చల జీవనశైలి కలిగి ఉన్నవారు గంటల తరబడి కూర్చొని పనిచేయడంవల్ల పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరి నడుము చుట్టూ అధిక కొవ్వు పేరుకుతోందని, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతోందని పరిశోధకులు గుర్తించారు. దీంతో పాటు ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గడం, అధిక సమయం నిశ్చల జీవనశైలిని ఉండటం కారణంగా చాలామందిలో వృద్ధాప్య ఛాయలు త్వరగా రావడానికి దారితీస్తోందని కూడా పరిశోధకులు కనుగొన్నారు. అందుకే డైలీ కనీసం 30 నుంచి 45 నిమిషాలు వాకింగ్ లేదా ఇతర వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed