స్కాట్లాండ్‌లో లభించిన 170 మిలియన్ ఏళ్లనాటి ఎగిరే డైనో శిలాజం !

by Disha News Desk |
స్కాట్లాండ్‌లో లభించిన 170 మిలియన్ ఏళ్లనాటి ఎగిరే డైనో శిలాజం !
X

దిశ, ఫీచర్స్ : స్కాట్లాండ్‌లోని ఐల్ ఆఫ్ స్కైలో ఎగిరే డైనోసర్ శిలాజాన్ని పరిశోధకులు తాజాగా కనుగొన్నారు. 'టెరోసర్' అని పిలువబడే జురాసిక్ కాలం నాటి ఈ భారీ డైనోసర్ 2.5 మీటర్ల కంటే పొడవైన రెక్కలు కలిగి ఉన్నట్లు తెలిపారు. సుమారు 170 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించినట్లు నిర్ధారించారు యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్ పరిశోధకులు. ఎడిన్‌బర్గ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ రీసెర్చ్.. స్కాట్లాండ్ నేషనల్ మ్యూజియం, గ్లాస్గో హంటేరియన్ మ్యూజియం, స్టాఫిన్ మ్యూజియంతో పాటు సెయింట్ ఆండ్రూస్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సాయంతో నిర్వహించారు.

2017లో ఫీల్డ్ ట్రిప్ సమయంలో రీసెర్చ్ స్టూడెంట్ అమేలియా పెన్నీ ఈ శిలాజాన్ని తొలిసారి గుర్తించింది. టైడల్ ప్లాట్‌ఫామ్‌పై సున్నపురాయి పొరలో ఉన్న డైనో శిలాజాన్ని తీవ్ర ప్రయత్నాల తర్వాత వెలికితీసి, పరిశోధన చేయగా దాన్ని టెరోసర్‌గా గుర్తించారు. పక్షుల కంటే 50 మిలియన్ సంవత్సరాల ముందే ఎగిరే సామర్థ్యాన్ని పొందిన మొదటి సకశేరుకాలు ఇవేనని పరిశోధకులు తెలిపారు. అంతేకాదు ఇవి 66 మిలియన్ సంవత్సరాల క్రితం అంటే డైనోసర్స్ అంతరించిపోయేందుకు ముందు ఫైటర్ జెట్స్ పరిమాణానికి పెరిగాయని పరిశోధన ధృవీకరించింది.

'టెరోసార్స్ సన్నని బోలు ఎముకలను కలిగి ఉన్నాయి. వాటి అవశేషాలు పెళుసుగా, మిలియన్ల సంవత్సరాలుగా సున్నపురాయి పొరల్లో ఉండిపోయాయి. దాదాపు 160 మిలియన్ సంవత్సరాల క్రితం మరణించిన ఈ టెరోసర్ ఇప్పటికీ సహజమైన స్థితిలో ఉంది. దాని పదునైన పళ్ళు ఇప్పటికీ మెరిసే ఎనామిల్ కవర్‌ను కలిగి ఉన్నాయి. ఇది అద్భుతమైన స్కాటిష్ శిలాజం. స్కాట్‌లాండ్‌లో ఇప్పటివరకు కనుగొన్న టెరోసార్స్‌కు మించింది. క్రెటేషియస్ కాలానికి చాలా కాలం ముందు పక్షులతో పోటీ పడిన టెటోసార్స్ మనం అనుకున్న దానికంటే పెద్దవిగా ఉన్నాయ'ని యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed