నక్షత్ర మండలంలో మరో వింత.. డార్క్ మాటర్‌లేని గెలాక్సీని గుర్తించిన పరిశోధకులు

by Prasanna |   ( Updated:2023-09-04 08:04:16.0  )
నక్షత్ర మండలంలో మరో వింత.. డార్క్ మాటర్‌లేని గెలాక్సీని గుర్తించిన పరిశోధకులు
X

దిశ, ఫీచర్స్: ఒక వింతైన గెలాక్సీ రీసెర్చర్స్ టీమ్‌ను ఆశ్చర్య పరుస్తోంది. ఇన్‌స్టిట్యూటో డి ఆస్ట్రోఫిసికా డి కానరియాస్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ లా లగునా సైంటిస్టులు నక్షత్ర మండలంలో గుర్తించిన ఒక కొత్త గెలాక్సీకి NGC 1277 అనే పేరు పెట్టారు. అయితే ఇందులో కృష్ణ పదార్థం లేదని వారు కనుగొన్నారు. ప్రస్తుత విశ్వం యొక్క స్టాండర్డ్ మోడల్ ప్రకారం భారీ గెలాక్సీలు భారీ డార్క్ మ్యాటర్ పరిమాణాలను కలిగి ఉంటాయి. ఇవి సాధారణ పదార్థం మాదిరి సంకర్షణ చెందని పదార్థంగా చెప్పవచ్చు. వాటి ఉనికికి సంబంధించిన ఏకైక ఎవిడెన్స్ ఏంటంటే సమీపంలోని నక్షత్రాలు, వాయువుపై చూపే బలమైన గురుత్వాకర్షణ శక్తి. అయితే రీసెంట్‌గా పాలపుంత కంటే అనేక రెట్లు ద్రవ్యరాశి కలిగిన కొత్త గెలాక్సీలో డార్క్ మాటర్ లేకపోవడం, పైగా సరైన ఆధారాలు లభించకపోవడం ఇదే మొదటిసారి అంటున్నాడు ప్రధాన పరిశోధకుడు సెబాస్టియన్.

కొత్తగా గుర్తించిన కృష్ణ పదార్థం జాడలేని NGC 1277 గెలాక్సీని పరిశోధకులు ప్రోటోటైప్ ‘రెలిక్ గెలాక్సీ’గా పరిగణిస్తున్నారు. పైగా దీనికి దాని నైబర్ గెలాక్సీలతోనూ ఎటువంటి ఇంటరాక్షన్స్ లేవు. ఈ టైప్ గెలాక్సీలు వెరీ రేర్‌గా ఉంటాయని, విశ్వం ఆవిర్భావ ప్రారంభ రోజులలో ఏర్పడిన జెయింట్ గెలాక్సీల అవశేషాలుగా ఇవి పరిగణించబడతాయని సైంటిస్టులు చెప్తున్నారు. మొదట గెలాక్సీలు ఎలా ఏర్పడ్డాయో అర్థం చేసుకోవడంలో రెలిక్ గెలాక్సీల ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి పరిశోధకులు సమగ్ర ఫీల్డ్ స్పెక్ట్రోగ్రాఫ్‌తో NGC 1277ని పరిశీలించారు. అందులో స్పెక్ట్రా నుంచి కైనమాటిక్ మ్యాప్‌లను తయారు చేసి, 20,000 కాంతి సంవత్సరాల వ్యాసార్థం వరకు ద్రవ్యరాశి పంపిణీని అబ్జర్వ్ చేశారు. అయితే ఇందులో ద్రవ్యరాశి పంపిణీ లేదని, కేవలం నక్షత్రాల పంపిణీ మాత్రమే ఉందని సైంటిస్టుల బృందం కనుగొంది. అందుకు రెండు కారణాలు ఉండవచ్చు. ఒకటి ఈ గెలాక్సీ క్లస్టర్‌లోని చుట్టుపక్కల మాధ్యమంతో గురుత్వాకర్షణ పరస్పర చర్య కృష్ణ పదార్థాన్ని తొలగించి ఉంటుంది. రెండవది ప్రోటోగాలాక్టిక్ శకలాలు విలీనం చేయడం ద్వారా గెలాక్సీ ఏర్పడినప్పుడు కృష్ణ పదార్థం ఆ వ్యవస్థ నుంచి తొలగి పోయి ఉంటుంది. అందుకే అవశేష గెలాక్సీగా మారిందని పరిశోధకులు అంటున్నారు. ఈ మిస్టరీని ఛేదించేందుకు పరిశోధనలు కొనసాగించడానికి లా పాల్మాలోని కానరీ ద్వీపంలోని రోక్ డి లాస్ ముచాచోస్ అబ్జర్వేటరీలో విలియం హెర్షెల్ టెలిస్కోప్ (WHT)పై WEAVE పరికరంతో కొత్త పరిశీలనలు చేయాలని పరిశోధకులు భావిస్తున్నారు.

Read More: సూసైడ్ థాట్స్‌ను ముందే గుర్తిస్తున్న ఏఐ.. ఎలాగో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed