Mars : అంగారకుడిపై జలధార..! మిస్టరీ వీడిందా?

by Javid Pasha |   ( Updated:2025-03-11 14:31:30.0  )
Mars : అంగారకుడిపై జలధార..! మిస్టరీ వీడిందా?
X

దిశ, ఫీచర్స్

అదో అద్భుతం.. అదో అనంతం..

అదో వింత.. అదో ఆశ్చర్యం..

అదో రహస్యం.. అదో వైజ్ఞానికం..

అంతు చిక్కిన అనేక విషయాలున్నా..

అంతు చిక్కనివి మరెన్నో.. అంటారు శాస్త్ర వేత్తలు.

అందుకే ఈ విశ్వం గురించి ఎంత తెలిసినా..

తెలియాల్సింది ఇంకెంతో మిగిలే ఉంటుంది.

దాదాపు అంగారక గ్రహం అలాంటి క్యూరియాసిటీనే రేకెత్తిస్తోంది.

సాయంకాలపు సందెవేళ.. పడమటి దిక్కున అస్తమించే సూర్యున్ని గమనించారా? ఎర్రగా చూడముచ్చటగా ఎంత ముద్దుగా ఉంటాడు కదూ! మన విశ్వంలోని అంగారక గ్రహం(Mars) కూడా దాదాపు అదే కలర్‌లో ఉంటుంది. ఇప్పుడు దాని గురించి మనకెందుకు అనుకోకండి. ఇటీవల యుగాంతం వస్తుందని, గ్రహ శకంల భూమిని ఢీ కొడుతుందనే వార్తల నేపథ్యంలో సోషల్ మీడియాలో అంగారక గ్రహంపై మనుగడ విషయమై డిస్కస్ నడుస్తోంది. కాగా నిరంతర పరిశోధనల్లో నిమగ్నమయ్యే స్పేస్ సైంటిస్టులు దీనిపై ఇప్పటికే ఎన్నో పరిశోధనలు జరిపారు. అక్కడ ఒకప్పుడు నీటి ప్రవాహం ఉండేదని, కొన్ని జీవుల పుట్టుక, పెరుగుదలకు కారణమై ఉండవచ్చునని 1970లోనే నాసాకు చెందిన మెరైనర్ -9 వ్యోమనౌక తీసిన ఛాయాత్రాల ద్వారా తెలిసింది. దీనిని బట్టే అక్కడ జలధార ఉండేదని వెల్లడైంది. ఇక అప్పటి నుంచే అనేక దేశాలు మార్స్‌పై జీవజాలం మనుగడకు సంబంధించిన రహస్యాలను ఛేదించే పనిలో పడ్డాయి. అక్కడ 450 కోట్ల సంవత్సరాల కిందట నీరు ఉండేదని కూడా పలు ఆధారాలు లభించాయంటున్నారు శాస్త్రవేత్తలు. కొన్ని సంవత్సరాల క్రితం అంతరిక్ష శిలలు ఢీకొన్నాయి. ఫలితంగా అక్కడ బిలాలు ఏర్పడ్డాయి. వీటికిందే మంచు ఫలకాలు ఉన్నట్లు నాసా, చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ పేర్కొంటున్నాయి.

మార్స్‌పై జలం అసలు ఎప్పుడు ఉండేది. ఏ పరిమాణంలో ఉండేది? అందులో జీవజాలం ఏమైనా పుట్టిందా? మనుగడ సాగించిందా? ఈ విషయాలపై శాస్త్రవేత్తలకు అవగాహన, అంచనాలు ఉన్నప్పటికీ కచ్చితంగా చెప్పే పరిస్థితి ఒకప్పుడు ఉండేది కాదు. కానీ 2024 నుంచి దీనికి సమాధానం దొరికింది అంటున్నారు నిపుణులు. చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ (css) అంగారకుడిపైకి పంపిన జురాంగ్ అనే పేరు గల రోవర్ (A rover named zhurong) అక్కడి నుంచి పంపించిన ఛాయాచిత్రాలు, పరిశోధనల సమాచారమే ఇందుకు నిదర్శనం అంటున్నారు. జురాంగ్ ప్రకారం.. అక్కడ ఒకప్పుడు మహా సముద్రం ఉండేది. 450 కోట్ల సంవత్సరాల క్రితం కొన్ని రకాల జీవులు కూడా ఉండేవని, దానివల్ల తీర ప్రాంత అవక్షేపాలు, బీచ్ కూడా ఏర్పడింది. కానీ తర్వాత అవి కనుమరుగైపోయాయి. దాంతోపాటు ఆక్సిజన్ ఆనవాళ్లు కూడా చెదిరిపోయాయి. ప్రస్తుతం అక్కడి వాయువులో హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్, హీలియం వంటి జీవజాల మనుగడకు ఉపయోగం లేని వాయువులే ఎక్కువగా ఉన్నాయి. పైగా గురుత్వాకర్షణ శక్తి కూడా లేదు. దీంతో అంగారకుడిపై జీవజాల మనుగడ సాధ్యం కాదంటున్నారు శాస్త్రవేత్తలు. భవిష్యత్ పరిణామాల్లో ఏదైనా పెను మార్పు జరిగితే.. 450 కోట్ల సంవత్సరాల నాటి వాతావరణ పరిస్థితులు అక్కడ పునరావృతమైతే.. జీవజాలం మనుగడకు చాన్స్ ఉంటుంది. కానీ అలా జరుగుతుందా? దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరం అంటున్నారు అంతరిక్ష పరిశోధకులు.

Next Story

Most Viewed