Mental health : సెలబ్రిటీలపై అభిమానం ఎక్కువైతే!!

by Javid Pasha |   ( Updated:2024-12-14 13:40:33.0  )
Mental health : సెలబ్రిటీలపై అభిమానం ఎక్కువైతే!!
X

దిశ, ఫీచర్స్ : ఫలానా హీరో లేదా హీరోయిన్ అంటే మీకిష్టమా..? అభిమాన నటీ నటుల సినిమాలు చూడకుండా, వారిని సోషల్ మీడియాలో ఫాలో అవకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నారా? వారి సినిమాలు రిలీజ్ అవ్వగానే ప్రాణాలకు తెగించి మరీ చూసే ప్రయత్నం చేస్తున్నారా? బాగో లేకున్నా బాగుందని మెచ్చుకుంటున్నారా? అభిమాన నటులను గుర్తు చేసుకోకుండా ఉండలేకపోతున్నారా? వారికోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే రకమా? అయితే మీరు ‘సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్’ అనే మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లే.. అంటున్నారు నిపుణులు. అభిమానం, ఆరాధనా భావం ఉండటంలో తప్పులేదు. కానీ మోతాదు మించితేనే పిచ్చిలా మారిపోతుంది చెబుతున్నారు. దాని లక్షణాలు, ప్రభావాలు, పర్యవసనాలు ఏమిటో చూద్దాం.

మానసిక బలనహీతకు దారి..

ఒక వ్యక్తిని లేదా సెలబ్రిటీని అతిగా ఆరాధించే ప్రవర్తనకు దారితీసే ‘సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్’ మీ వ్యక్తిగత, సామాజిక జీవితంపై ప్రభావం చూపుతుంది. మిమ్మల్ని మానసిక బలహీనులుగా మారుస్తుంది. భ్రమలకు లోను చేస్తుంది. ఈ పరిస్థితిలో ఉన్న వ్యక్తులు తాము అభినమానించే సెలబ్రిటీలాగే రెడీ అవడం, అలాంటి దుస్తులే ధరించడం, వారిలా మాట్లాడటం, ప్రవర్తించడం వంటివి అనుకరిస్తుంటారు. అంతేకాకుండా అభిమాన సెలబ్రిటీల కొటేషన్లను ఇతరులకు పంపడం, ఫ్రెండ్స్‌కు చదివి వినిపించడం వంటివి కూడా చేస్తుంటారు. ఒక విధంగా చెప్పాలంటే తాము ఫాలో అయ్యే సెలబ్రిటీ చేసేది, చెప్పేది వాస్తవాలతో సరిపోల్చకుండా అన్నీ కరెక్టేనని నమ్మేస్తుంటారు. తమ హీరో లేదా హీరోయిన్ తప్పు చేసినా సమర్థించడం, వారికేమైనా జరిగితే బాధ పడటం, కొన్నిసందర్బాల్లో సూసైడ్ అటెంప్ట్ చేయడం వంటివి ‘సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్’ రుగ్మతలో భాగమే అంటున్నారు మానసిక నిపుణులు.

మొదట ఎప్పుడు గుర్తించారు?

సెలబ్రిటీ వర్షిప్ (Celebrity Worship) అనే పదాన్ని మొదటిసారిగా 2000 సంవత్సరంలో డాక్టర్ లిన్ మెక్‌ కట్చియోన్(Lynn McCutcheon) తన సహచరులతో కలిసి రూపొందించారు. ఆరాధనా భావం, అతి అభిమానం మనుషులను ఎలా ప్రభావితం చేస్తుందో వీరు పరిశోధించారు. అయితే ఇవి రాజకీయ నాయకులు, ప్రముఖులు, సెలబ్రిటీలపట్ల కలిగి ఉండే భావనగా ఉంటోన్నప్పటికీ ఎక్కువగా సినీ తారలతో ముడిపడి ఉందని గుర్తించారు. తమ అభిమాన తారల వ్యక్తిగత జీవితాలపట్ల ఆసక్తి కలిగి ఉండటం, టీవీలు, ఫోన్లు, మీడియా, వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా అనుసరించడం, ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశాల కోసం ఎదురు చూడటం వంటివి ఈ రుగ్మతతో బాధపడే వ్యక్తుల్లో తీవ్రస్థాయి భావాలుగా ఉంటాయి.

లక్షణాలు

సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ (CWS) ఒక వ్యక్తి మానసిక, భావోద్వేగ శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. ఇది వారి రోజువారీ జీవితం, సంబంధాలు, మొత్తం ఆరోగ్యంపై ఇంపాక్ట్ చూపుతుంది. అబ్సెసివ్ బిహేవియర్ కారణంగా తమ అభిమాన సెలబ్రిటీ గురించి అతిగా ఆలోచించడం, నిరంతరం వారి గురించిన సమాచారం, వ్యక్తిగత విషయాలు, సామాజిక జీవితం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సోషల్ మీడియాలో వెతుకుతారు. అలాగే వీరు ఎమోషనల్ డిస్ట్రెస్.. అంటే సెలబ్రిటీలపై అనారోగ్యకరమైన స్థిరీకరణ భావాలతో(Due to unhealthy fixation) ఆందోళన, నిరాశ, తక్కువ ఆత్మగౌరవం(Low self-esteem) వంటివి కలిగి ఉంటారు. సెలబ్రిటీపై ఎక్కువగా ఫోకస్ చేయడం కారణంగా సామాజిక పరస్పర చర్యలు, సంబంధాలపై నిర్లక్ష్యం చేస్తుంటారు. అలాగే తాను అనుసరించే సెలబ్రిటీ అన్నింటిలో పర్‌ఫెక్ట్ అని నమ్మడం వారి లైఫ్ స్టైల్‌ను, బిహేవియర్‌ను అనుసరించడం చేస్తుంటారు.

ఆరోగ్యంపై ప్రభావం

అతి ఆరాధనా భావం నిరాశ, నిస్పృహ, ఆందోళ, అబ్సెసివ్ - కంపల్సివ్ డిజార్డర్ వంటి మానసిక ఆరోగ్య పరిస్థితులకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అతి ఆలోచనలవల్ల అలసట, నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి. ప్రొడక్టివిటీ, ఏకాగ్రత తగ్గడం వంటివి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఈటింగ్ డిజార్డర్స్, స్వీయ హాని (Self-harm) వంటి అన్‌హెల్తీ బిహేవియర్లకు దారితీయవచ్చు.

సొల్యూషన్ అండ్ ట్రీట్మెంట్

సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ వాస్తవంలో కాకుండా భ్రమల్లో జీవించేలా చేస్తుంది. కాబట్టి దాని నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. అందుకోసం సామాజిక పరస్పర చర్యలు, సామాజిక స్పృహ కలిగి ఉండటం ముఖ్యం. పుస్తకాలు, దినపత్రికలు చదవడం, నిపుణుల సలహాలు పాటించడం వంటివి రుగ్మతల నుంచి బయడపడేస్తాయి. అలాగే స్వీయ అవగాహనతో కూడా బయటపడవచ్చు. అతి ఆరాధనా భావాన్ని అధిగమించడం మీవల్ల కాదనుకుంటే.. సైక్రియాటిస్టులను సంప్రదించాలి. వారు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ద్వారా మీ అంతర్లీన సమస్యలను, అనారోగ్య కరమైన ఆలోచనా విధానాలను మార్చే చికిత్స అందిస్తారు. హెల్తీ లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీస్, స్వీయ సంరక్షణ, విచక్షణా జ్ఞానం వంటివి సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్‌ను దూరం చేస్తాయి.

Advertisement

Next Story

Most Viewed