ప్రెగ్నెన్సీ టైమ్‌లో మార్నింగ్ సిక్‌నెస్ వేధిస్తోందా?.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

by Prasanna |   ( Updated:2023-04-25 10:53:03.0  )
ప్రెగ్నెన్సీ టైమ్‌లో మార్నింగ్ సిక్‌నెస్ వేధిస్తోందా?.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
X

దిశ, ఫీచర్స్: గర్భధారణ తర్వాత మొదటి మూడు నెలలు మార్నింగ్ సిక్‌నెస్ చాలామందిని వేధిస్తుంది. అయితే ఇది చాలా సాధారణంగా తలెత్తే సమస్య అని వైద్య నిపుణులు చెప్తున్నారు. పగటివేళ ఎప్పుడైనా ఇది తలెత్తవచ్చు. కొన్నిసార్లు తీవ్రంగా ఉంటుంది. ఈ పరిస్థితినే హైపెరెమెసిస్ గ్రావిడరమ్‌గా (hyperemesis gravidarum) మారుతుందని గైనకాలజిస్టులు చెప్తున్నారు. ఫలితంగా వికారం, వాంతులు, సీరియస్ ఫ్లూయిడ్ లాస్ జరుగుతాయి. గర్భధారణకు ముందు శరీర బరువులో 5% కంటే ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వడంవల్ల కూడా ఇలా జరుగుతుంది.

హెచ్‌సీజీ పెరుగుదలే కారణం

‘‘చాలా మంది తల్లులు మార్నింగ్ సిక్‌నెస్ ఫీలింగ్‌ను అనుభవిస్తారు. ఇది ప్రెగ్నెన్సీ హార్మోన్ హ్యూమన్ కోరియోనిక్ గోనాడోట్రోపిన్ (Human chorionic gonadotropin) లేదా హెచ్‌సిజి పెరుగుదల కారణంగా వస్తుంది. దీనినే ‘మార్నింగ్ సిక్‌నెస్’ అని పిలిచినప్పటికీ, స్త్రీలు రోజులో ఎప్పుడైనా వికారం, వాంతులు వంటి లక్షణాలను ఎదుర్కొంటారు. మార్నింగ్ సిక్‌నెస్‌ అధికమవడంలో థైరాయిడ్ హార్మోన్ల పాత్ర కూడా ఉంటుంది. అయితే మూడవ నెల తర్వాత ఈ పరిస్థితి సాధారణంగా తగ్గిపోతుంది’’ అంటున్నారు గైనకాలజిస్టు నిరుపమ. అమెరికన్ ఫ్యామిలీ ఫిజిషియన్‌లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం.. దాదాపు 75 శాతం మంది గర్భిణులను మార్నింగ్ సిక్ నెస్ వేధిస్తుంది. శరీరంలో హార్మోన్ స్థాయిలు పెరగడంవల్ల వాంతులు, వికారం వంటివి ఉంటాయి. నిజానికి ఇవి ఆరోగ్యకరమైన గర్భానికి సంకేతం అని కూడా నిపుణులు పేర్కొంటున్నారు. ఇటువంటి పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పుడు వాటిని నివారించే చర్యలు కూడా ఉన్నాయి.

సిక్‌నెస్ తగ్గడానికి ఇలా చేయండి

* రస్క్ లేదా బ్లాండ్ బిస్కెట్లు ఉదయం లేవగానే 5 నిమిషాలు బెడ్‌పై కూర్చొని తినాలి. మరో 5 నిమిషాలు వేచి ఉండి, ఆపై లేచి బ్రష్ చేయాలి. ఖాళీ కడుపుతో లేదా ఉదయాన్నే టీ లేదా కాఫీ తాగడం మానుకోండి. ఎందుకంటే ఇది గుండెల్లో మంట, మార్నింగ్ సిక్ నెస్‌కు దారితీసే యాసిడ్ ప్రొడ్యూస్‌ను ప్రేరేపిస్తుంది. అయితే బ్రేక్ ఫాస్ట్ తర్వాత టీ, కాఫీలు తీసుకోవవచ్చు. అల్లం టీ తాగడం బెటర్. పూర్తి భోజనం తినడం ప్రెగ్నెన్సీ టైమ్‌లో సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు 3 నుంచి 4 గంటల విరామం ఇస్తూ తరచుగా భోజనం చేయండి.

* ఆహారంలో మసాలా దినుసులను తగ్గించండి. ఎందుకంటే అవి ఎసిడిటీని కలిగిస్తాయి. వికారాన్ని మరింత పెరిగేలా చేస్తాయి. అలాగే వేయించిన ఆహారం స్టమక్ సెల్స్‌లో యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. గర్భం దాల్చిన మొదటి మూడు నెలలు చప్పగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినాలి.

* రోజూ తిన్న తర్వాత కాకుండా అంతకుముందు మధ్య మధ్యలో ద్రవపదార్థాలు అంటే.. జ్యూస్, సూప్స్ వంటివి తీసుకోవాలి. సూప్స్‌లలో చిటికెడు ఉప్పు, చక్కెర నిమ్మకాయను కలుపుకుంటే ఎలక్ట్రోలైట్‌లను సమతుల్యంగా ఉంచుతుంది. తిమ్మిరి, మూర్ఛ వంటి సమస్యను నివారిస్తుంది.

* భోజనం తర్వాత వెంటనే పడుకోవద్దు. 10 నిమిషాలు తేలికపాటి నడకను కొనసాగించాలి. ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఇది సహాయపడుతుంది. ప్రతిరోజూ పడుకునే ముందు పళ్ళు తోముకోవడం ద్వారా దంత క్షయాన్ని నివారించవచ్చు. ఇక మార్నింగ్ సిక్‌నెస్ ఇంటి చిట్కాలతో తగ్గకపోతే మరింత తీవ్రమైతే డాక్టర్‌ను సంప్రదించాలి.

Also Read..

స్త్రీలు మంగళవారం ఆంజనేయ స్వామిని ఇలా పూజిస్తే ఎంతో మంచిదంట?

Advertisement

Next Story