మనిషిలోని ఆ గుణమే పెంపుడు జంతువుల మనుగడకు కారణం.. ఓ అధ్యయనంలో వెల్లడి

by Hajipasha |   ( Updated:2023-01-17 11:16:28.0  )
మనిషిలోని ఆ గుణమే పెంపుడు జంతువుల మనుగడకు కారణం.. ఓ అధ్యయనంలో వెల్లడి
X

దిశ, ఫీచర్స్: మనిషిలోని సహజ సిద్ధమైన వివిధ గుణాల్లో, లక్షణాల్లో ఎంతో గొప్పది పరోపకారం. మానవత్వం ఎంతో గొప్పవి వీటివల్లే సమాజ మనుగడ, అభివృద్ధి మరింత మెరుగైన దిశగా సాగుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. జీవ వైవిధ్య పరిరక్షణలోనూ మనుషిలోని ఈ గుణాలే ఎంతో దోహదం చేస్తున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం పెంపుడు జంతువుల పట్ల మనుషులు, పసి పిల్లలు చూపించే ప్రేమ, కరుణ, మానవత్వం, పరోపకారం అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. సైంటిస్టులు చిన్నారులు-పెంపుడు కుక్కల మధ్య గమనించిన పరస్పర హెల్పింగ్ నేచర్‌ను స్టడీ చేసి ఈ విషయాన్ని తేల్చారు.

చిన్నారుల్లో ఎందుకంత ఆసక్తి

ముఖ్యంగా చిన్నపిల్లలు తమ ఇండ్లల్లోని కుక్క పిల్లల పట్ల ఎంతో ఆసక్తి చూపుతుంటారు. మాటలు రాని బాల్య దశలో కూడా చిన్నారులు పెంపుడు కుక్కలను చూసి మురిపోతుంటారు. బుడి బుడి అడుగులేస్తూ వెళ్లి వాటితో ఆడుకోవడానికి ఇష్టపడుతుంటారు. పెంపుడు కుక్కలు కూడా చిన్న పిల్లలతో సరదాగా ఉంటూ వారికి సంరక్షణగా నిలవడమే కాకుండా.. అవసరమైన సహాయం చేస్తుంటాయి. ఉదాహరణకు ఆటబొమ్మలు, దిండు దగ్గరకు తెచ్చివ్వడం, పిల్లల జోలికి గుర్తు తెలియని వ్యక్తులు వస్తే ఎగబడటం వంటివి మనం ఏదో ఒక సందర్భంలో చూసే ఉంటాం. ఎందుకిలా? కుక్కలు అంత విశ్వాసాన్ని ఎలా ప్రదర్శించగలుగుతాయి అంటే.. మనిషిలోని మానవత్వం, మంచి గుణం, పరోపకారం వంటివి అందుకు దోహదపడుతున్నాని అధ్యయనకర్తల పరిశీలనతో తేలింది. అనేక జంతు జాతులు, జీవ వైవిధ్య మనుగడకు ఇటువంటి అలవాట్లే కారణమని సైంటిస్టులు పేర్కొంటున్నారు.

పిల్లల భాషను అర్థం చేసుకుంటున్న పెంపుడు కుక్కలు

మాటలు రాని పసిపిల్లలు, ఇండ్లల్లోని పెంపుడు కుక్కలు ఆడుకోవడం మీరెప్పుడైనా గమనించారా? అదేంటో గాని పిల్లల మూగ భాషను కుక్కలు, కుక్కల ప్రవర్తనను పిల్లలు వెంటనే అర్థం చేసుకుంటుండటం మనం పరిశీలించవచ్చు. చిన్నారులు కుక్కలతో ఆడుకోవడానికి అమితంగా ఆసక్తి చూపుతుంటారు. పెంపుడు కుక్కలు కూడా పిల్లల ఆసక్తిని వెంటనే పసిగట్టేస్తాయి. బాల్యదశలో ఇంకా మాటలు రాని వయస్సులో, బుడి బుడి అడుగులు వేసే పసిపిల్లలు తాము ఆడుకునే ఆటబొమ్మలను, వస్తువులను తీసుకురావాలని సైగ చేస్తేనో, అటువైపు తల మరల్చి శబ్దం చేస్తేనో పెంపుడు కుక్కలు వెంటనే వెళ్లి తన నోటితో చూపెట్టిన బొమ్మనుగాని, వస్తువును తీసుకొచ్చి పిల్లలకు అందిస్తుంటాయి. ఇది చూడటానికి సరదాగా అనిపించినా.. దీని వెనుకగల కోణాన్ని అధ్యయనం చేశారు శాస్త్రవేత్తలు. దీని ఆధారంగానే ఆదిమ కాలం నుంచి ఆధునిక కాలం వరకు మనిషిలోని మానవత్వం, జంతువుల్లోని విశ్వాసం వివిధ జంతుజాతుల మనుగడ, అభివృద్ధి, పరస్పర అవగాహనకు దోహదం చేసిందని చెప్తున్నారు. మనుషులు మొదటి నుంచీ తమ చుట్టూ ఉండే ఇతర ప్రాణులను ఆదరించడం, అనువైన వాటికి సహకరించడం, వాటిని మచ్చిక చేసుకోవడం, ఇండ్లల్లో, వివిధ చోట్ల నివాసాల్లో పెంచుకోవడం వంటి అలవాట్లను అనాది కాలం నుంచే కలిగి ఉంటున్నారు. మనుషులు, జంతువులు, ఆయా జీవ జాతులు ఏదో ఒక రూపంలో పరస్పరం సహకరించుకోవడం, పరోపకారం కలిగి ఉండటం, అర్థం చేసుకోవడం వంటి గుణాన్ని కలిగి ఉంటున్నట్లు అధ్యయన కర్తలు చెప్తున్నారు. అందుకు పసిపిల్లలు పెంపుడు కుక్కల మధ్య జరిగే పరస్పర సంభాషణ, ఆటతీరు, ఆసక్తి, సంజ్ఞలను ఉదాహరణగా పేర్కొంటున్నారు.

అధ్యయనంలో తేల్చిందేమిటి?

''కేవలం రెండేండ్ల వయస్సుగల పిల్లలు కుక్కలను అంతకు ముందెన్నడూ చూసి ఉండకపోయినా మొదటిసారి వాటిని చూడగానే వారి ముఖాల్లో నవ్వులు విరబూస్తాయి. సంతోషంతో కేరింతలు కొడతారు. కుక్కలు కూడా పిల్లల మనస్తత్వాన్ని, ఆసక్తిని వెంటనే పసిగడతాయి. వారితో సరదాగా ఆడుకునేందుకు ఆసక్తి చూపుతాయని శాస్ర్తవేత్తలు గమనించారు. వివిధ జాతుల మనుగడకు మనిషిలోని ఆసక్తి, మానవత్వం, పరోపకార గుణం ఎలా పనిచేశాయనే అంశంపై అధ్యయనం చేసిన ఒక సైంటిస్ట్, రచయిత్రి సంబంధిత వివరాలను డ్యూక్ అండ్ హార్వర్డ్ యూనివర్సిటీ వెబ్ సైట్లలో పోస్టు చేశారు. అనేక ఆసక్తికరమైన అంశాలను ఇందులో వెల్లడించారు. ప్రకృతి పట్ల, ఇతర జీవ జాతుల పట్ల ఫ్రెండ్లీ నేచర్, పరోపకారం, మానవత్వం కలిగి ఉన్న కారణంగానే ఆయా జీవ జాతులతోపాటు మనుషులు అభివృద్ధి చెందగలిగారని ఆమె వివరించారు. మనుషులు అనాది కాలం నుంచి ఆధునిక కాలం వరకు తనకు అవసరమైన జంతువులను ఎందుకు పెంచుకుంటున్నారు అనేది చాలా మందికి తెలియని రహస్యంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ మనిషిలోని మానత్వ లక్షణం, ప్రేమ, పరోపకారం జీవన విధానంలోని అవసరం వంటివి సమాజ పరిణామ క్రమంలో జంతువుల పెంపకానికి దారి తీశాయని, జీవన మనుగడకు, జీవ వైవిధ్యానికి కూడా ఇదే దోహదపడిందని సైంటిస్టులు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి : దోమలకు కళ్లు ఉండవని మీకు తెలుసా...? మరి అవి మనల్ని ఎలా కుడుతాయి??

Advertisement

Next Story

Most Viewed