Killing Rivals : మెరుపు మెరిస్తే.. ఆ చెట్టుకు సంబురమే..! ఎందుకంటే..?

by Javid Pasha |
Killing Rivals : మెరుపు మెరిస్తే.. ఆ చెట్టుకు సంబురమే..! ఎందుకంటే..?
X

దిశ, ఫీచర్స్ : వర్షం పడుతున్నప్పుడు ఉరుములు, మెరుపులను చెట్లు కొంత వరకు ఆకర్షిస్తాయన్న విషయం తెలిసిందే. ఇది సాధారణ విషయమే. కానీ పనామా‌లోని రెయిన్ ఫారెస్ట్‌లో గల ఒక రకమైన చెట్లు మాత్రం మరింత ఎక్కువగా వాటిని ఆర్షిస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అవే టాంకా బీన్ ( Dipteryx oleifera) చెట్లు. ఇవి మెరుపుల(Lightning)ను అనుకూలంగా మల్చుకోవడం ద్వారా, తమకు ఆటంకంగా ఉండే ఇతర చెట్లను నాశనం చేస్తాయని కనుగొన్నారు. అందుకే మెరుపు మెరిస్తే ఆ చెట్లకు సంబురమే అంటున్నారు నిపుణులు. వాటి ప్రత్యేకతలేమిటో ఇప్పుడు చూద్దాం.

సాధారణ అధ్యయనాల్లో భాగంగా కారీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకో సిస్టమ్ స్టడీస్ కు చెందిన ఫారెస్ట్ ఎకాలజిస్ట్ ఎవాన్ గోరా నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం పనామా వర్షారణ్యాలలో పరిశోధనలు నిర్వహిస్తున్నది. కాగా ఆ సమయంలో ఈ బృందంలోని సభ్యులు ఓ అద్భుతాన్ని గుర్తించారు. ఏంటంటే..టాంకా బీన్ (tonka bean tree) లేదా అల్మెండ్రో అని పిలువబడే చెట్లు తమ మనుగడ కోసం వర్షం పడుతున్నప్పుడు మెరుపులను, పిడుగులను ఆకర్షించి ప్రయోజనం పొందుతున్నాయి. 130 అడుగుల ఎత్తు వరకు పెరిగే ఈ చెట్లు సహజమైన మెరుపు రాడ్‌గా(natural lightning rod) పనిచేస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. సాధారణ వృక్షాలకంటే ఇవి 68% ఎక్కువ సార్లు పిడుగులను ఆకర్షిస్తాయి. కాగా ఈ సందర్భంలో అవి భారీ ప్రయోజనం కూడా పొందుతాయి.

టాంకా బీన్ చెట్లు (tonka bean tree) మెరుపు మెరిసినప్పుడు దాని విద్యుత్ శక్తిని అత్యంత వేగంగా, తీవ్రతతో ఆకర్షించి, ఆ విద్యుత్ ప్రవాహాన్ని తమ చుట్టూ తమ ఎదుగుదలకు ఆటంకంగా ఉన్న ఇతర చెట్లపైకి వ్యాపింపజేస్తాయి. దీంతో సగటున ఒక్కో మెరుపు మెరిసినప్పుడు అవి తమ చుట్టూ పోటీగా ఉండే 9 ఇతర చెట్లను నాశనం చేస్తాయంటున్నారు శాస్త్రవేత్తలు. దీని ద్వారా అవి సూర్యకాంతిని, ఇతర పోషకాలను సమర్థవంతంగా పొందుతాయి. మరో విషయం ఏంటంటే.. మెరుపు మెరిసినప్పుడు (When lightning flashes) ఈ చెట్లు 14 రెట్లు ఎక్కువ విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ పరిస్థితి టాంకా బీన్ చెట్ల పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. వర్షారణ్యాలలో మనుగడకోసం తమను తాము రక్షించుకోవడమే కాకుండా ప్రకృతిలో ఒక అద్భుతమైన జీవన పోరాటాన్ని టాంకా బీన్ చెట్లు అనుసరించడం ఒక అద్భుతంగా పరిశోధకులు అంటున్నారు. కాకపోతే ఈ చెట్లు తమ చుట్టు పక్కల ఉన్న జీవ వైవిధ్య సమతుల్యతను కూడా కాస్త దెబ్బతీస్తాయి. రెయిన్ ఫారెస్ట్ డైనమిక్స్‌పై మరింత అధ్యయనానికి ఈ పరిశోధన ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.



Next Story

Most Viewed