కోళ్లకు కొత్త వైరస్.. చికెన్ ముక్క ముట్టాలంటేనే వణికిపోతున్న జనం!

by D.Reddy |   ( Updated:2025-02-06 07:37:48.0  )
కోళ్లకు కొత్త వైరస్.. చికెన్ ముక్క ముట్టాలంటేనే వణికిపోతున్న జనం!
X

దిశ, వెబ్ డెస్క్: మాంసాహారుల్లో ఎక్కువ మంది చికెన్ తినటాన్ని ఇష్టపడుతుంటారు. ఆదివారం వచ్చిందంటే చాలు.. కోడి కూర ఉండాల్సిందే. అయితే, ఈ వార్త చికెన్ లవర్స్‌కి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. అదేంటి ధరలు తగ్గితే శుభవార్తే కదా అనుకుంటున్నారా? ధరలు తగ్గాయి. కానీ, అందుకు కారణం.. పౌల్ట్రీ పరిశ్రమను అంతుచిక్కని వైరస్ వణికిస్తోంది. దీంతో ఎంతో ఆరోగ్యంగా ఉన్న కోళ్లు కూడా ఉన్నట్టుండి చనిపోతున్నాయి. దీంతో పౌల్ట్రీ రైతులు తీవ్ర కలవరానికి గురవుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉభయగోదావరి, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో పౌల్ట్రీ ఫారాల వద్ద చనిపోయిన కోళ్లు గుట్టలు గుట్టలుగా ఉంటున్నాయి. ఒక్కో ఫారంలో రోజుకు దాదాపు 10 వేల కోళ్లు చనిపోతుండటం తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. సాధారణంగా పౌల్ట్రీ ఫారాల్లో రోజుకు 0.05 శాతం కోళ్లు అనారోగ్య కారణాల వల్ల చనిపోతుంటాయి. కానీ ఇంత భారీ స్థాయిలో కోళ్ల చనిపోవటానికి కారణమేంటన్నది స్పష్టంగా తెలియకపోవటంతో రైతులు మరింత గందరగోళానికి గురవుతున్నారు. ఒక్క ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనే గడచిన 15 రోజుల్లో 40 లక్షల కోళ్లు మృతి చెందాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వెంటనే వైరస్‌ను గుర్తించి, నిరోధక చర్యలు చేపట్టాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

సాధారణంగా డిసెంబర్, జనవరి నెలల్లో చలిగాలుల ప్రభావంతో కోళ్లకు ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఇప్పటి వైరస్ లక్షణాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. ఉదయం ఒక్క కోడికి వైరస్ సోకిందంటే.. సాయంత్రానికి ఆ షెడ్డు మొత్తంలో ఉన్న కోళ్లకు ఆ వైరస్ వ్యాపించి మృత్యువాత పడుతున్నాయి. దీంతో ఈ పరిస్థితి మరింత వేగంగా వ్యాపించొచ్చనే భయంతో రైతులు ఉన్న కోళ్లను వచ్చిన ధరకే అమ్మేయడానికి సిద్ధమవుతున్నారు.

ఇక అంతుచిక్కని వైరస్ సోకి కోళ్లు చనిపోతున్నాయనే వార్తలు ప్రజలకు తెలియడంతో చాలా మంది చికెన్ తినడం మానేశారు. దీంతో చికెన్ రేట్లు భారీగా తగ్గాయని వ్యాపారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కోళ్ల మరణాలకు కారణమైన వైరస్‌ను గుర్తించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. కోళ్ల మరణాలకు H5N1 వైరస్ కారణం కావొచ్చని పశు సంవర్థక శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. వైరస్ సోకిన పౌల్ట్రీ ఫారాల నుంచి శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కి పంపించినట్లు తెలిపారు. 2012, 2020లో కూడా ఇదే తరహా వైరస్ వ్యాపించి, లక్షలాది కోళ్లు మరణించిన ఘటనలు చోటుచేసుకున్నాయి.



Next Story

Most Viewed