- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో శాసన మండలి రద్దు తీర్మానం ఉపసంహరణ: బుగ్గన రాజేంద్రనాథ్
దిశ, ఏపీ బ్యూరో: మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు ప్రవేశపెట్టిన వైకాపా ప్రభుత్వం, మంగళవారం మరో కీలకమైన ప్రకటన చేసింది. శాసనమండలి రద్దు తీర్మానాన్ని వెనక్కి తీసుకోనున్నట్లు శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఈ మేరకు శాసనసభలో కొత్త తీర్మానం ప్రవేశపెట్టారు. బుగ్గన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ, మండలి రద్దు తీర్మానాన్ని జనవరి 27న అసెంబ్లీలో ప్రవేశపెట్టామనీ, ఆ తీర్మానాన్ని ఆమోదం కోసం కేంద్రానికి పంపించినట్లు వివరించారు. గత 22 నెలలుగా కేంద్రం వద్దే పెండింగులో ఉండిపోయిందనీ.. దీంతో మండలి కొనసాగింపుపై సందిగ్ధత ఏర్పడిందని అన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయింతో సందిగ్ధం తొలగిపోయిందన్నారు. శాసనమండలిని యథాతథంగా కొనసాగించాలని కేంద్రాన్ని కోరతామని మంత్రి ప్రకటించారు. లెజిస్లేటివ్ అసెంబ్లీకి కౌన్సిల్ బలంగా ఉంటుందని ఆశిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.
గతేడాది జనవరిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం తీర్మానం చేసింది. కానీ ఈ ఆర్డినెన్స్‌ను మండలి వ్యతిరేకించింది. అంతేగాక మూడు రాజధానుల బిల్లులను కూడా మండలి వ్యతిరేకించింది. దీంతో ముఖ్యమంత్రి జగన్, ప్రజాబలంతో గెలిచిన 151 మంది ఎమ్మెల్యే నిర్ణయాన్ని తప్పుబడతారా అని మండలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ నిర్ణయమే ఫైనల్ అని తేల్చిచెప్పారు. మండలి వ్యవస్థే అవరం లేదంటూ విరుచుకుపడ్డారు. మండలి నిర్వహణ వల్ల ప్రభుత్వానికి ఖర్చు ఎక్కువ అవుతుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మండలిని రద్దుచేయాలని కేంద్రాన్ని కోరుతూ గతేడాది జనవరి 27న శాసనసభలో తీర్మానం పెట్టారు. ఆ తీర్మానాన్ని కేంద్రానికి సైతం పంపించారు. అయితే దానిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఉపసంహరణ వెనకున్న వ్యూహం
గతంలో వైకాపాకు మండలిలో సంఖ్యా బలం తక్కువుగా ఉండేది. దీంతోనే మూడు రాజధానులు బిల్లు, ఇంగ్లీషు మీడియంతోపాటు కీలక నిర్ణయాలను శాసనమండలి వ్యతిరేకించింది. అసెంబ్లీలో వైసీపీ బలం ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం పెట్టిన బిల్లు పాస్ అవుతున్నప్పటికీ మండలిలో టీడీపీ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో బిల్లు పాస్ కావడం లేదు. ఈ నేపథ్యంలోనే శాసన మండలి రద్దుకు జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రస్తుతం శాసన మండలిలో వైసీపీ సభ్యుల సంఖ్య పెరిగింది. శాసన మండలిలో 58 మంది ఎమ్మెల్సీలు ఉండగా ప్రస్తుతం టీడీపీకి చెందిన సభ్యులు 12 మంది వైసీకి 18 మంది సభ్యులు ఉన్నారు. మంగళవారం ఎమ్మెల్యే కోటాలో ముగ్గురు వైసీపీ అభ్యర్థులు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మండలిలో వైసీపీ సభ్యుల బలం 21కు చేరింది.
మరికొన్ని రోజుల్లో మరో 11 మంది వైసీపీ ఎమ్మెల్సీలు మండలిలో అడుగుపెట్టనున్నారు. స్థానిక సంస్థల కోటాలో 11స్థానాలకు ఎన్నిక జరగాల్సి ఉంది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ 11మంది అభ్యర్థులు ఏకగ్రీవమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 11మంది వైసీపీ సభ్యులు ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలు మండలిలో అడుగుపెడితే వైసీపీ బలం 32కు చేరుతుంది. శాసనసభలో ఏ బిల్లు పాస్ అయినా అది మండలిలో కూడా ఈజీగా పాస్ అవుతుంది. వైసీపీ ప్రభుత్వం తీసుకునే ఆర్డినెన్స్, బిల్లులకు ఉభయ సభల్లోనూ అడ్డంకి లేదు. అందువల్లే శాసన మండలి రద్దు తీర్మానాన్ని వైసీపీ ఉపసంహరించుకుంది. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పాదయాత్రలో అనేక మందికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీ నేపథ్యంలో పదవుల సర్దుబాటుకోసమైనా మండలిని ఉంచాల్సిదేనని వైసీపీ భావిస్తోంది.