‘ఆ రెండు సమాఖ్యలను విలీనం చేయాలి’

by Shyam |
‘ఆ రెండు సమాఖ్యలను విలీనం చేయాలి’
X

దిశ, స్పోర్ట్స్: వింబుల్డన్, యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ ఇలా టెన్నిస్‌లో ఏ ఈవెంట్‌లోనైనా పురుషులు, మహిళలకు ఎంట్రీ ఉంటుంది. ఇద్దరికీ ఈవెంట్ ఒకటే, కాని వీళ్లు ప్రాతినిథ్యం వహించే పాలకమండళ్లు మాత్రం వేర్వేరు. ఎందుకంటే పురుషుల కోసం అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ), విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ (డబ్ల్యూటీఏ) అంటూ వేర్వేరు గవర్నింగ్ బాడీలు ఉన్నాయి. ఒకప్పుడు పురుషులు, మహిళలకు ఏటీపీనే పాలకమండలిగా ఉండేది. అయితే మహిళలకు అన్యాయం జరుగుతోందని 1973లో అమెరికాకు చెందిన దిగ్గజ క్రీడాకారిణి బిల్లీ జీన్ కింగ్ డబ్ల్యూటీఏను స్థాపించింది. కేవలం మహిళా టెన్నిస్ క్రీడాకారిణుల కోసం ఏర్పాటు చేసిన డబ్ల్యూటీఏ ప్రపంచవ్యాప్తంగా టెన్నిస్ అభివృద్ధికి పాటుపడింది. మహిళల టెన్నిస్‌కు ర్యాంకింగ్స్ ఇవ్వడంతో పాటు వారి కోసం టూర్లు కూడా ఏర్పాటు చేస్తోంది. కాగా, గతంలో కంటే ఇప్పుడు పురుష, మహిళల టెన్నిస్ మ్యాచ్‌లకు ఆదరణ బాగా పెరిగింది. ప్రొఫెషనలిజంలో ఎవరూ తక్కువ కాదన్నట్లుగా రాణిస్తున్నారు. కాని రెండు పాలకమండళ్లు ఉండటం వల్ల అప్పుడప్పుడు కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. కాబట్టి ఇప్పడు ఏటీఏ, డబ్ల్యూటీఏలను విలీనం చేయాలని బిల్లీ ప్రతిపాదించింది. గతంలోనే ఆమె ఈ ప్రతిపాదన తెచ్చినా సమయాభావం వల్ల ముందుకు వెళ్లలేదు.

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా కారణంగా లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. ఈ విరామ సమయంలో రెండు పాలకమండళ్ల విలీనంపై చర్చ జరిపితే మంచిదని బిల్లీ అభిప్రాయపడుతోంది. పురుష, మహిళా పాలకమండళ్లు ఒక్కటి కావాలన్న తన కల నెరవేరాలంటూ తాజాగా ట్వీట్ చేశారు. టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ సైతం గతంలోనే పురుష, మహిళల టెన్నిస్ పాలకమండళ్లు విలీనం చేయాలని ట్వీట్ చేశాడు. ఫెదరర్ ప్రతిపాదనకు టెన్నిస్ స్టార్ ప్లేయర్ రఫెల్ నాదల్ కూడా మద్దతు పలికారు. మహిళా క్రీడాకారిణులను ఒప్పించి.. విలీనం తర్వాత కూడా వారికి సరైన స్వేచ్ఛ ఉంటుందని భరోసా కల్పిస్తే రెండు పాలకమండళ్లు విలీనం కావడానికి అడ్డంకులు తొలిగిపోతాయని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

tags :Tennis, WTA, ATP, Wimbledon, US Open, Nadal, Federer, Women’s Tennis

Advertisement

Next Story

Most Viewed