బాలు ఆరోగ్యంపై ప్రముఖుల ఆందోళన.. ఆస్పత్రికి క్యూ

by Anukaran |   ( Updated:2020-09-24 20:10:01.0  )
బాలు ఆరోగ్యంపై ప్రముఖుల ఆందోళన.. ఆస్పత్రికి క్యూ
X

దిశ, న్యూస్ బ్యూరో: ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెన్నయ్‌లోని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు గురువారం సాయంత్రం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నాయి. గడచిన 24 గంటలుగా ఆయన ఆరోగ్యం క్షీణించిందని, ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారని, కరోనా నుంచి కోలుకున్నా ఇతర అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్నారని స్పష్టం చేసింది.

ఈ వార్త వెలువడడంతోనే నటుడు కమల్‌హాసన్ స్వయంగా ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్లను కలిసి వివరాలు తెలుసుకున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం డాక్టర్లతో మాట్లాడి తాజా పరిస్థితి, అందిస్తున్న వైద్య చికిత్స గురించి ఆరా తీశారు. ఎస్పీ బాలు కుమార్తె, అల్లుడు, కుమారుడు, కోడలు, చెల్లెలు, ఆమె భర్త తదితర కుటుంబ సభ్యులు, బంధువులంతా ఎంజీఎం ఆసుపత్రిలోనే ఉన్నారు.

ఆగస్టు 5వ తేదీన ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన ఎస్పీ బాలుకు కరోనా పాజిటివ్ వచ్చినా చికిత్స అనంతరం కోలుకున్నారు. నెగెటివ్ అని రిపోర్టు వచ్చినా ఇతర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలోనే ఉన్నారు. దాదాపు యాభై రోజులుగా ఆయన చికిత్సలోనే ఉండడం, తాజాగా పరిస్థితి విషమించిందని తెలియడంతో సినీ పరిశ్రమ వర్గాలతో పాటు ప్రజల్లో అలజడి రేకెత్తింది.

ఆయన త్వరగా కోలుకోవాల్సిందిగా వివిధ ప్రాంతాల్లో అభిమానులు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు, హోమాలు జరుపుతున్నారు. ఆసుపత్రి దగ్గర వీఐపీల తాకిడి పెరిగింది. ఏ సమయంలో ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందోననే ఆందోళన అభిమానుల్లో నెలకొంది.

Advertisement

Next Story