- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజూరాబాద్‌లో ‘తెలంగాణ దళిత బంధు’కు శ్రీకారం
దిశ, తెలంగాణ బ్యూరో : దళిత సాధికారత కోసం ముఖ్యమంత్ర కేసీఆర్ ఆలోచనలు కొలిక్కి వచ్చాయి. ఈ పథకానికి ‘తెలంగాణ దళిత బంధు’ అని పేరు పెట్టారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు. త్వరలోనే తేదీని ఖరారు చేయనున్నారు. ఈ పథకం అమలు కోసం మూడంచెల విధానాన్ని అవలంబించనున్నారు. ఈ నియోజకవర్గంలో 20,929 దళిత కుటుంబాల నుంచి లబ్ధిదారుల ఎంపిక జరగనున్నది. సమగ్ర కుటుంబ సర్వేలో తేలిన గణాంకాలను ప్రామాణికంగా తీసుకుని అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రైతుబంధు పథకం పటిష్టంగా అమలవుతున్న తీరులోనే దళిత బంధు కూడా ఉండాలని, ఇందుకోసం నిబద్ధతతో పనిచేసే సమర్ధులైన అధికారులను గుర్తించి బాధ్యతలు అప్పజెప్పనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుందని స్పష్టం చేశారు. పలువురు అధికారులతో ప్రగతి భవన్‌లో ఆదివారం నిర్వహించిన సమీక్ష అనంతరం ఒక ప్రకటనలో సీఎం పై వివరాలను వెల్లడించారు.
గతంలో అనేక పథకాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభించామని, రైతుబంధు కూడా హుజూరాబాద్ నుంచే మొదలుపెట్టామని, ఇప్పుడు ‘దళిత బంధు‘కు కూడా అక్కడి నుంచే శ్రీకారం చుట్టాలని భావిస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అక్కడి నుంచి ప్రారంభించిన పథకాలన్నీ సక్సెస్ అయ్యాయని, ఇప్పుడు ఈ కొత్త పథకాన్ని ఎప్పుడు ప్రారంభించేదీ త్వరలోనే తేదీని ఖరారు చేయనున్నట్లు పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌ను ఎంచుకున్నందున అన్ని మండలాల్లోని దళిత కుటుంబాల స్థితిగతులను అధికారులు సేకరించనున్నారు. హుజూరాబాద్ మండలంలో 5,323 దళిత కుటుంబాలు, కమలాపూర్‌లో 4,346, వీణవంకలో 3,678, జమ్మికుంటలో 4,996, ఇల్లందకుంటలో 2,586 కుటుంబాల చొప్పున నియోజకవర్గంలో 20,929 దళిత కుటుంబాల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. లబ్ధిదారుల కుటుంబాలకు ఈ పథకాన్ని పరిపూర్ణ స్థాయి (సాచురేషన్ మోడ్)లో వర్తింపచేయనున్నట్లు తెలిపారు.
ఆ తర్వాత అన్ని చోట్లా అమలు
పైలట్ నియోజకవర్గంగా హుజూరాబాద్‌లోని క్షేత్రస్థాయి అనుభవాలను సమీక్షించుకుని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయడం అధికారులకు సులువవుతుందని సీఎం వివరించారు. పైలట్ ప్రాజెక్టులో కలెక్టర్లతో పాటు ఎంపిక చేయబడిన అధికారులు పాల్గొంటారని, త్వరలోనే వారితో వర్క్‌షాప్ నిర్వహించనున్నట్టు తెలిపారు. మూడంచెల దళిత బంధులో మొదటిది ఈ పథకాన్ని అమలు చేసి పర్యవేక్షించడం కాగా, రెండోది పథకం ఫలితాలను అంచనా కట్టడమని, చివరగా ప్రభుత్వం భాగస్వామ్యంతో లబ్ధిదారులు రక్షణ నిధిని ఏర్పాటు చేసుకోవడం అని తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం అందించే పది లక్షల రూపాయల నగదుతో పాటు, లబ్ధిదారులు ప్రభుత్వం భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేసుకుంటారని, ఆకస్మికంగా ఆపద కలిగినప్పుడు ఈ నిధి నుంచి సాయం అందుతుందని తెలిపారు. దళితులకు ఆపద సమయంలో ఇది రక్షక కవచంగా నిలుస్తుందన్నారు.
ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి …
దళితులను ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకపోవడమే ‘దళిత బంధు’ఉద్దేశ్యమన్నారు. పటిష్టంగా అమలుచేయడానికి మనసు పెట్టి లీనమై నిబద్ధతతో పనిచేసే అధికార యంత్రాంగం అవసరమని, అధికారులుగా కాక సమన్వయకర్తలుగా, కార్యకర్తలుగా పనిచేయాల్సి ఉంటుందని సీఎం పేర్కొన్నారు. చిత్తశుద్ది, దళితుల పట్ల ప్రేమాభిమానాలున్న అధికారులను గుర్తించాలని ఉన్నతాధికారులను కేసీఆర్ ఆదేశించారు. సమాజంలో వివక్షకు గురవుతున్న ప్రతిభావంతమైన వర్గాన్ని ఉత్పత్తిలో భాగస్వామ్యులను చేయడమే ఈ పథకం అని వ్యాఖ్యానించారు.
మూస పద్ధతిలో కాకుండా ప్రభుత్వ ఆలోచనలను అందుకుని పనిచేసే అధికార, ప్రభుత్వ యంత్రాంగం ఎంపిక జరగాలన్నారు. ఆషామాషీగా కాకుండా మనసుపెట్టి అమలు చేయాలన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా దళిత బంధు పథకం అమలవుతుందన్నారు. ఇష్టమైన పని చేస్తున్నప్పుడు కనబరిచే దీక్షను ఈ పథకం అమలులో ప్రదర్శించాలని స్పష్టం చేశారు. గత పాలకుల విధానాల కారణంగా దళితుల్లో అపనమ్మకం ఏర్పడిందని, ఆ అవిశ్వాసం తొలగిపోవాలన్నారు. ప్రభుత్వాలు తమ అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నాయనే విశ్వాసం, బలమైన నమ్మకం వారిలో కలిగించాల్సిన అవసరం ఉన్నదన్నారు. అమల్లో అధికార యంత్రాంగం అలసత్వం వహిస్తే ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేశారు.
దళితులపట్ల ఆర్థిక వివక్షతో పాటు సామాజిక వివక్ష కూడా ఉన్నదని, తరతరాలుగా పట్టి పీడిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేసిన సీఎం వాటి నుంచి దూరం చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి పథాన నడిపించాలనే చిత్తశుద్ది ప్రభుత్వానికి ఉన్నదన్నారు. రైతును అభివృద్ధి, సంక్షేమ పథంలో నడిపించినట్లే ‘దళిత బంధు‘ ద్వారా దళిత సాధికారత కోసం కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. దళారుల బాధ లేకుండా రైతుబంధు తరహాలో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో దళిత బంధుసాయం జమ అవుతుందన్నారు. దళిత కుటుంబాల ప్రొఫైల్‌ను రూపొందించాలని, వారి జీవన స్థితి గతులను పొందుపరచాలన్నారు. దళిత సమస్యలు గ్రామీణ, సెమీ అర్బన్, అర్బన్ ప్రాంతాల్లో వేర్వేరుగా ఉంటాయని, దానికి అనుగుణంగా ఈ పథకం అమలు ఉండాలన్నారు.