ఏపీలో బీఆర్ఎస్‌కు చిక్కులు.. రాష్ట్ర పార్టీగా గుర్తింపు రద్దు

by GSrikanth |
ఏపీలో బీఆర్ఎస్‌కు చిక్కులు.. రాష్ట్ర పార్టీగా గుర్తింపు రద్దు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రాంతీయ పార్టీ స్థాయి నుంచి జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలని భావించిన భారత్ రాష్ట్ర సమితికి ఆదిలోనే చిక్కులు ఎదురయ్యాయి. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పోటీచేయడానికి విశాఖ ఉక్కును ప్రచారాస్త్రంగా ఎంచుకుని ప్రయత్నిస్తున్న సమయంలో ఆ రాష్ట్రంలో ఇంతకాలం కొనసాగిన ‘స్టేట్ పార్టీ’ హోదాను ఉపసంహరిస్తున్నట్లు (రద్దు చేయడం) కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర సమితి స్టేట్ పార్టీగా గుర్తింపు పొందిందని, కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తగిన ఆర్హతలను సాధించలేకపోవడంతో ఆ హోదాను ఎత్తివేస్తున్నట్లు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నది. రాష్ట్ర హోదాను ఎందుకు తీసేయకూడదంటూ మూడుసార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చినా ఆ పార్టీ నుంచి స్పందన లేదని స్పష్టం చేసింది.

కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ఎలక్షన్ సింబల్స్ (రిజర్వేషన్ అండ్ అలాట్‌మెంట్) ఆర్డర్ 1968 లోని సెక్షన్ 6-ఏ ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి స్టేట్ పార్టీ స్టేటస్‌ను ఎత్తివేస్తున్నట్లు ఎన్నికల సంఘం కార్యదర్శి జయదేబ్ లాహిరి పేర్కొన్నారు. ఒక రాష్ట్రంలో ఏదేని పార్టీ రాష్ట్ర పార్టీగా కొనసాగాలంటే నిర్దిష్టైన నిబంధనలు, అర్హతలు, ప్రమాణాలు ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఆ అర్హతలను పొందలేకపోయిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ (అప్పట్లో టీఆర్ఎస్) పోటీచేయలేదని, అస్సలే ఓట్లు పడలేదని, దీంతో రాష్ట్ర పార్టీకి ఉండాల్సిన అర్హతలు సాధించలేకపోయిందన్నారు.

స్టేట్ పార్టీ హోదాకు సంబంధించి ఎప్పటికప్పుడు గుర్తింపుపై సమీక్షలు జరుగుతూ ఉంటాయని, కానీ కొవిడ్ కారణంగా ఈ ప్రక్రియలో ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపారు. తొలిసారి 2019 జూలై 18న బీఆర్ఎస్ పార్టీకి తొలి షోకాజ్ నోటీసు జారీచేసి ఆంధ్రప్రదేశ్‌లో స్టేట్ పార్టీ హోదాను ఎందుకు తొలగించకూడదో వివరణ ఇవ్వాల్సిందిగా కోరామని లాహిరి ఆ ప్రకటనలో గుర్తుచేశారు. కానీ పార్టీ తరఫున ఎవ్వరూ హాజరుకాలేదని, ఎలాంటి వివరణ కూడా అందలేదని గుర్తుచేశారు. కొవిడ్ కారణంగా కొంతకాలం రివ్యూ ప్రాసెస్ పెండింగ్‌లో పడిందని, దీంతో 2021 డిసెంబరు 16న ప్రక్రియను తిరిగి ప్రారంభించామని అదే నెలలో 27న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా పార్టీకి లేఖ రాశామని పేర్కొన్నారు. ఆ ప్రకారం ఎవ్వరూ హాజరు కాలేదని వివరించారు.

ఆ తర్వాత మూడోసారి ఈ సంవత్సరం మార్చి 7వ తేదీన మరో లేఖ రాసి మార్చి 20న మధ్యాహ్నం 3.00 గంటలకు మీటింగ్‌ను ఫిక్స్ చేశామని, కానీ పార్టీ తరఫున ఎవ్వరూ హాజరు కాలేదని తెలిపారు. దీనికి బదులుగా అదే రోజున పార్టీ నుంచి లేఖ వచ్చిందని, ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే పార్లమెంటు ఎన్నికల వరకూ రెండు రాష్ట్రాల్లోనూ స్టేట్ పార్టీ గుర్తింపును కొనసాగించాల్సిందిగా రిక్వెస్టు చేసిందని పేర్కొన్నారు. ఇదే సమయంలో 2019లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ కు ఎలాంటి ఓటింగ్ శాతం లేదని తేలిందని, అసలు పోటీయే చేయనప్పుడు నిబంధనలకు విరుద్ధంగా స్టేట్ పార్టీ హోదాను కంటిన్యూ చేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు.

ఆ రాష్ట్రంలో పోటీచేయని కారణంగా దానంతట అదిగానే రాష్ట్ర పార్టీ గుర్తింపును బీఆర్ఎస్ కోల్పోయిందని స్పష్టం చేశారు. ఏపీలో స్టేట్ పార్టీ స్టేటస్‌ను కొనసాగించాల్సిందిగా రిక్వెస్టు చేసిన విషయాన్ని లాహిరి గుర్తుచేస్తూ.. నిజానికి తొలిసారి షోకాజ్ నోటీసు ఇచ్చినప్పటి నుంచి 2002 డిసెంబరు మధ్యలో సుమారు 21 ఎన్నికలు జరిగాయని, ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోనూ కొన్ని ఎన్నికలు జరిగాయని లాహిరి ఉదహరించారు. అనేక అవకాశాలు ఇచ్చినా పార్టీ నుంచి తగిన స్పందన రాలేదని నొక్కిచెప్పారు. ఎన్నికల ప్రక్రియలో నిబంధనలు మినహా పార్టీలకు ప్రత్యేకంగా ఎలాంటి మినహాయింపులు ఉండవని గుర్తుచేశారు. నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో తగిన అర్హతలు, ప్రమాణాలు లేకపోయినా ఇప్పటిదాకా స్టేట్ పార్టీ హోదాను నిలబెట్టుకున్నదని (కొవిడ్ కారణంగా), కానీ ఇప్పుడు సమీక్ష సందర్భంగా ఆ హోదాను పార్టీయే చేజార్చుకున్నదని పేర్కొన్నారు.

ఇక ఎంతమాత్రమూ ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ ఒక రాష్ట్ర పార్టీగా లేదని, కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైందన్నారు. 1968 నాటి ఎలక్షన్ సింబల్స్ ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్‌కు స్టేట్ పార్టీ స్టేటస్ ఇవ్వలేమని తేల్చి చెప్పారు. ఇంతకాలం ఉన్న గుర్తింపును ఉపసంహరిస్తున్నట్లు స్పష్టం చేశారు.

కామన్ సింబల్ లేనట్లే.. !

దాదాపు టీఆర్ఎస్ ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భవించినప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో స్టేట్ పార్టీగా గుర్తింపు పొంది ఇప్పటివరకూ దాన్ని నిలబెట్టుకున్నది. కానీ 2014లో తెలంగాణ ఒక రాష్ట్రంగా ఫిబ్రవరిలోనే ఏర్పడినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలు మాత్రం ఉమ్మడి రాష్ట్రం ప్రాతిపదికనే జరిగాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పరిగణనలోకి తీసుకోవడంతో సమైక్య రాష్ట్రం యూనిట్‌గానే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. దాంతో ఉమ్మడి రాష్ట్రంలో లభించిన స్టేట్ పార్టీ స్టేటస్ 2019 వరకూ కంటిన్యూ అయింది. 2019లో ఆంధ్రప్రదేశ్‌లో జమిలిగా జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడంతో ఓటింగ్ శాతం జీరో అయింది. దీంతో ఆ రాష్ట్రంలో స్టేట్ పార్టీ స్టేటస్‌ను కోల్పోయింది. కొవిడ్ కారణంగా 2019 నుంచి 2023 మార్చి వరకు ఆ హోదాను అనుభవించినా ఏప్రిల్ 10 నుంచి మాత్రం కోల్పోవాల్సి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లో స్టేట్ పార్టీ స్టేటస్ లేనందువల్ల ఇకపైన పోటీ చేస్తే కామన్ సింబల్ దక్కడం అనుమానమే. తెలంగాణలో కారు గుర్తుమీద పోటీ చేస్తున్నా ఏపీలో అలాంటి అవకాశం లేదు. స్పెషల్ రిక్వెస్టు ద్వారా అది సాకారమవుతుందో లేదో వేచి చూడాల్సిందే. స్వతంత్ర అభ్యర్థులు లేదా రిజిస్టర్డ్ పార్టీలకు ఆ గుర్తు ఇచ్చేలాగ బీఆర్ఎస్ పార్టీకి ఏ మేరకు అవకాశం ఉంటుందనేది అనుమానమే. గుర్తింపు లేని రిజిస్టర్డ్ పార్టీగా మాత్రమే ఎన్నికల బరిలోకి దిగాల్సి ఉంటుంది.

Advertisement

Next Story