వారి నిర్లక్ష్యమే ప్రాణం తీసిందా..?

by  |
వారి నిర్లక్ష్యమే ప్రాణం తీసిందా..?
X

దిశ, సిద్దిపేట: వర్షాకాలంలోనే ఎక్కువగా విద్యుత్ సమస్యలు తలెత్తుతాయి. ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తూ అన్నదాతలను ఆదుకొనే ప్రయత్నం చేస్తుంటే విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం మాత్రం నిండు ప్రాణాల్ని బలిగొంటున్నాయి. సిద్దిపేట నియోజక వర్గంలో ఇప్పటికే చాలా మంది రైతుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ముఖ్యంగా విద్యుత్ అధికారులు బిల్లులు వసూలు మీద పెట్టే దృష్టి ట్రాన్స్ ఫార్మరల్ పై , కరెంట్ తీగలపై పెట్టడం లేదు. దానికి ఉదాహరణే గత నెలలో సిద్దిపేట నియోజకవర్గ వ్యాప్తంగా చాలామంది రైతులు ప్రాణాలు కోల్పోయారు.

ముఖ్యంగా ఈ మధ్య కాలంలో నంగునూర్ మండలం అక్కేనపల్లి గ్రామంలో మాజీ ఎంపీటీసీ యాదగిరి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మరణించిన ఘటన కొట్టొచ్చినట్లు కనబడుతోంది. అలాగే సిద్దిపేట అర్బన్ మండలంలోని ఎన్సాన్ పల్లి గ్రామానికి చెందిన తంగలపల్లి రాజయ్య గౌడ్ ప్రాణం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే కోల్పోవాల్సి వచ్చింది. వీరితో పాటుగా ఇంకా చాలామంది కూడా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారి కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి బ్రతుకులు రోడ్డున పడ్డాయి. వారిని అదుకునే నాథుడే కరువయ్యాడు. విద్యుత్ ప్రమాదాలలో మనుషులతో మూగ జంతువులు కూడా ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. అధికారులు మొద్దు నిద్ర విడి పనులపై దృష్టి పెడితేనే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.


Next Story