అక్కడే తేల్చుకోండి !

by Anukaran |   ( Updated:2020-08-26 09:18:06.0  )
అక్కడే తేల్చుకోండి !
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మళ్లీ చుక్కెదురైంది. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై జోక్యం చేసుకోలేమని బుధవారం అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం తేల్చి చెప్పింది. హైకోర్టులో ఈ కేసుపై గురువారం విచారణ చేయనుండగా అక్కడే తేల్చుకోవాలని సూచించింది. అమరావతి రాజధానిని విశాఖకు తరలించొద్దని ఆ ప్రాంత రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తుది తీర్పు ఇచ్చేదాకా ఉన్నది ఉన్నట్టు కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో పై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడం తెలిసిందే.

ఈ కేసుపై సుప్రీంలో విచారణ సందర్బంగా కనీసం పరిపాలనా రాజధానిని విశాఖ తరలించేందుకు అనుమతించాలని ఏపీ తరపు న్యాయవాది రాకేష్ ద్వివేది కోరారు. దీనిపై సుప్రీం కోర్టు నిరాకరించింది. హైకోర్టులో అమరావతి రైతులకు అనుకూలంగా తీర్పు వస్తే వైజాగ్ కు రాజధాని తరలింపు వ్యయం వృథా అవుతుంది కదా ! ఆ ఖర్చుకు ఎవరు బాధ్యత వహిస్తారని జస్టిస్ అశోక్ భూషణ్ ప్రశ్నించారు. ఏదైనా హైకోర్టు విచారణ తర్వాతనేనని స్పష్టం చేశారు. నిర్ణీత కాల వ్యవధిలో కేసు విచారణను పూర్తి చేసేట్లు ఆదేశించాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోరారు. దీనికీ సుప్రీం ససేమిరా అంటూ తోసిపుచ్చింది. వీలైనంత త్వరగా విచారణను పూర్తి చేయాలని సూచిస్తామని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది.

సీఆర్డీఏ కార్యాలయ ముట్టడి భగ్నం

రాజధానికిచ్చిన భూములకు కౌలు చెల్లించాలని కోరుతూ బుధవారం సీఆర్డీఏ కార్యాలయ ముట్టడికి కొందరు రైతులు ప్రయత్నించారు. వెంకటపాలెం చెక్‌పోస్టు వద్ద వారిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. తమకు న్యాయంగా రావాల్సిన కౌలు సొమ్ము అడగడం నేరమా అంటూ రైతులు నిరసించారు. వారిని సీపీఎం నాయకులు పి. మధు, టీడీపీ నేత దేవినేని ఉమ పరామర్శించారు. ప్రభుత్వ నియంతృత్వపోకడలు పోతుందని విమర్శించారు.

ఎప్పటికైనా రాజధాని రైతులే గెలుస్తారు – ఎంపీ రఘురామ కృష్ణరాజు

కౌలు కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతూ సీఆర్డీఏ ఆఫీసుకు వెళ్లిన రైతులను అరెస్ట్ చేసి దాడి చేయడం దారుణమని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. న్యాయ స్థానంలో రైతులే గెలుస్తారని చెప్పారు. “అమరావతి రైతులకు కౌలు డబ్బు ఇవ్వడం లేదు. మూడు రాజధానులు కడతారా? మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె నా? “అంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed