సా….గుతున్న కొనుగోళ్లు

by  |
సా….గుతున్న కొనుగోళ్లు
X

దిశ, నిజామాబాద్: ధాన్యం కొనుగొళ్లను ప్రారంభించి నెల దాటింది. కానీ, ఇప్పటికీ ధాన్యం రోడ్లపైన, పంట చెలల్లోనే కనబడుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఐకేపీల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరగుతున్నా అవి ప్రధానంగా హమాలీలు, లారీల కొరతను ఎదుర్కుంటున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 5.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని అంచనా. అందులో భాగంగా 547 కొనుగోలు కేంద్రాల ద్వారా 5.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం పెట్టుకున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 3.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ప్రస్తుతం 351 కొనుగోలు కేంద్రాల ద్వారా జరుగుతున్న ధాన్యం సేకరణ 10 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించారు. జిల్లాలో 67 శాతం ధాన్యం కొనుగోళ్లు జరిగినప్పటికీ 33 శాతం నిర్ణిత రోజుల్లో పూర్తవుతాయా అనే సందేహలు వ్యక్తమవుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో 437 కొనుగోలు కేంద్రాలలో ధాన్యం సేకరణ చేపట్టారు. ప్రస్తుతం 326 కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 2,35,926 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. మరో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంది.

అకాల వర్షంతో భయం..

జిల్లాలో అకాల వర్షాలు రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. ధాన్యం ఇప్పటికే రోడ్లపైన, కల్లాల్లోనే ఉంది. పంటలు కోసి నెల గడుస్తున్నా కొనుగోల్లు నెమ్మదిగా సాగుతున్నాయి. దీంతో కొందరు మిల్లర్లకు, కమీషన్ ఏజేంట్లకు ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. అధికార యంత్రాంగం ఇచ్చిన కాంట్రాక్ట‌ర్లకు సరిపడా లారీలు లేకపోవడంతో ప్రైవేట్ లారీలతో పనులను కానివ్వాలని వారికి గంటల వ్యవధిని టార్గేట్‌‌ ను విధించి బియ్యం లోడింగ్ చేస్తున్నారు.

కొందరికే జమ..

నిజామాబాద్ జిల్లాలో 3.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగితే కేవలం రూ.187 కోట్లు మాత్రమే రైతుల ఖాతాలో నగదు జమ అయ్యాయి. సుమారు రూ. 200 కోట్ల వరకు రైతులకు చెల్లించాల్సి ఉంది. కామారెడ్డి జిల్లాలో 57,778 మంది రైతుల నుంచి రూ. 430 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కానీ, ఇప్పటి వరకూ రూ. 321 కోట్లు మాత్రమే చెల్లించారు. మిగిలిన రూ. 90 కోట్ల చెల్లింపులు ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.


Next Story

Most Viewed