చంద్రుడిని లేజర్లతో షూట్ చేస్తున్న నాసా.. ఎందుకు?

by  |
చంద్రుడిని లేజర్లతో షూట్ చేస్తున్న నాసా.. ఎందుకు?
X

గత దశాబ్ద కాలం నుంచి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (NASA) చంద్రుని మీద లేజర్ కిరణాలతో దాడి చేస్తోంది. దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. ఇదేదో హాని కలిగించే లేజర్ కిరణాల దాడి అనుకోకండి. ఇది కేవలం ఓ అధ్యయనంలో భాగంగా ప్రయోగిస్తున్న లేజర్ కిరణాలే. అయితే ఇన్నేళ్లుగా చేస్తున్న ఈ లేజర్ కిరణాల ప్రయోగంలో ఇటీవల ఒక పురోగతి కనిపించింది. అందుకే ఇప్పుడు దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది. చంద్రుని మీదున్న లూనార్ రీకనైజాన్స్ ఆర్బిటర్ (LRO) అనే రిఫ్లెక్టర్‌ల మీద నాసా వారు లేజర్ కిరణాలను పంపిస్తున్నారు. ఈ మధ్య అలాంటి కిరణం ఒకటి తిరిగి భూమిని చేరుకుంది. ఇంతకీ దీని వల్ల కలిగే లాభమేంటి?

గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి రిఫ్లెక్టర్‌లను నాసా చంద్రుని మీదకు పంపిస్తోంది. లేజర్ లైట్‌లతో నిర్మితమైన ఈ రిఫ్లెక్టర్‌లను అపోలో 11, అపోలో 14 ద్వారా కూడా చంద్రుని మీదకు పంపించారు. రష్యాకు చెందిన లునోఖోద్ 1, లునోఖోద్ 2 ల్యాండర్‌లు కూడా రిఫ్లెక్టర్‌లను చంద్రుని మీదకి తీసుకెళ్లాయి. గతేడాది ఇజ్రాయెల్‌కు చెందిన బీరేషేట్ అనే లూనార్ క్రాఫ్ట్ చంద్రుని మీద కుప్పకూలింది. కానీ దానిలో ఉన్న రిఫ్లెక్టర్ మాత్రం ఇంకా పనిచేస్తోంది. ఇప్పుడు ఇలాంటి రిఫ్లెక్టర్‌లు చంద్రుని మీద పలుచోట్ల ఉన్నాయి. వీటి సాయంతో చంద్రునికి భూమికి మధ్య ఉన్న దూరాన్ని కచ్చితంగా కనిపెట్టవచ్చు. భూమి మీద నుంచి ఒక లేజర్ కిరణాన్ని పంపితే, అది వెళ్లి రిఫ్లెక్టర్‌కు తాకిన తర్వాత అక్కడి నుంచి మరో లేజర్ కిరణం భూమి వైపుకు వస్తుంది. ఆ తిరిగి వచ్చిన కిరణాలను అధ్యయనం చేయడం వల్ల చంద్రుడు తిరిగే స్థితిని అధ్యయనం చేయవచ్చు.

అలాంటి అధ్యయనాల ద్వారా ఇప్పటికే నాసా కొన్ని విషయాలను ప్రకటించింది. ప్రతి ఏడాది భూమికి, చంద్రునికి మధ్య 1.5 ఇంచుల దూరం పెరుగుతోందట. కానీ తిరిగి రావాల్సిన లేజర్ కిరణంలో ఫోటాన్‌లు అన్ని భూమికి చేరకపోవడంతో అది బలహీనంగా ఉండి డేటాను అధ్యయనం చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందుకే ఏ విషయాన్ని సరిగా చెప్పలేని పరిస్థితి ఏర్పడుతోందని నాసాకు చెందిన గాడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ సైంటిస్ట్ ఈర్వాన్ మాజారికో చెబుతున్నారు. గత యాభై ఏళ్లుగా సేకరిస్తున్న డేటాను విశ్లేషించి తాము ఈ విషయాన్ని కనిపెట్టినట్లు ఆయన చెప్పారు. భవిష్యత్తులో బలమైన రిఫ్లెక్టర్లను పంపి, వాటి ద్వారా వచ్చే శక్తిమంతమైన లేజర్ కిరణాలతో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తామని ఆయన తెలిపారు.


Next Story

Most Viewed