200 ఏళ్ల తర్వాత.. భూమికి అతి సమీపంగా ప్రమాదకర ఆస్టరాయిడ్

by Sujitha Rachapalli |   ( Updated:2021-02-10 04:35:50.0  )
200 ఏళ్ల తర్వాత.. భూమికి అతి సమీపంగా ప్రమాదకర ఆస్టరాయిడ్
X

దిశ, ఫీచర్స్: గతేడాది డిసెంబర్ 21న సౌరకుటుంబంలో అత్యంత ప్రకాశవంతమైన గురు, శని గ్రహాలు భూమికి అత్యంత సమీపంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అంతరిక్షంలో ఆవిష్కృతమైన ఆ అరుదైన దృశ్యాన్ని ప్రపంచమంతా వీక్షించింది. సరిగ్గా మూడు నెలల తర్వాత(మార్చి 21న) అలాంటి అరుదైన మరో దృశ్యానికి అంతరిక్షం వేదిక కానుంది. అయితే ఈసారి గ్రహాలు కాకుండా అతిపెద్ద ఆస్టరాయిడ్(ఉల్క) భూమికి అత్యంత సమీపానికి రానుంది. అత్యంత ప్రమాదకరమైన ఈ ఆస్టరాయిడ్ భూమిపై ఏమైనా ప్రభావం చూపనుందా? ఇది భూమికి ఎంత దగ్గరగా రానుంది? భూమి కక్ష్యలోకి ఏ సమయంలో వస్తుంది? ఈ ఉల్కను ఆస్ట్రోనాట్లు మాత్రమే చూడొచ్చా? సామాన్యులు కూడా వీక్షించొచ్చా? అనే విషయాలు తెలుసుకుందాం.

NEO(Near Earth Objects) అనగా భూ‌మికి దగ్గరగా ఉండే ఖగోళ వస్తువులు. ఇవి భూమి కక్ష్యలో తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంటాయి. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్(CNEOS) ప్రకారం.. 25 వేల వస్తువులు భూమికి దగ్గరగా ఉండగా ఇందులో ఎక్కువ భాగం తోకచుక్కలే ఉన్నాయి. కాగా వీటిలో 2,100 వస్తువులను ప్రమాదకరమైనవిగా వర్గీకరించారు. ఈ ప్రమాదకరమైన ఉల్కలు భూమి కక్ష్యలో తిరుగుతూ సూర్యుని చుట్టూ 4.6 మిలియన్ మైళ్ల దూరంలో తమ పరిభ్రమణాన్ని పూర్తి చేస్తాయి. ఇవి భూమి కక్ష్యలో తిరుగుతున్న సమయంలో మిలియన్ ఏళ్లకోసారి భూమికి అతి దగ్గరగా వస్తుంటాయి. ఇలా వస్తూ వస్తూ.. భూమి లేదా ఇతర గ్రహాలకు రీచ్ అయ్యే క్రమంలో వాటి కక్ష్యలను పూర్తి చేసుకుంటాయి. అయితే ఆస్టరాయిడ్లు ఇప్పటి వరకు భూమికి అతి సమీపానికి వచ్చినా ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. ఎందుకంటే అవి భూమ్మీద లాండ్ కాలేదు. అయితే ఉల్కలు ఇలా సమీప కక్ష్యలకు పయనిస్తున్న క్రమంలో వీటి పరిభ్రమణం ఎందుకు జరుగుతుంది? కక్ష్య పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది? అనే విషయాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

మార్చి 21న భూమికి అతి సమీపానికి వచ్చే ఆస్టరాయిడ్‌కు నాసా..2001 F032గా నామకరణం చేసింది. సెకనుకు 34.4 కిలోమీటర్ల వేగంతో కక్ష్యలో పయనించే ఈ ఉల్క వ్యాసం ఒక కిలోమీటరు ఉండగా, ఈ ఏడాదికి అతివేగంగా పయనించే ఉల్క ఇదే. ఈ ఉల్క వేగానికి మనం సాధారణంగా వీక్షిస్తే కనబడదు. 8 ఇంచెస్ లేదా అంతకంటే లార్జర్ టెలిస్కోపుతో ఆ రోజు 11.03 గంటలకు భూమికి అతి దగ్గరగా వచ్చే ఆస్టరాయిడ్‌ను పరిశీలించొచ్చు. కాగా, ఈ ఆస్టరాయిడ్ 200 ఏళ్ల తర్వాత ఖగోళం నుంచి తన కక్ష్యలు పూర్తిచేసుకుని ఎర్త్ ప్లానెట్‌కు క్లోజ్‌గా రాబోతోంది. ఈ ఏడాది మార్చి 21న అరుదైన ఈ ఖగోళ ఆవిష్కరణను అందరూ వీక్షించొచ్చు. ఈ ఆస్టరాయిడ్ మళ్లీ 31 ఏళ్ల తర్వాత అనగా మార్చి 22, 2052లో భూమికి సమీపంలో రానుంది. ఈ 2001 F032 ఆస్టరాయిడ్‌ను భిన్నధృవాల నుంచి కూడా చూడొచ్చు. అయితే దక్షిణ భాగంలో స్పష్టంగా కనబడకపోవచ్చు. తన కక్ష్యలను పూర్తి చేసుకుంటున్న క్రమంలో ఉల్క వృశ్చిక, ధనుష ఖగోళ రాశులకు దగ్గరకు వచ్చిన సమయంలో.. గోళానికి దక్షిణ భాగం నుంచి, భూమధ్యరేఖ దిగువ అక్షాంశాల మీదుగా భూమ్మీద నుంచి దీన్ని సుస్పష్టంగా పరిశీలించొచ్చు.

Advertisement

Next Story

Most Viewed