హడలెత్తిస్తున్న ల్యాండ్ సర్వే అధికారులు

by Aamani |
హడలెత్తిస్తున్న ల్యాండ్ సర్వే అధికారులు
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్న గొలుసుకట్టు చెరువుల ఆక్రమణల చెర వీడుతోంది. ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్టుగా సాగిన కబ్జారాయుళ్ల అడ్డగోలు ఆక్రమణలకు కళ్లెం పడుతోంది. బుధ, గురువారాల్లో ఓ చెరువు చుట్టూ జరిగిన సర్వేలో ఏకంగా 50కి పైగా అక్రమ ప్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించడం తీవ్ర కలకలం రేపుతోంది. నిన్నటి దాకా ఉదాసీనంగా వ్యవహరించిన అధికార యంత్రాంగం హైకోర్టు మొట్టికాయలు వేయడంతో సీరియస్ గానే స్పందిస్తోంది. అన్నింటికీ మించి నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆక్రమిత చెరువులు విషయంలో కఠినంగా వ్యవహరించడంతో భారీగా అక్రమాలు వెలుగు చూస్తున్నాయి.

హైకోర్టు సీరియస్ తోనే..

నిర్మల్ జిల్లా కేంద్రం చుట్టూ ఉన్న చెరువులతో పాటు పట్టణంలో విస్తరించిన చెరువులు భారీగా ఆక్రమణకు గురయ్యాయి. దీనిపై పెద్ద మొత్తంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయినప్పటికీ చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ, ల్యాండ్ సర్వే, మున్సిపల్​శాఖ అధికారులు నెపం ఒకరిపై మరొకరు వేసుకోవడం పరిపాటిగా మారింది. చెరువుల పరిరక్షణ చూడాల్సిన నీటిపారుదల శాఖ అధికారులు అసలు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అయితే నిర్మల్ కు చెందిన ప్రముఖ న్యాయవాది అంజుకుమార్ రెడ్డి హైకోర్టులో వేసిన కేసు తీగలాగితే డొంక కదిలిన చందంగా నిర్మల్ చుట్టూ ఉన్న చెరువుల ఆక్రమణలకు చుట్టుకున్నది. హైకోర్టు సీరియస్ గా స్పందించడం… స్వయంగా జిల్లా కలెక్టర్ ను కోర్టుకు హాజరు కావాలని ఆదేశించడంతో చెరువు భూముల ఆక్రమణలపై అధికార యంత్రాంగం కఠిన చర్యలకు దిగింది.

కఠినంగా వ్యవహరిస్తున్న కలెక్టర్

చెరువు భూముల ఆక్రమణ విషయంలో నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కుర్రన్న పేట్ చెరువు ఆక్రమణలపై కన్నెర్ర చేసిన కలెక్టర్ పలు సంఘాల భవనాలను కూల్చివేయాలని ఆదేశించారు. వెంటనే అధికారులు ఆక్రమణలను తొలగించారు. ఇప్పుడు తాజాగా మిగిలిన చెరువులో ఆక్రమణలపై కలెక్టర్ దృష్టి సారించి ల్యాండ్ సర్వే అధికారులను సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే బుధ,గురువారాల్లో నిర్మల్ నిజామాబాద్ రోడ్ లో ఉన్న కంచెరోని చెరువు ఎఫ్ టీ ఎల్ హద్దులు గుర్తించే సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో అధికార యంత్రాంగం విస్తుపోయే రీతిలో అక్రమాలు వెలుగు చూసినట్లు చెబుతున్నారు. సుమారు 50కి పైగా అక్రమంగా చెరువు భూముల్లో ప్లాట్లు ఆక్రమణకు గురైన ట్లు తేలడం గమనార్హం.

చెరువు భూముల చుట్టూ ట్రెంచ్ కటింగ్ పనులు

చెరువుల భూములు ఆక్రమణలకు గురైన నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా ల్యాండ్ సర్వే అధికారులు పూర్తి స్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు. చెరువులో చుట్టూ ట్రెంచ్ కటింగ్ పనులు ప్రారంభించారు. ఫుల్ ట్యాంక్ లెవెల్ గుర్తించి బఫర్ జోన్ సరిహద్దుల్లో ఈ ట్రెంచ్ కటింగ్ పనులు చేపడుతున్నారు. దీంతో ఆక్రమణకు గురైన భూముల వ్యవహారాలు వెలుగు చూస్తున్నాయి. అక్రమంగా చెరువులను ఆక్రమించి ప్లాట్లు చేసి అమ్మిన రియల్ వ్యాపారుల్లో వణుకు ప్రారంభమైంది. ఈ ప్లాట్లు కొనుగోలు చేసిన వారు సైతం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

పక్కాగా సర్వే

నిర్మల్ పట్టణంతోపాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని చెరువులు, కుంటలను సర్వే చేస్తున్నాం. కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశాల మేరకు చెరువుల ఆక్రమణలను గుర్తించి తొలగిస్తున్నాము. ఎక్కడైనా చెరువుల భూముల్లో భవనాలు, నివాస గృహాలు అక్రమంగా నిర్వహించినట్లు తేలితే వారికి తొలగింపు నోటీసులు ఇస్తున్నాం. పకడ్బందీగా సర్వే నిర్వహించి చెరువుల భూముల హద్దులను తేలుస్తాం. ఎలాంటి ఒత్తిడులకు లొంగ కుండా సర్వే పనులు చేపడతాం.

-దశరథ్, అసిస్టెంట్ డైరెక్టర్, ల్యాండ్ సర్వే శాఖ, నిర్మల్ జిల్లా

Advertisement

Next Story

Most Viewed