మొరాయిస్తున్న రిజిస్ట్రేషన్ సర్వర్లు

by Shyam |
మొరాయిస్తున్న రిజిస్ట్రేషన్ సర్వర్లు
X

దిశ ప్రతినిధి, మెదక్: లింక్ డాక్యుమెంట్ల ద్వారా వ్వయసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రభుత్వ అనుమతి రావడంతో కొంత వెసులుబాటు లభించినట్టయింది. లింక్ డాక్యుమెంట్ ఉంటే ఎఆర్ఎస్ లేకున్నా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ప్రభుత్వం చెప్పడంతో ఒక్కసారిగా భూ క్రయ, విక్రయదారులు రిజిస్ట్రేషన్ కార్యాలయాల బాట పట్టారు. అందరూ ఒకేసారి కార్యాలయానికి రావడంతో సర్వర్ డౌన్ అయితుంది. మొన్నటి వరకు ధరణితో ఇబ్బందులు పడ్డ అధికారులు ఇప్పుడు రిజిస్ట్రేషన్‌కు సర్వర్ మొరాయిస్తుండటంతో ఈ రకంగానూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, ఎల్ఆర్ఎస్ ఎత్తివేతతో తమ వ్యాపారం మళ్లీ పుంజుకుంటుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు..

ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో 16 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్ లో ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ తో భూ క్రయ విక్రయాలు నిలిచాయి. ఎల్ఆర్ఎస్‌ను ఎత్తివేయలని, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గి కొన్ని సడలింపులు ఇచ్చింది. దీంతో జనం తాము కొనుగోలు చేసిన భూములను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయాల బాట పట్టారు. దీంతో ఒక్కో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఎలాంటి సమస్యలు లేకుడా ఉన్నటువంటి భూములు 30-40 వరకు రిజిస్ట్రేషన్లు అవుతున్నట్టు సమాచారం.

మొరాయిస్తున్న సర్వర్..

ధరణి చిక్కులతో బాధపడ్డ అధికారులకు ఇప్పుడు సర్వర్ డౌన్ మరొక సమస్యగా మారింది. అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఒక్కసారిగా రిజిస్ట్రేషన్లు ఊపందుకోవడంతో సర్వస్ సతాయిస్తుంది. జనం భారీగా రావడంతో మాటిమాటికీ సర్వర్ డౌన్ అవుతుంది. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారు నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది. దీనికి తోడు కొత్తగా వెంచర్లు చేసిన వాటిలో ప్లాటు కొనుగోలు చేసిన వారు సైతం ఎఆర్ఎస్ కట్టకుండానే రిజిస్ట్రేషన్ ఆఫీసు వస్తుండటంతో అధికారులకు ఎవరూ ఎస్ఆర్ఎస్ చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎవరికి అవసరం లేదు అనే విషయంలో సందిగ్ధంలో పడిపోతున్నారు.

సంతోషంలో రియల్ వ్యాపారులు..

ఎట్టకేలకు ప్రభుత్వం ఎఆర్ఎస్ ఎత్తివేయడంతో రియల్ వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీరి వ్యాపారం మళ్లీ ఊపందుకోనుంది. కరోనా లాక్ డౌన్కు ముందు రియల్ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలు.. అన్నట్టుగా సాగేది. కరోనా లాక్ డౌన్, ఎల్ఆర్ఎస్ అంశంలో రియల్ వ్యాపారం ఒక్కసారిగా కుదేలైన విషయం తెలిసిందే. దీంతో గతంలో రియల్ వ్యాపారులు పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, నిరసనలు తెలిపారు. ఎల్ఆర్ఎస్, ధరణితో కొత్త సమస్యలు ఎదురవడంతో ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గి పలు సడలింపులిచ్చి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రియల్ వ్యాపారులు తమ వ్యాపారం మళ్లీ లాభాల బాటలో నడవనుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story