- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మందుపాతర పేల్చిన మావోయిస్టులు..

దిశ ప్రతినిధి, ఖమ్మం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి అత్యంత సమీపంలోని పెద్ద ముసలేరు-తిప్పాపురం గ్రామాల మధ్య ఉన్న రోడ్డులో మావోయిస్టులు మందుపాతరను పేల్చారు. ఆదివారం రాత్రి 11గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పేలుడు శబ్దం దాదాపు 3 కిలోమీటర్ల దూరంలోని చర్ల మండల వాసులకు వినబడటంతో ఒక్కసారిగా వారంతా ఉలిక్కిపడ్డారు. మందుపాతర ధాటికి సమీపంలోని కల్వర్టు పాక్షికంగా ధ్వంసమైంది. మందుపాతర పేలిన స్థలంలో రోడ్డుపై పెద్ద గొయ్యి ఏర్పడింది.
ఇటీవల గుండాల మండలం దేవళ్లగూడెం వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా అర్లపల్లి గ్రామానికి చెందిన మావోయిస్టు దేవా అలియాస్ శంకర్ మృతి చెందిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకార చర్యగా మావోయిస్టులు ఈ చర్యకు పాల్పడినట్లుగా సమాచారం. మందుపాతర పేల్చిన స్థలంలో మావోయిస్టులు ఓ లెటర్ కూడా వదిలివెళ్లారు. బూటకపు ఎన్‌కౌంటర్లను నిరసిస్తున్నట్లుగా అందులో పేర్కొన్నారు. శంకర్ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టు పార్టీ ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం, తూర్పుగోదావరి జిల్లాల్లో బంద్‌కు పిలుపునిచ్చింది. రోజంతా ప్రశాంతంగా గడిచిందని పోలీసులు ఊపిరి పీల్చుకుంటుండగా రాత్రి 11గంటల సమయంలో మందుపాతర పేల్చడంతో పోలీస్‌వర్గాల్లో మళ్లీ కలవరం మొదలైంది.