వివాహితను రక్షించిన లేక్ పోలీసులు

by  |
వివాహితను రక్షించిన లేక్ పోలీసులు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: భర్త వేధింపులు తాళలేక, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు యత్నించిన వివాహితను లేక్ పోలీసులు రక్షించారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా లోయర్ మానేర్ డ్యాం వద్ద శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. జీవనోపాధి వచ్చి కరీంనగర్ పెద్దమ్మ కాలనీలో నివాసముంటున్న వివాహితను భర్త సంపత్ తరచూ మానసికంగా వేధిస్తుండటంతో పాటు, కొన్ని రోజులుగా శారీరకంగా చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. నిన్న రాత్రి కూడా ఆమెను చిత్రహింసలకు గురిచేయడంతో జీవితంపై విరక్తి చెందిన సదరు వివాహిత ఇవాళ లోయర్ మానేరు డ్యామ్‌లో దూకి సూసైడ్ చేసుకుందామని వచ్చి.. సమీపంలో బెంచ్‌పై కూర్చుని ఏడుస్తోంది.

ఆమెను గుర్తించిన లేక్ పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో ఆమె పడుతున్న బాధలు, ఇక్కడికి రావడానికి గల కారణాలు వివరించింది. ఈ విషయాన్ని కానిస్టేబుళ్లు లేక్ అవుట్ పోస్ట్ ఇన్చార్జి ఎస్ఐ శ్రీనాథ్‌కు చెప్పారు. ఆయన వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సదరు వివాహిత తల్లి, సోదరికి సమాచారమిచ్చారు. వాళ్ళిద్దరి సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి బాధ్యులకు అప్పగించారు. మళ్ళీ భర్త నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఫిర్యాదు చేయాలని, అప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. వివాహితను రక్షించిన కానిస్టేబుళ్ళు ఎన్ నరసింహారెడ్డి, డి.అశోక్‌లను అభినందిస్తూ కరీంనగర్ సీపీ వీబీ కమలాసన్ రెడ్డి రివార్డులు ప్రకటించారు.


Next Story