ప్యాకేజీ-9తో లక్ష ఎకరాలకు సాగునీరు

by  |
ప్యాకేజీ-9తో లక్ష ఎకరాలకు సాగునీరు
X

దిశ, కరీంనగర్:
కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-9తో రాజన్న సిరిసిల్ల మొత్తం సస్యశ్యామలం కానుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు.మంగళవారం కోనరావుపేట మండలం మల్కపేటలో ప్యాకేజీ-9 పనుల పురోగతిని ఆయన, రాష్ట్ర నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ సమీక్షించారు.యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచనలు చేశారు. ప్యాకేజీ-9 పనులు పూర్తయితే జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని వినోద్ కుమార్ స్పష్టంచేశారు.ఈ ప్యాకేజీ కింద ఇప్పటికే ప్రధాన కాలువల నిర్మాణం దాదాపుగా పూర్తయ్యిందన్నారు. సొరంగం నిర్మాణ పనులు, పంప్ హౌజ్ పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.దసరా నాటికల్లా పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.

సెప్టెంబర్ నెలకల్లా..

సెప్టెంబర్ నెలాఖరులోగా ప్యాకేజీ-9 పనులను పూర్తి చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. సొరంగ మార్గం, పుంపు హౌజ్, బండ్, ప్రధాన కాల్వల పనులు మరింత వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పనులను పర్యవేక్షించాలని, రోజువారీగా పనుల ప్రగతిని ఫోటోలు తీసి వాట్సాప్ ద్వారా తనకు పంపించాలని ఆదేశించారు. ప్యాకేజీ 9 ప్రాధాన్యత దృష్ట్యా పనులు వేగంగా జరిగేలా గుత్తేదారులు పూర్తి సహకారం అందించాలన్నారు.ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తామని, నిర్మాణ పనుల్లో క్షేత్ర స్థాయిలో ఏమైనా అవాంతరాలు, ఇబ్బందులు ఎదురైతే వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు. ప్యాకేజీ 9 లో కీలకమైన సొరంగ మార్గం పనులు 12 కి.మీ.మేర పని ఇప్పటికే పూర్తి చేసినందున, మిగిలిన 50 మీటర్ల మేర సొరంగ మార్గం తవ్వే పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అన్నారు. వచ్చే సెప్టెంబర్ నెలాఖరులోగా ప్యాకేజీ -9 పనులు పూర్తి చేసి అక్టోబర్ 15లోగా ఎగువ మానేరుకు గోదావరి జలాలు చేరేలా చూడాలన్నారు. కార్యక్రమంలో నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ మురళీధర్, ఈఎన్‌సీ హరిరాం, టెస్కాబ్ ఛైర్మన్ కోండూరి రవిందర్ రావు, జెడ్పీ ఛైర్మన్ న్యాలకొండ అరుణ, ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ రిజ్వాన్ షేక్ బాషాలు పాల్గొన్నారు.


Next Story

Most Viewed