హైద‌రాబాద్ పార్ల‌మెంట్ ప్రగతిపై సమీక్ష

by Shyam |
హైద‌రాబాద్ పార్ల‌మెంట్ ప్రగతిపై సమీక్ష
X

దిశ, న్యూస్ బ్యూరో: హైద‌రాబాద్ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని చేప‌ట్టిన‌ ప‌నుల‌ను వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకోవాల‌ని రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం జీహెచ్‌ఎంసీ కార్యాల‌యంలో నిర్వ‌హించిన‌ స‌మావేశంలో.. ఎస్‌.ఆర్‌.డి.పి కింద మంజూరు చేసిన ఫ్లైఓవ‌ర్లు, అండ‌ర్ పాస్‌లు, ఫుట్ ఓవ‌ర్ బ్రిడ్జిలు, రోడ్ల విస్త‌ర‌ణ ప‌నులు, మెట్రో లైన్ నిర్మాణానికి అవ‌స‌ర‌మైన భూసేక‌ర‌ణ, మంచినీటి స‌ర‌ఫ‌రా పైప్‌లైన్ల నిర్వ‌హ‌ణ‌, క్రీడా మైదానాల నిర్మాణం, నాలాల వెడ‌ల్పు త‌దిత‌ర మౌలిక వ‌స‌తుల ప‌నుల ప్ర‌గ‌తిని స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైద‌రాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధిలోని అన్ని వి.డి.సి.సి రోడ్లను అభివృద్ది చేసేందుకు ప్ర‌తిపాద‌న‌లు రూపొందించాల‌ని ఇంజ‌నీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. చివ‌రి ప్రాంతాల‌కు తాగునీటి స‌ర‌ఫ‌రా చేయుటానికి కొత్తగా పైప్‌లైన్ల‌ను నిర్మించాల‌ని తెలిపారు.

మురుగునీటి పారుద‌ల వ్య‌వ‌స్థ‌ను ఆధునీక‌రించుట‌కు, నాలాల విస్త‌ర‌ణ‌కు రూ. 200 కోట్లను ప్ర‌భుత్వం మంజూరు చేసిన‌ట్లు తెలిపారు. మౌలిక వ‌స‌తుల విస్త‌ర‌ణ‌లో భాగంగా 20 రోడ్ల‌ను వెడ‌ల్పు చేయుట‌కు, ప్ర‌తిపాదిత మెట్రో రైలు మార్గంలో ప‌నులు చేప‌ట్టుట‌కు అవ‌స‌ర‌మైన భూసేక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయుట‌కై ప్ర‌త్యేకంగా ఒక స్పెష‌ల్ ఆఫీస‌ర్‌ను నియ‌మించాల‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్‌కు సూచించారు. రోడ్ల విస్త‌ర‌ణ‌కు సానుకూలంగా స్పందించిన వారి ఆస్తుల‌ను వెంట‌నే సేక‌రించాల‌ని, నిబంధ‌న‌ల ప్ర‌కారం చెల్లింపులు జ‌రిపి సంబంధిత ఆస్తుల‌ను స్వాధీనం చేసుకొని నిర్మాణాల‌ను కూల్చివేయాల‌న్నారు.

ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల మేర‌కు రోడ్ల వెడ‌ల్పు, అండ‌ర్ పాస్‌లు, ఫ్లైఓవ‌ర్లు, జంక్ష‌న్ల అభివృద్ది, సుంద‌రీక‌ర‌ణ‌, బ‌స్‌షెల్ట‌ర్ల నిర్మాణం, ప‌బ్లిక్ టాయిలెట్ల నిర్మాణం, పార్కులు, స్పోర్ట్స్ స్టేడియంల అభివృద్ది ప‌నుల‌ను వేగంగా పూర్తిచేసేందుకు స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించాల‌ని ఆదేశించారు. రైల్వే అధికారుల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్చించి రైల్వే అండ‌ర్ పాస్ ప‌నుల‌ను పూర్తిచేయాల‌ని సూచించారు. ఈస్ట్ – వెస్ట్ కారిడార్‌లో భాగంగా మూసి న‌దికి ఇరువైపులా నాలుగు లేన్ల రోడ్డును నిర్మించాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తున్న‌ట్లు తెలిపారు. స్థ‌లాల అందుబాటును బ‌ట్టి గ‌జ్వేల్ త‌ర‌హాలో ఇంటిగ్రేటెడ్‌ మోడ‌ల్ మార్కెట్ల‌ను నిర్మించుట‌కు ప్ర‌తిపాన‌ద‌లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

ప్ర‌జ‌ల‌లో ఆరోగ్య సంర‌క్ష‌ణ ప‌ట్ల శ్ర‌ద్ద పెరిగినందున పార్కుల‌లో ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేయాల‌ని సూచించారు. లేఅవుట్ ఓపెన్ స్పేస్‌ల‌లో, పార్కుల‌లో షీ-టాయిలెట్లు, ప‌బ్లిక్ టాయిలెట్లు నిర్మించాల‌ని తెలిపారు. వేస‌విలో నీటి ఎద్ద‌డి రాకుండా ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వాట‌ర్ వ‌ర్క్స్ ఎండీ దాన‌కిషోర్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, హైద‌రాబాద్‌ పార్ల‌మెంట్ స‌భ్యులు అస‌దుద్దీన్ ఓవైసి, ఎం.ఐ.ఎం శాస‌న స‌భా ప‌క్ష‌నేత అక్బ‌రుద్దీన్ ఓవైసి, డిప్యూటి మేయ‌ర్ మ‌హ్మ‌ద్ బాబా ఫ‌సియుద్దీన్‌, జిహెచ్‌ఎంసి క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్‌, జ‌ల‌మండ‌లి మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఎం.దాన‌కిషోర్‌, ఇంజ‌నీరింగ్ విభాగాల చీఫ్ ఇంజ‌నీర్లు, వాట‌ర్ వ‌ర్క్స్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్లు, చార్మినార్‌, ఖైర‌తాబాద్ జోన‌ల్ క‌మిష‌న‌ర్లు పాల్గొన్నారు.

tags: ktr, meeting, Owaisi brothers, ghmc officials, hyderabad

Advertisement

Next Story

Most Viewed