కేఆర్ఎంబీ నివేదిక : పరిమితికి మించి ‘రాయలసీమ ఎత్తిపోతల’ పనులు..

by Anukaran |   ( Updated:2021-08-14 12:01:06.0  )
Rayalaseema
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదీ జలాలను వినియోగించుకోడానికి రాయలసీమ ఎత్తిపోతల పనులు మోతాదుకు మించి జరుగుతున్నట్లు కేఆర్ఎంబీ నిపుణుల బృందం గుర్తించింది. కేవలం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ కోసమే పనులు జరుగుతున్నట్లు ఏపీ ప్రభుత్వం గతంలో వివరించిందని, కానీ క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత మాత్రం ఆ అవసరాల కంటే ఎక్కువగా భారీ స్థాయిలోనే పనులు జరుగుతున్నట్లు తేలిందని తన నివేదికలో పేర్కొన్నది. ఎన్జీటీలో సోమవారం జరగనున్న విచారణ కోసం పన్నెండు పేజీల్లో నివేదికను రూపొందించింది. అక్కడ జరుగుతున్న పనులకు సంబంధించిన ఫోటోలను కూడా ఆ నివేదికలో పొందుపరిచింది. ముగ్గురు సభ్యులతో కూడిన బృందం బుధవారం క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి మూడు అంశాలను నొక్కిచెప్పింది.

ఏపీ ప్రభుత్వం చెప్పినట్లుగా డీపీఆర్ తయారీ కోసం మాత్రమే పనులు చేస్తున్నట్లు క్షేత్రస్థాయిలో పరిస్థితులు లేవని, అంతకుమించి జరుగుతున్నాయని, నిజంగా డీపీఆర్‌కు సాధారణ స్థాయిలో మాత్రమే పనులు ఉంటాయని, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రాంతంలో మాత్రం చాలా ఎక్కువ పనులే జరిగాయని పేర్కొన్నది. తనిఖీ చేపట్టిన సమయంలో మాత్రం ఎలాంటి పనులు జరగలేదని, తమతోపాటు కర్నూలు చీఫ్ ఇంజనీర్ కూడా పర్యటనలో ఉన్నారని, మొత్తం వివరాలను తెలియజేశారని పేర్కొన్నది. సిమెంటు కాంక్రీటు తయారీ కోసం బ్యాచింగ్ ప్లాంట్ కూడా ఉన్నదని, దానికి పక్కనే ఇసుక, కంకర, ఇతర ముడిపదార్ధాలు కూడా రాశులుగా పోసి కనిపించినట్లు ఆ నివేదికలో బృందం పేర్కొన్నది.

Rayalaseema Ethipothala

ప్రాజెక్టు ప్రాంతంలో ఒక అప్రోచ్ ఛానల్ నిర్మాణమైందని, కానీ తనిఖీ సమయంలో 884 అడుగుల మేర శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి మట్టం ఉన్నందువల్ల అప్పటికే తవ్విన కాల్వ నీట మునిగిపోయిందని, 15 మీటర్ల మేర మాత్రం తవ్వకం లేకుండా ఉన్నందున అది బైటకే ఉండిపోయిందని పేర్కొన్నది. అదే ప్రాంతంలో 273 మీటర్ల పొడవునా లోతైన ఫోర్‌ బే తయారైందని, 150 అడుగుల లోతు మొదలు పంప్ హౌజ్ దగ్గరకు వెళ్ళే మార్గంలో 180 లోతున ఏటవాలుగా నిర్మాణమైందని, దానికి పక్కనే రాంప్‌, పక్కవైపున గోడలు కూడా ఏర్పాటయ్యాయని పేర్కొన్నది.

శ్రీశైలం రిజర్వాయర్‌లో 730 అడుగుల నీటి మట్టం ఉన్నా నీటిని తోడివేయడానికి 250 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పులో పంప్ హౌజ్ నిర్మాణం కోసం పెద్ద గొయ్యి తవ్వకం కూడా పూర్తయిందని పేర్కొన్నది. ఇక్కడి నుంచి నీటిని పంపడానికి ఐదు మీటర్ల వ్యాసంలో 12 భారీ స్థాయి పైపులతో టన్నెల్ నిర్మాణం కూడా జరుగుతున్నదని, ఇందులో ఇప్పటికే పది పైపుల నిర్మాణం ముగింపు దశలో ఉన్నదని పేర్కొన్నది. ఈ టన్నెల్ కోసం దాదాపు 50 మీటర్ల వెడల్పులో తవ్వకం పూర్తయిందని వివరించింది. ఈ పనులన్నీ చేయడానికి అవసరమైన కార్మికులు అక్కడే బస చేసేందుకు వీలుగా ఎగువ భాగంలో షెడ్లు కూడా నిర్మాణమయ్యాయని తెలిపింది.

ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను చేపట్టినట్లు నారాయణపేట జిల్లాకు చెందిన గవినోళ్ళ శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన గ్రీన్ ట్రిబ్యునల్ క్షేత్రస్థాయిల పరిశీలన జరిపి తదనుగుణమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సిందిగా కేఆర్ఎంబీని ఆదేశించింది. జూలై నుంచి మూడు దఫాలుగా తనిఖీ జరపడానికి ఆటంకాలు ఎదురుకావడంతో చివరకు తుది అవకాశం అంటూ ఎన్జీటీ హెచ్చరించడంతో కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి రాయపూర్‌తో సహా మౌంతంగ్, దర్పణ్ తల్వార్‌లతో కూడిన బృందం ఈ నెల 11న పరిశీలన చేపట్టి నివేదికను రూపొందించింది. ఈ నివేదికను పరిశీలించిన తర్వాత సోమవారం జరిగే విచారణ సందర్భంగా ఎన్జీటీ ఎలాంటి కామెంట్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed