ఏపీకి వెళ్లడం కష్టమే.. కేఆర్​ఎంబీ మరో ప్లాన్​!

by srinivas |   ( Updated:2021-07-08 02:31:10.0  )
rayalaseema 1
X

దిశ, తెలంగాణ బ్యూరో : కృష్ణా జల వివాదాల్లో భాగంగా రాయలసీమ ఎత్తిపోతల పరిశీలనకు కృష్ణా బోర్డు నిపుణుల బృందం పర్యటనపై సందిగ్ధం నెలకొంది. ఈ పర్యటన మళ్లీ వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌గా ఎంపీ సింగ్​బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ప్రస్తుతం దీనిపై అధ్యయనం చేయాల్సి ఉందని, ఇప్పుడే జల వివాదాలపై ఏం మాట్లాడలేమని వెల్లడించారు. బుధవారం విధుల్లో చేరేందుకు వచ్చిన ఎంపీ సింగ్‌కు కేఆర్​ఎంబీ ఇంజినీర్లు స్వాగతం పలికారు. రెండు రాష్ట్రాల అధికారులు ఆయనతో భేటీ అయ్యారు.

కొంత సమయం ఇవ్వండి..!

ప్రస్తుతం రాయలసీమ ఎత్తిపోతల పరిశీలనకు నిపుణుల బృందం వెళ్లేందుకు ఎన్జీటీ డెడ్​లైన్​ విధించిన విషయం తెలిసిందే. ఈ నెల 12లోగా నివేదిక సమర్పించాలని సూచించింది. మరోవైపు కేంద్రం నుంచి కూడా దీనిపై ఆదేశాలు ఇచ్చినా… మళ్లీ ఎలాంటి సమాచారం రాలేదు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నుంచి అధికారికంగా తేదీ ఖరారు చేసి సమాచారం ఇస్తారని కేఆర్​ఎంబీ ఎదురు చూసింది. బోర్డు నుంచి కూడా దీనిపై లేఖ రాసిన విషయం తెలిసిందే. కేంద్ర బలగాల రక్షణ లేకుండా వెళ్లలేమంటూ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. దీనిపై కూడా ఎలాంటి రిప్లై రాలేదు. దీంతో పర్యటన ఖరారు కాలేదని తెలుస్తోంది. మరోవైపు బోర్డు కొత్త చైర్మన్​ కూడా బుధవారమే రావడంతో దీనిపై నిర్ణయం తీసుకోవడం లేదు. ఈ అంశాలపై పూర్తిగా చర్చించిన తర్వాతే పరిశీలన ఉంటుందని కేఆర్​ఎంబీ ఇంజినీర్లు చెప్పుతున్నారు.

అయితే ఈ నెల 12లోగా ఎన్జీటీకి నివేదిక ఇవ్వాల్సిన నేపథ్యంలో నిపుణుల కమిటీ తరుపున బోర్డు సమయం తీసుకోవాలని భావిస్తోంది. బోర్డు ఛైర్మన్​ఇటీవలే రావడంతో పాటుగా పలు కారణాలతో రాయలసీమ ఎత్తిపోతల పరిశీలనకు వెళ్లలేకపోయామని, కొన్ని రోజులు సమయం అడిగేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

త్రీమెన్​కమిటీ భేటీ కూడా వాయిదే

మరోవైపు బోర్డు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించాల్సిన త్రీమెన్​ కమిటీ సమావేశం కూడా వాయిదా పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ సమావేశానికి వెళ్లడంపై తెలంగాణ నుంచి అభ్యంతరం వ్యక్తం చేశారు. త్రీమెన్​ కమిటీ కాకుండా పూర్తిస్థాయి బోర్డు సమావేశం నిర్వహించాలని సూచించారు. దానిపై కూడా బోర్డు నిర్ణయం తీసుకోలేదు. బోర్డు చైర్మన్​తో పాటు ఇరు రాష్ట్రాల ఈఎన్సీలతో సమావేశం నిర్వహించాల్సి ఉండగా… తెలంగాణ నుంచి గైర్హాజరైతే సమావేశం వాయిదా పడనుంది. ఎలాగూ తెలంగాణ వచ్చేనెల 20 తర్వాత సమావేశం నిర్వహించాలని సూచించింది. దీంతో సమావేశానికి రామని చెప్పినట్టే. ఈ పరిస్థితుల్లో త్రీమెన్​కమిటీ భేటీ కూడా వాయిదా పడినట్లేనని అధికారులు చెప్పుతున్నారు.

Advertisement

Next Story