ప్రింటర్ కొని.. రూ.2 వేల నోట్లు ముద్రించాడు.. చివరకు!

by Sumithra |   ( Updated:2021-06-18 09:40:57.0  )
DCP-Venkateshwarlu
X

దిశ, కూకట్‌పల్లి: అతడొక సాధారణ ఆటో డ్రైవర్. ఎంతకష్టపడినా డబ్బులు సరిగా రాకపోవడంతో సులువుగా సంపాదించాలని వినూత్నంగా ఆలోచించాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కూకటక్‌పల్లిలో చోటుచేసుకుంది. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ సురేందర్ రావులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ పీఎస్‌కు చెందిన ఎస్ఐ శ్యాంబాబు సిబ్బందితో కలిసి కేపీహెచ్‌బీ కాలనీలోని గ్రావిటీ హోటల్ వద్ద మఫ్టీలో విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అనుమానస్పదంగా తిరుగుతున్న ఓ యువకుడిని పట్టుకొని విచారించగా.. అతడి జేబులో 8 రెండు వేల నోట్లు కనిపించాయి. దీంతో అటునుంచి అతడ్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌లో విచారణ ప్రారంభించి, మెదక్ జిల్లా అల్లడుగు గ్రామానికి చెందిన ఉప్పరి రాజు ప్రసాద్(రాజు)గా గుర్తించారు. గతకొంత కాలంగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులోని జేపీనగర్ కాలనీలో నివాసం ఉంటూ ఆటో నడుపుకునేవాడని తెలిపారు.

accused-Uppari-Raju-Prasad

ఈ క్రమంలో సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశ్యంతో OLXలో HP స్కానర్‌ కమ్ ప్రింటర్‌ను కొనుగోలు చేశాడు. అందులో రెండువేల నోట్లను స్కాన్ చేసి, వాటిని ప్రింట్ చేసి మార్కెట్‌లో చెలామణి చేసేందుకు ప్రయత్నించాడు. అప్పటికే రాజు.. పటాన్​ చెరువు, ఏపీలోని మందవల్లి, ఏలురు, బాచుపల్లి, సంగారెడ్డి పోలీస్​ స్టేషన్‌లలో పలు కేసులలో నిందితుడు. గత మార్చి నెలలో జైలు నుంచి విడుదల అయిన రాజు దొంగనోట్లను చెలామణి చేసేందుకు కూకట్‌పల్లిలో శుక్రవారం తిరుగుతుండగా.. అనుమానంతో కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్ట్ చేశారని డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. అతడి వద్ద నుంచి 14 రెండు వేల రూపాయల నోట్లు, HP స్కానర్‌ కమ్ ప్రింటర్‌, రియల్‌మీ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ మీడియా సమావేశంలో సీఐ లక్ష్మీనారాయణ, SI శ్యాంబాబు, సిబ్బందిని డీసీపీ అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed