కోటక్ మహీంద్రా బ్యాంక్ తొలి త్రైమాసిక లాభం రూ. 1,244 కోట్లు

by Shyam |
కోటక్ మహీంద్రా బ్యాంక్ తొలి త్రైమాసిక లాభం రూ. 1,244 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: కోటక్ మహీంద్రా బ్యాంక్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి తొలి త్రైమాసికంలో నికర లాభం 8.5 శాతం క్షీణించి రూ. 1,244 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాదిలో ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ. 1,360 కోట్లుగా ఉంది. ఇతర ఆదాయంలో 41 శాతం తగ్గి రూ. 773.5 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇది రూ. 1,317 కోట్లుగా ఉంది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ స్వతంత్ర ఆదాయం రూ. 7,685.40 కోట్లకు తగ్గింది.

గతేడాది ఇదే త్రైమాసికంలో రూ. 7,944.61 కోట్లుగా ఉన్నట్టు కోటక్ మహీంద్రా బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. స్థూల నిరర్ధక ఆస్తుల నిష్పత్తి 2.19 శాతం నుంచి 2.7 శాతానికి, నికర ఎన్‌పీఏల శాతం 0.73 శాతం నుంచి 0.87 శాతానికి పెరిగింది. ఇక, వార్షిక ప్రాతిపదికన నికర వడ్డీ ఆదాయం 17.81 శాతం పెరిగి రూ. 3,723.85 కోట్లకు చేరుకున్నట్టు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో బ్యాంకు పేర్కొంది. ఇక, తొలి త్రైమాసికంలో కొవిడ్-19 సంబంధిత అవసరాల కోసం సాధారణ కేటాయింపులను రూ. 616 కోట్లుగా బ్యాంక్ వెల్లడించింది. ఇది జూన్ చివరి నాటికి రూ. 1,266 కోట్లుగా తెలిపింది. కరోనా వల్ల బ్యాంకింగ్ కార్యకలాపాలపై, వసూళ్లపై ప్రభావం అధికంగా ఉన్నట్టు తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed