ఎంపీటీసీపై రౌడీ‌షీట్.. కొమరారం ఎస్సైపై HRCలో ఫిర్యాదు..

by Sumithra |
ఎంపీటీసీపై రౌడీ‌షీట్.. కొమరారం ఎస్సైపై HRCలో ఫిర్యాదు..
X

దిశ, గుండాల : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని కొమరారం పోలీసు‌స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న SI పై ఆ గ్రామ ఎంపీటీసీ అజ్మీర బిచ్చ గురువారం మానవ హక్కుల కమిషన్ (HRC)లో ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా తనను వేధిస్తూ తనపై అక్రమంగా రౌడీషీట్ ఓపెన్ చేశారని ఆరోపించారు. తాను ఒక ప్రజాప్రతినిధి అని, నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి ఉండి జనంలో తిరుగుంటానని తెలిపారు. ఇంతవరకు ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని, అలాంటప్పుడు తనపై అకారణంగా రౌడీషీట్ ఎలా ఓపెన్ చేస్తారని ప్రశ్నించారు.

కావాలని, కుట్రపూరితంగా ఎస్సై శ్రీధర్ హెడ్, కానిస్టేబుల్ తిరుమలరావు నన్ను వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై ఓపెన్ చేసిన రౌడీషీట్‌ను ఎత్తివేయాలని HRC ని కోరారు. కొమరారం ఎంపీటీసీ అజ్మీరా బిచ్చపై పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేయడం అప్రజాస్వామికమని.. ప్రశ్నించే గొంతులను రాజ్యం అణచివేస్తుందని న్యూ డెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు ఆరోపించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎంపికైన ఎంపీటీసీని ఇబ్బందులకు గురిచేయడం మానుకోవాలని పోలీసులను హెచ్చిరించారు. కాగా, తనపై కొమరారం ఎంపీటీసీ అజ్మీరా బిచ్చ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎస్ఐ శ్రీధర్ ‘దిశ’కు తెలిపారు. తాను రౌడీషీట్ ఓపెన్ చేయలేదని.. 2018లోనే రౌడీ షీట్ ఓపెన్ అయ్యి ఉందన్నారు. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ పోడు భూములు ఆక్రమించారనే అభియోగంపై గతంలోనే ఈ కేసు నమోదు అయిందని క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Next Story