డిప్యూటీ మేయర్ సైకిల్ సవారీ

by Shyam |
డిప్యూటీ మేయర్ సైకిల్ సవారీ
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఎవరైనా కార్పొరేటర్.. తన డివిజన్‌కు సంబంధించిన ప్రజలను పార్టీ, క్యాంప్ ఆఫీసులో గానీ లేదంటే కాలనీ సంక్షేమ సంఘాలు, సీనియర్ సిటిజన్స్ ఏర్పాటు చేసిన మీటింగ్స్‌లో గానీ కలుస్తుంటారు. ఇక కార్పొరేటర్ అన్నాక.. దాదాపు కారులోనే వెళ్లి, సమస్యలు పరిష్కరిస్తామని హామీలుస్తుంటారు. అయితే మహారాష్ట్రలోని ఓ నగర డిప్యూటీ మేయర్ మాత్రం వినూత్నంగా ప్రతిరోజు ఉదయాన్నే సైకిల్ మీద సవారీ చేస్తూ.. బస్తీవాసులను పలకరిస్తున్నాడు. డివిజన్‌లో ఏయే సమస్యలున్నాయో ప్రజలను అడిగి తెలుసుకుంటున్నాడు. సమస్యల పరిష్కారం కోసం అక్కడ నుంచే ఆఫీసర్లకు పనులపై ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎవరు ఆయన? ఇంతకీ ఆయన లక్ష్యమేంటి?

మహారాష్ట్రలోని కొల్హాపూర్ నగరానికి చెందిన సంజయ్ మొహితె.. కొల్హాపూర్ మున్సిపల్ కార్పొరేషన్(కేఎంసీ) డిప్యూటీ మేయర్. నగరవాసులకు ‘సైకిట్ సమరిటన్’‌గా సుపరిచితుడు. రోజూ ఉదయాన్నే 7 గంటలకు సైకిల్ మీద నగరవీధుల్లోకి బయలుదేరుతాడు. 60 ఏళ్ల వయసులోనూ ఒకరోజు కూడా మిస్ చేయకుండా బస్తీవాసులను కలుస్తాడు. 6వేలకు పైగా వీధులున్న కొల్హాపూర్ నగరంలో రోజుకో రెండు మూడు వీధుల్లో ఆయన పర్యటిస్తుంటారు. తమ తమ పనుల్లో బిజీగా ఉన్న ప్రజలను సైతం పలుకరిస్తూ ముందుకు సాగుతున్నాడు సంజయ్.

తనకు జాతిపిత మహాత్మ గాంధీ స్ఫూర్తి అని అంటున్న సంజయ్ మొహితె.. గాంధీ మాదిరి ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటూ, వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలన్నదే తన లక్ష్యమని తెలిపాడు. ప్రజల వద్దకు మనం వెళ్లినప్పుడు మాత్రమే సమస్య గురించి తెలుస్తుందని అంటున్నాడు. అలా సమస్య తెలిసిన వెంటనే అక్కడ్నుంచే పరిష్కారానికి ఆఫీసర్లకు ఆదేశాలిస్తానని చెబుతున్నారు. కాగా, సైకిల్ మీద సవారీ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటున్నానని, ఐదేళ్లుగా రోజూ సైకిల్ సవారీ చేస్తున్నానని పేర్కొంటున్నాడు. టెక్నాలజీ మార్పులు, వేగవంతమైన మాధ్యమాలు వచ్చినప్పటికీ తను ప్రజలతో పర్సనల్ కాంటాక్ట్‌లో ఉండటానికే ఇష్టపడతానని చెబుతుండటం విశేషం.

Advertisement

Next Story

Most Viewed